ఆయన నేరుగా ప్రయోజనం పొందలేదుకదా?
న్యూఢిల్లీ: వివాదాస్పద ఢిల్లీ లిక్కర్ కేసులో జైల్లో ఉన్న మనీశ్ సిసోడియాపై ఆధారాలు ఏమున్నాయని సుప్రీం కోర్టు దర్యాప్తు సంస్థలను ప్రశ్నించింది. గురువారం ఆయన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. ‘సాక్ష్యాలేవి? ఆధారాలేవి? ఘటనల క్రమాన్ని మీరు నిరూపించాలి కదా! లిక్కర్ లాబీ నుంచి సొమ్ము ఒక వ్యక్తి చేతికి రావాలి. ఈ నేరంలో డబ్బు ఎక్కడికిపోయింది?’ అని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ అధికారులను సుప్రీంకోర్టు నిలదీసింది. సౌత్ గ్రూప్ లేదా లిక్కర్ లాబీ సంభాషణల్లో మనీశ్ సిసోడియా లేని విషయాన్ని సుప్రీం కోర్టు ప్రస్తావించింది. ఆయనను మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా ఎలా చేరుస్తారని ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
‘మనీశ్ సిసోడియా భాగస్వామి అయినట్టు కనిపించడం లేదు. విజయ్ నాయర్ ఉన్నారు కానీ.. మనీశ్ సిసోడియా లేరు. మనీలాండరింగ్ చట్టం కిందకు ఆయనను మీరెలా తెస్తారు?’ అని ప్రశ్నించింది. సదరు సొమ్ము ఆయనకు వెళ్లలేదని పేర్కొన్నది. దర్యాప్తు సంస్థల తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపిస్తూ.. నేర ప్రయోజనాలతో సంబంధం ఉన్న కార్యకలాపాలు లేదా ప్రక్రియలో ఆయన భాగస్వామి అయ్యారని తెలిపారు. నేరానికి సంబంధించిన ప్రయోజనాలు అందుకున్నప్పుడు లేదా చెల్లించినప్పుడు మాత్రమే మనీలాండరింగ్ చట్టం ముందుకు వస్తుందని సుప్రీం కోర్టు గుర్తు చేసింది. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నేర ప్రయోజనాలు పొందిన వ్యక్తిని మాత్రమే ఈ కేసులో చేర్చగలరని పేర్కొన్నది.
మద్యం పాలసీ కేసులో దోషులెవరైనా వారిని న్యాయస్థానం ముందుకు తేవాలని నిర్ణయించుకున్నట్టు ఈడీ తెలిపింది. ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ గురించి కోర్టు ప్రస్తావిస్తూ.. ఒక విధానపరమైన నిర్ణయాన్ని ఈ విధంగా సవాలు చేయవచ్చా? అని ప్రశ్నించింది. కొందరు వ్యక్తులకు ఉద్దేశపూర్వకంగా లబ్ధి చేకూర్చే విధంగా పాలసీని రూపొందించారిన సీబీఐ వాదించింది. అందుకు సంబంధించిన వాట్సాప్ మెసేజ్‌లను సాక్ష్యాలుగా సమర్పించామని తెలిపింది. అయితే.. ఈ మెజేస్‌లను అంగీకరించే విషయంలో కొన్ని అభ్యంతరాలను సుప్రీం కోర్టు వ్యక్తం చేసింది. ఎక్సయిజ్ పాలసీ కేసులో నిందితులు సిగ్నల్ యాప్ ద్వారా కమ్యూనికేషన్ నిర్వహించారని, అది ట్రేస్ చేయడం సాధ్యం కాదని ఈడీ తెలిపింది.
గోవా అసెంబ్లీ ఎన్నికలకు వివిధ భాగస్వాముల ద్వారా ముడుపుల రూపంలో వంద కోట్ల రూపాయలను ఆప్ అందుకున్నదని ఈడీ ఆరోపించింది. ఈ కేసులో అప్పటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీశ్ సిసోడియాను సీబీఐ ఫిబ్రవరి 26వ తేదీన అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆయన కస్టడీలోనే ఉన్నారు. బుధవారం ఇదే కేసులో ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అప్రూవర్‌గా మారిన నిందితుడు దినేశ్ అరోరా నుంచి ‘కోట్ల రూపాయలను ముడుపుల రూపంలో అందుకున్నారని ఆరోపించింది.
అక్టోబర్ 10 వరకు ఈడీ కస్టడీకి సంజయ్‌సింగ్
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బుధవారం అరెస్టయిన ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్‌సింగ్‌ను ఐదు రోజుపాటు ఈడీ కస్టడీకి పంపారు. ఏడాది వ్యవధిలో ఈడీ అరెస్టు చేసిన మూడో ఆప్ నాయకుడు సంజయ్‌సింగ్. మనీశ్‌సిసోడియా, సత్యేందర్ జైన్ ఇప్పటికే వేర్వేరు కేసులలో అరెస్టయి ఉన్నారు.