సీఎం తేలని రాజస్థాన్‌

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడై వారం రోజులు దాటింది. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరింది. మిజోరాంలో జడ్‌పీఎం అధ్యక్షుడు నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది

  • Publish Date - December 11, 2023 / 03:05 PM IST
  • రాజె.. రాజీపడుతారా? తిరుగుబాటు చేస్తారా?
  • ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ సీఎంల ఎంపిక
  • రాజస్థాన్‌లో నెగ్గని మోదీ-షా మాట!
  • అందుకే ముఖ్యమంత్రి ఎంపికలో జాప్యం?

విధాత ప్రత్యేకం: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడై వారం రోజులు దాటింది. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరింది. మిజోరాంలో జోరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ (జడ్‌పీఎం) అధ్యక్షుడు లాల్‌ దుహోమా నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రులను బీజేపీ తేల్చినా.. రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి ఎవరన్నది ఇంకా ఖరారుకాలేదు.

ఛత్తీస్‌గఢ్‌లో రమణ్‌సింగ్‌ను పక్కనపెట్టి ఆదివాసీ నేత విష్ణు దేవ్ సాయిని కొత్త ముఖ్యమంత్రిగా ప్రకటించింది. మధ్యప్రదేశ్‌లోనూ శివరాజ్‌సింగ్‌ కాదని మోహన్‌ యాదవ్‌ను సీఎంగా ఎంపిక చేసింది. కానీ ఇప్పటికీ రాజస్థాన్‌ పీటముడి వీడలేదు. దీనికి కారణం ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వసుంధ రాజె బలప్రదర్శన చేయడమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 200 స్థానాలున్న ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 115 స్థానాల్లో గెలిచింది.

గెహ్లాట్‌ ప్రభుత్వం పడిపోకుండా..

కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో వలె రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచి అధికారాన్ని దక్కించుకున్నట్టే.. గెహ్లాట్‌, పైలట్‌ వర్గాల మధ్య విభేదాల ఆధారంగా అక్కడి ప్రభుత్వాన్ని కూలదోయాలని చూశారు. 2020 జూలైలో అప్పటి ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌, మరో 18 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గెహ్లాట్‌ కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. సుమారు నెల రోజుల పాటు ఆ సంక్షోభం సాగింది. చివరికి కాంగ్రెస్‌ అధిష్ఠానం జోక్యంతో ఆ వివాదానికి తెరపడింది. ఆ సంక్షోభ సమయాన్ని కమలనాథులు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశారు. కానీ ప్రయత్నానికి వసుంధ రాజె సహకరించలేదు. దీంతో బీజేపీ వ్యూహం బెడిసి కొట్టింది. తన ప్రభుత్వం కూలిపోకుండా వసుంధ రాజె కాపాడారని అశోక్‌ గెహ్లాట్‌ కూడా గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నుంచి కాషాయ పార్టీ అధిష్ఠానం వసుంధరను పక్కనపెట్టిందనే అభిప్రాయం ఉన్నది.

వసుంధర లేకుంటే కష్టమనే!

ఈసారి ఎన్నికలకు ముందు కూడా ఆమెకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ చూసింది. కానీ ప్రీపోల్‌ సర్వేల్లో ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ కాంగ్రెస్‌ గెలువబోతున్నదని, మధ్యప్రదేశ్‌లోనూ హోరాహోరీ తప్పదని అంచనాలు వెలువడ్డాయి. అప్పటికి ఆ రెండు రాష్ట్రాల్లో బీజేపీ గెలుస్తుందన్న నమ్మకం బీజేపీ హైకమాండ్‌కు కలగలేదు. ఇక్కడ గెలువకపోతే రేపు సార్వత్రిక ఎన్నికల్లో ఆ ప్రభావం ఉంటుందని, అందుకే ఇక్కడ ప్రయోగం చేయడంకంటే రాజెతో రాజీపడటమే మేలన్న నిర్ణయానికి వచ్చి ఆమెకు తప్పని పరిస్థితుల్లో ప్రాధాన్యం కల్పించింది. టికెట్ల కేటాయింపుల్లోనూ ఆమె నిర్ణయానికే పెద్దపీట వేసింది. 2003-2008, 2013-2018 వరకు రెండు సార్లు ముఖ్యమంత్రిగా వసుంధర రాజె బాధ్యతలు నిర్వర్తించారు. బీజేపీలో అద్వానీ, ఉమాభారతి, మురళీ మనోహర్‌జోషి లాంటి బలమైన నేతలను మోడీ ప్రధాని అయ్యాక వారి ప్రాధాన్యం తగ్గడమే కాకుండా వారందరనీ రాజకీయంగా దూరం పెట్టారనే ఆరోపణలున్నాయి. జాతీయస్థాయిలో కాదు స్థానికంగా బలం ఉన్నయడ్యూరప్పను కర్ణాటక ఎన్నికల సమయంలో పక్కనపెట్టారు.


ఇప్పుడు రమణ్‌సింగ్‌, శివరాజ్‌సింగ్‌లను పేర్లను కాకుండా అంతా నేనే అన్నట్టు మోదీ ప్రచారం చేశారు. మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలవడంతో మోదీ తిరుగులేని నేతగా మరోసారి నిరూపించుకున్నారు. కానీ మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో కొత్తవారిని సీఎంగా ఎంపిక చేసినట్టు రాజస్థాన్‌లోమాత్రం ఆ పార్టీ అధిష్ఠానం ఆ దిశగా అడుగులు వేయలేకపోతున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజస్థాన్‌లో చాలా పట్టున్న నేత వసుంధర. అందుకే బీజేపీ గెలిచిన అన్ని రాష్ట్రాల్లో మోదీ-షా ఎవరిని సూచిస్తే వారే సీఎం అన్న వాదన ఇక్కడ సాధ్యం కాదనేది ఆ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తోంది.

మోదీకి వ్యతిరేకంగా వసుంధర నిలబడుతారా?

ఫలితాలు వెల్లడైన తర్వాత వసుంధర రాజె 60 మందికి పైగా ఎమ్మెల్యేలకు ఫోన్‌ చేశారని వార్తలు వచ్చాయి. అందులో చాలామంది ఆమెతో భేటీ అయ్యారు. వారిలో స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. పార్టీ అధిష్ఠానం రాజెను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే తాము మద్దతు ఇస్తామని వెల్లడించినట్టు సమాచారం. రాజస్థాన్‌లో సీఎం పదవి కోసం కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్‌, గజేంద్ర షెకావత్‌, అర్జున్‌ మేఘ్వాల్, ఎంపీలు బాబా బాలక్‌నాథ్‌, దియాకుమారీ పేర్లు తెరమీదికి వచ్చిన సమయంలోనే రాజె తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. తనను కాకుండా వేరే వారిని సీఎంగా ఎంపిక చేస్తే వసుంధర బలప్రదర్శన చేస్తారా? మోదీకి వ్యతిరేకంగా నిలబడి ఢీ కొట్టగలరా? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.


అయితే రాజె రాజకీయ ప్రస్థానం చూస్తే ఆమె ఇప్పుడు రాజీ పడితే బీజేపీలో ఒకప్పుడు వెలుగు వెలిగిన నేతలు ఇప్పుడు తెరమరుగైనట్టే వ్యవహరిస్తారా? లేక తిరుగుబాటు చేస్తారా? అన్నది చూడాలి. ఒకవేళ వసుంధ పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తే తనకు వైపు 45-60 ఎమ్మెల్యేలు మొగ్గుచూపుతారని అంటున్నారు. అశోక్‌ గెహ్లాట్‌ కూడా కాషాయ పార్టీ తీసుకునే నిర్ణయాన్ని బట్టి స్పందించాలని చూస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో రాజె రాజీ పడుతారా? లేక పార్టీ అధిష్ఠానంపై తిరుగుబాటు చేస్తారా? అన్నది చూడాలి. మొత్తాన్ని రాజస్థాన్‌ రాజకీయ పరిణామాలపై అంతటా ఆసక్తి నెలకొన్నది.

తెరపైకి ఇద్దరు డిప్యూటీలు!

రాజకీయ సమీకరణలను సమన్వయం చేసే సూత్రంతో రాజస్థాన్‌లోని మూడు బలమైన సామాజిక వర్గాలకు ప్రాతినిథ్యం కల్పించేలా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎంపిక ఉండాలనే ఆలోచన జరుగుతున్నట్టు సమాచారం. అందుకోసం ఇద్దరు ముఖ్యమంత్రులు ఉంటారని తెలుస్తున్నది. రాజస్థాన్‌లో రాజ్‌పుత్‌లు, బ్రాహ్మలు, మీనా, జాట్‌లు ఆధిక్య కులాలు. మూడు కీలక స్థానాలకు ఈ నాలుగు కులాల నుంచి ఎంపిక చేస్తారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. స్పీకర్‌ పోస్టును దళితులకు కేటాయిస్తారని సమాచారం. వసుంధర రాజెకు మరోసారి అవకాశం ఇవ్వకూడదని అధిష్ఠానం భావిస్తే.. తిజారా ఎంపీ బాబా బాలక్‌నాథ్‌ను ముఖ్యమంత్రిని చేస్తారనే ప్రచారం ఉన్నది. అయితే.. అవన్నీ ఊహాగానాలేనని బాలక్‌ నాథ్‌ అంటున్నారు.