Site icon vidhaatha

చత్తీస్ గఢ్‌లో 22మంది మావోయిస్టుల లొంగుబాటు

విధాత: చత్తీస్ గఢ్ సుక్మా జిల్లాలో 22 మంది మావోయిస్టులు శుక్రవారం భద్రతా దళాల ముందు లొంగిపోయారు. సీఆర్‌పీఎఫ్ డీఐజీ ఆనంద్ సింగ్ రాజ్‌పురోహిత్ మాట్లాడుతూ “ఈ రోజు తొమ్మిది మంది మహిళా నక్సల్స్‌తో సహా 22 మంది మావోయిస్టులు లొంగిపోయారన్నారు. అందులో 12 మందిపై రూ.40 లక్షల రివార్డు ఉన్నట్లు తెలిపారు. వారిలో ఇద్దరిపై రూ. 8 లక్షలు, మరో ఇద్దరిపై ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు రివార్డు ఉందన్నారు. లొంగిపోయిన వారందరికి తక్షణ సహాయంగా రూ.50వేల చొప్పున అందించామన్నారు. మావోయిస్టుల నిర్మూలనకు భద్రతా బలగాల చేస్తున్న కృషితో పాటు ప్రభుత్వ విధానాలకు ఆకర్షితులై మావోయిస్టులు లొంగిపోతున్నారని తెలిపారు.

మావోయిస్టులంతా జనజీవన స్రవంతిలో కలిసి ప్రజాస్వామికంగా పనిచేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం చత్తీస్ గఢ్ లో మావోయిస్టులపై ఉక్కుపాదం మోపింది. ఆపరేషన్ కగర్ పేరుతో సాయుధ బలగాలు మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్లు సాగిస్తుండటంతో ఏడాదిన్నర కాలంగా దండకారణ్య ప్రాంతం ఎన్ కౌంటర్లతో దద్ధరిల్లుతుంది. గతకొన్ని నెలలుగా వరుస ఎన్‌కౌంటర్లతో 450మంది వరకు మావోయిస్టుల చనిపోగా..వందల సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతున్నారు.

Exit mobile version