Maoists |
విధాత: చత్తీస్ గఢ్ సహా ఐదు రాష్ట్రాల పరిధిలోని దండకారణ్యంలో భద్రతా బలగాలు మావోయిస్టుల నిర్మూలనకు చేపట్టిన ఆపరేషన్ కగార్ దెబ్బకు మావోయిస్టు పార్టీ ఉక్కిరి బిక్కిరవుతోంది. వరుస ఎన్ కౌంటర్లతో వందలాది మావోయిస్టులు హతమవుతుండగా..మరికొందరు లొంగిపోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సరిహద్దు రాష్ట్రం తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడం జిల్లాలో 86 మంది మావోయిస్టులు లొంగిపోవడం సంచలనంగా మారింది. పోలీస్ బెటాలియన్ కార్యాలయంలో ఐజీ ఎదుట వారంతా ప్రభుత్వానికి లొంగిపోయారు. వారిలో 20 మంది మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. ఒకేసారిగా ఇంత పెద్ద ఎత్తున మావోయిస్టులు పోలీసుల ఎదుట లోంగిపోవడం మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బ కాగా..భద్రతా బలగాల భారీ విజయంగా అభిప్రాయ పడుతున్నారు.
ఇటీవల చత్తీస్ గఢ్ బీజాపూర్ డీఐజీ డీఐజీ జితేంద్ర కుమార్ యాదవ్ ఎదుట మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న 50 మంది మావోయిస్టులు లొంగిపోయారు. గత సంవత్సరం 654 మావోయిస్టులను అరెస్టు చేసినట్లు, 346 మంది లొంగిపోయినట్లు, ఈ సంవత్సరం జనవరి 1 నుండి ఇప్పటివరకు 147 మంది మావోయిస్టులు వివిధ ఎన్ కౌంటర్లో మరణించారని తెలిపారు.లొంగిపోయి సమాజ స్రవంతిలో కలిసిన మావోయిస్టులకు వారి పేరిట ఉన్న రివార్డులతో పాటు అన్ని రకాల పునరావాస కల్పన, సహాయక చర్యలను అందిస్తామన్నారు. ఇటీవలు మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట విడుదలైన లేఖలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చత్తీస్ గఢ్ లో కొనసాగిస్తున్న అపరేషన్ కగార్ ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మావోయిస్టు పార్టీ శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించడం గమనార్హం.