విధాత: విశాఖలోని రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో సురేష్ ప్రొడక్షన్స్ కు చుక్కెదురైంది. గతంలో ఫిల్మ్‌సిటీ కోసం కేటాయించిన భూములను ఇతర అవసరాలకు వాడుకోవచ్చని గత జగన్ ప్రభుత్వం సురేష్ ప్రొడక్షన్స్‌కు అనుమతించింది. ఈక్రమంలో గత ప్రభుత్వ నిర్ణయాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని ప్రస్తుత కూటమి ప్రభుత్వం షోకాజ్ నోటీసు ఇచ్చింది.
దీన్ని సురేష్ ప్రొడక్షన్స్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. పిటిషన్‌ను విచారించిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం మధ్యంతర ఉపశమనం ఉత్తర్వుల జారీకి నిరాకరించింది. షోకాజ్ నోటీసుపై సంబంధిత కోర్టును ఆశ్రయించాల్సిందిగా సూచించింది. దీంతో పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని సురేష్ ప్రొడక్షన్స్ విజ్ఞప్తి చేయగా, ధర్మాసనం అనుమతించింది.