Brain-eating Amoeba | ప్రాణాంతకమైన బ్రెయిన్ ఈటింగ్ అమీబా (Naegleria fowleri) సోకి ఈ నెలలో భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో ఐదవ మరణం చోటు చేసుకుంది. మళప్పురం జిల్లా వాండూర్ సమప తిరువాళి గ్రామస్థురాలైన శోభన అనే 56 ఏళ్ల మహిళ ఈ ఇన్ఫెక్షన్ సోకి ప్రాణాలు కోల్పోయారు. గతవారం ఆమెను హాస్పిటల్‌లో చేర్చినప్పటి నుంచీ ఆమె ఆరోగ్యం విషమంగానే ఉన్నది. సెప్టెంబర్ 6, 2025న కూడా వాయనాడ్ జిల్లా సుల్తాన్ బతేరీకి చెందిన రతీశ్ అనే 45 ఏళ్ల వ్యక్తి కూడా ఇదే బాక్టీరియా (Brain-eating Amoeba) సోకి చనిపోయాడు. 2025 ఆగస్ట్ నెల నుంచి ఇప్పటి వరకూ ఈ బాక్టీరియాలో ఐదుగురు చనిపోవడం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నది. అంతేకాదు.. ఇదే వ్యాధితో కోజికోడ్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో మరో 11 మంది చికిత్స పొందుతున్నారు. వారిలో ఒకరి ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు హాస్పిటల్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా ఈ సంవత్సరం బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేసులు ఒక్క కేరళలోనే 42 వరకూ గుర్తించారు.
ఏమిటీ బ్రెయిన్ ఈటింగ్ అమీబా?
వైద్యపరిభాషలో ప్రైమరీ అమీవిక్ మెనింగోఎన్సెఫలిటీస్ (PAM) (https://en.wikipedia.org/wiki/Primary_amoebic_meningoencephalitis) అని పిలువబడే ఈ వ్యాధి Naegleria fowleri అనే సూక్ష్మ జీవి వల్ల సోకుతుంది.
ఇది ఎక్కువగా వేడి నీటిలో అంటే.. సరస్సులు, నదులు, హాట్ స్ప్రింగ్స్ వంటి ప్రదేశాల్లో వృద్ధి చెందుతుంది.
46 డిగ్రీల సెల్షియస్ వేడిలో కూడా ఇది బతికి ఉంటుంది.
మనుషులకు ఎలా సోకుతుంది?
- కలుషిత నీటిలో ఈత కొట్టడం, డైవింగ్, లేదా తల తడుపుకోవడం చేసిన సమయాల్లో ఈ అమీబా ముక్కు ద్వారా నేరుగా మెదడులోకి వెళ్లుతుందని యునైటెడ్ స్టేట్స్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) చెబుతున్నది. అక్కడి నుంచి మెదడు కణజాలాన్ని ధ్వంసం చేస్తూ పోతుంది.
- దీని వలన సదరు ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి PAM అనే ప్రాణాంతక వ్యాధికి గురవుతాడు.
- కలుషిత ఈతకు వెళ్లకపోయినా, ముక్కు శుభ్రం చేసుకోవడానికి ఆ కలుషిత నీటిని ఉపయోగించినా ప్రమాదమే.
- క్లోరిన్ ఉపయోగించని స్విమ్మింగ్ పూల్స్, అపరిశుభ్రమైన వాటర్ పార్కుల్లోకి దిగినా ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. ప్రత్యేకించి, ఊళ్లలో ఎలాంటి ప్రవాహం లేని నీటిలో (కొత్త నీరు వచ్చి, పాత నీరుపోవడానికి ఆస్కారం లేని చెరువులు, కుంటలు వంటివాటిలో) స్నానం చేస్తే ఈ వ్యాధి సోకుతుంది.
- ఆలయాల్లో కోనేరులు ఉంటాయి. వాటిలోకి నిత్యం స్వచ్ఛమైన నీటి సరఫరా లేనట్టయితే ఈ బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది.
- పాచిపట్టిన కొలనులలో స్నానం చేయడం కూడా ప్రమాదకరమే.