-
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే వరంగల్ కు ఎయిర్పోర్టు, రింగురోడ్డు వచ్చాయి
-
స్టేషన్ ఘన్పూర్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
విధాత ప్రత్యేక ప్రతినిధి: ఉమ్మడి వరంగల్ అంటే తనకు ఎంతో అభిమానమని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా వరంగల్ గడ్డ నుంచి ఎన్నో పోరాటాలు జరిగాయన్నారు. వరంగల్కు ఎయిర్పోర్టు తీసుకొస్తానని లోక్సభఎన్నికల సందర్భంగా మాటిచ్చా.. చెప్పినట్టుగానే ఎయిర్పోర్టును సాధించి మీ ముందు నిల్చున్నానని సీఎం అన్నారు. స్టేషనఘన్పూర్లో రూ.800 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా శివునిపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు.
“కేసీఆర్ రూ.8.29లక్షల అప్పును మా నెత్తిమీద పెట్టిపోయారు. ఆయన చేసిన అప్పులకు ఒక్క ఏడాదిలోనే ఈ ప్రభుత్వం రూ.84వేల కోట్లు వడ్డీ, రూ.64 వేల కోట్లు అసలు చెల్లించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం. అధికారంలోకి వచ్చిన 2 రోజులకే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాం.
ఇందుకోసం ఇప్పటికే రూ.5,500 కోట్లు కేటాయించాం. ఎన్నికల కోడ్ అడ్డుపెట్టుకొని కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు ఎగ్గొట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుబంధు కింద రూ.7,200 కోట్లు ఇచ్చాం. గ్రూప్ 1,2,3 పరీక్షలను సవ్యంగా నిర్వహించి ఉద్యోగాలు ఇస్తున్నాం. అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రానికి కడియం శ్రీహరి అవసరం ఉందని చెప్పి పార్టీలోకి తీసుకొచ్చాం.
ఎమ్మెల్యేగా జీతభత్యాలు తీసుకుంటున్న వ్యక్తి తన బాధ్యతలను నెరవేర్చటం లేదు.15 నెలలుగా జీతభత్యాలు తీసుకుంటూ అసెంబ్లీకి మాత్రం రావట్లేదు. ప్రజల సొమ్మును జీతంగా తీసుకునే వ్యక్తి ప్రజల కోసం అసెంబ్లీలో సూచనలు ఎందుకు చేయట్లేదు? తన అనుభవాన్ని ప్రజల కోసం ఎందుకు ఉపయోగించట్లేదు? ఈ ప్రభుత్వం వచ్చాకే వరంగల్కు ఎయిర్పోర్టు, రింగురోడ్డు వచ్చాయి. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వచ్చింది. జయశంకర్ సర్ స్వగ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా చేసింది మా ప్రభుత్వమే. బడ్జెట్ సమావేశాల్లో కేసీఆర్ చేసిన తప్పులన్నీ బయటపెడతా” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.