Site icon vidhaatha

Chandrababu: మహిళా ఉద్యోగులకు నైట్ షిప్టులు.. ఏపీ కెబినెట్ నిర్ణయం

Chandrababu: అమరావతి : ఏపీలో మహిళా ఉద్యోగులు, కార్మికులు రాత్రి 7నుంచి ఉదయం 6గంటల వరకు నైట్ షిప్టు చేసుకునేలా చట్టసవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం నిర్ణయాలను మంత్రి పార్ధసారధి వెల్లడించారు.

పరిశ్రమల్లో భద్రత, సీసీ కెమెరాలు, రవాణా సహా ఇతర వసతులు మహిళలకు కల్పించాలని పేర్కొన్నారు. గతంలో 9గంటలు మాత్రమే పనిచేసుకును వెసులుబాటును 10గంటలకు పెంచామని తెలిపారు. ఈ నిర్ణయంతో మహిళల ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.

అలాగే సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. అమరావతిలో వివిధ సంస్థలకు చేసిన భూ కేటాయింపులు, రాయతీల కల్పనకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. వైఎస్సార్ జిల్లాను వైఎస్సార్ కడపగా మారుస్తూ తెచ్చిన జీవోను ఆమోదించింది.

ఉద్దానం, కుప్పంలో రక్షితనీటి సరఫరాకు రూ.5.75 కోట్లు, రూ.8.22కోట్ల చొప్పున వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌కు ఆమోదం తెలిపింది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు కేబినెట్‌ ఆమోదించింది. 1 ఫిబ్రవరి 2025 నాటికి అర్హులైన 17 మంది యావజ్జీవ ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు చేసింది. 248 మంది కానిస్టేబుళ్లకు పదోన్నతి కల్పించే ప్రతిపాదనలను ఆమోదించింది. పోలీసు అకాడమీకి అదనంగా 94.45 ఎకరాలు ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదించింది.

 

Exit mobile version