Site icon vidhaatha

G20 Summit | జీ20 డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం

G20 Summit |

న్యూఢిల్లీ: జీ20 సభ్య దేశాలు తమ సదస్సు ఉమ్మడి నాయకత్వ డిక్లరేషన్‌ను ఆమోదించిందని సదస్సు చైర్మన్‌, ప్రధాని నరేంద్రమోదీ శనివారం ప్రకటించారు. శుక్రవారమే రూపొందించిన ముసాయిదాపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. ప్రత్యేకించి ఉక్రెయిన్‌ విషయంలో ప్రతిష్ఠంభన నెలకొన్నా.. చివరకు ఆమోదించారు. సదస్సు తొలి రోజు రెండవ సెషన్‌లో మోదీ మాట్లాడుతూ.. ‘మిత్రులారా.. ఇప్పుడే మనకు శుభవార్త అందింది.

మన టీమ్‌ల కష్టం ఫలించి, మీ అందరి సహకారంతో న్యూఢిల్లీ జీ20 సదస్సు నాయకుల డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయాం కుదిరింది’ అని హిందీలో చెప్పారు. ఏకాభిప్రాయం వచ్చినందున దీన్ని ఆమోదిస్తున్నట్టు ప్రకటిస్తున్నానని తెలిపారు.

అనంతరం ఘన్యంతో (చెక్క సుత్తి) బెంచీపై మూడుసార్లు కొట్టగానే.. ఇతర జీ20 దేశాల నాయకులు హర్షామోదాలు ప్రకటించారు. మంత్రులు, అధికారులు, దౌత్యవేత్తలందరికీ మోదీ ప్రతిగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వారి కృషి వల్లే ఇది సాకారమైందని, వారి కృషి ప్రశంసించతగినదని చెప్పారు.

ఉక్రెయిన్‌పై తొలుత పీటముడి

‘ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ’ విషయంలో జీ20 దేశాల అధినేతల మధ్య తొలుత ఏకాభిప్రాయం కుదరలేదు. ఇండియా అధ్యక్షతన ఇప్పటి వరకూ జరిగిన అన్ని మంత్రిత్వస్థాయి సమావేశాల్లోనూ ఈ అంశం సంయుక్త ప్రకటనల్లో చోటు చేసుకోలేదు. సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఉక్రెయిన్‌ భాగాన్ని తిరిగి రూపొందించారని సమాచారం. ఈ డిక్లరేషన్‌లో పర్యావరణ పరివర్తన, బహుముఖ అభివృద్ధి బ్యాంకుల సంస్కరణ, క్రిప్టో కరెన్సీ క్రమబద్ధీకరణ వంటి అంశాలు కూడా ఉన్నాయని తెలుస్తున్నది.

Exit mobile version