విధాత: చత్తీస్ గఢ్, తెలంగాణ సహా మావోయిస్టుల ఏరివేతకు చేపట్టిన ఆపరేషన్ కగార్ కు ఆపరేషన్ సిందూర్ దెబ్బ పడింది. ఆపరేషన్ కగార్ విధుల్లో ఉన్న కేంద్ర సీఆర్ఫీఎఫ్ బలగాలను వెంటనే వెనక్కి రావాలని, హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశించింది. కేంద్రం ఆదేశాలతో సీఆర్ఫీఎఫ్ బలగాలు హుటాహుటిన ఆపరేషన్ కగార్ నుంచి వెనుదిరిగి హెడ్ క్వార్టర్స్ కు చేరుకుంటున్నాయి. పాకిస్తాన్ భారత్ ల మధ్య సైనిక దాడుల నేపథ్యంలో సీఆర్ఫీఎఫ్ బలగాలను దేశ భద్రత కోసం సరిహద్దు రక్షణ విధుల్లో నియమించే అవకాశముంది. 2026మార్చి నెలాఖరుకల్లా దేశంలో మావోయిస్టులను తుడిచిపెడుతామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇప్పటికే ప్రకటించారు.
అందుకోసం కేంద్ర రాష్ట్ర బలగాలు ఉమ్మడిగా ఆపరేషన్ కగార్ కొనసాగిస్తున్నాయి. ఆపరేషన్ కగార్ లో భాగంగా ఇప్పటికే 500మంది వరకు మావోయిస్టులను హతమార్చారు. వేయి మంది వరకు లొంగిపోయారు. చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా పరిధిలోని దండకారణ్యం(అబూజ్ మడ్ ) అటవీ ప్రాంతాలను జల్లెడ పట్టిన భద్రతాబలగాలు మావోయిస్టుల ఆపరేషన్లను విజయవంతంగా కొనసాగించాయి. మావోయిస్టుల కీలక స్థావరాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి.
తాజాగా చత్తీస్ గఢ్, తెలంగాణ సరిహద్దుల్లోని మావోయిస్టుల స్థావరంగా ఉన్న కర్రిగుట్టలను చుట్టుముట్టాయి. అన్ని వైపుల తీవ్ర నిర్భంధం పెరిగిన నేపథ్యంలో మావోయిస్టు పార్టీ స్వయంగా శాంతి చర్చల ప్రతిపాదన చేయడంతో పాటు ఆరు నెలల కాల్పుల విరమణ ప్రకటించింది. అయినప్పటికి భద్రతా బలగాలు మాత్రం శాంతి చర్చల ప్రతిపాదనలతో నిమిత్తం లేకుండా ఆపరేషన్ కగార్ ను కొనసాగిస్తున్నాయి.
ఈ క్రమంలో ఆపరేషన్ సిందూర్ తో భారత్ పాకిస్తాన్ ల మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొనడంతో కేంద్రం ఆపరేషన్ కగార్ లోని కేంద్ర బలగాలను వెనక్కి రప్పించింది. దీంతో ఆపరేషన్ కగార్ కొంత బలహీన పడే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆపరేషన్ కగార్ నుంచి కేంద్ర బలగాలు వైదొగిలినప్పటికి స్పెషల్ పోలీస్, డీఆర్జీ(డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్), సీఏఎఫ్(చత్తీస్ గఢ్ ఆర్మ్ డ్ ఫోర్స్), కోబ్రా, చత్తీస్ గఢ్ ఎస్టీఎఫ్, బస్తర్ ఫైటర్స్, ఆయా రాష్ట్రాల పోలీస్ బలగాలు మావోయిస్టుల వేటను కొనసాగిస్తుండటం గమనార్హం.