ఎలాన్ మస్క్ నిత్యం ఏదో ఒక వార్తలోనూ ఉంటుంటారు. తాజాగా తనతో ఒక బిడ్డను కనాలని ఓ ప్రఖ్యాత సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ గతంలో అడిగారట. దీనికి సంబంధించిన ఒక కథనాన్ని వాల్‌స్ట్రీట్ జర్నల్ ప్రచురించింది. ఆమె పేరు టిఫ్ఫనీ ఫాంగ్. ఆమె ఒక క్రిప్టోకరెన్సీ ఇన్‌ఫ్ల్యూయెన్సర్. ఆమెకు ఎక్స్‌లోనే 3,35,000కు మించి ఫాలోవర్లు ఉన్నారు. యూట్యూబ్‌లో 48వేల సబ్‌స్కైబర్స్ ఉన్నారు. క్రిప్టో సీఈవో సామ్ సామ్ బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్‌ను వ్యతిరేకిస్తూ ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు. ఈమెను ప్రపంచ కుబేరుడు మస్క్ ఎన్నడూ భౌతికంగా కలిసింది లేదు. అయినా తనతో బిడ్డను కనాలనే ఆసక్తి ఉన్నదా? అని అడిగారని ఆ కథనం పేర్కొన్నది.
వాస్తవానికి గతంలో ఫాంగ్‌ను ఎక్స్‌లో దాని ఓనర్ అయిన ఎలాన్ మస్క్ ఫాలో అయ్యేవారు. ప్రో మాగా కంటెంట్.. (మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్) సహా అప్పుడప్పుడు ఆమె పోస్టులకు లైక్‌లు కొడుతుండేవారు. మస్క్‌తో ఇంటరాక్ట్ అవుతుండటంతో ఫాంగ్ ఫాలోవర్లు గణనీయంగా పెరిగారు. ఎక్స్ ద్వారా ఆమె రెండు వారాల వ్యవధిలోనే 21వేల డాలర్లు సంపాదించారు. ఇలా ఉన్న సమయంలో గత ఏడాది నవంబర్ నెలలో ఫాంగ్‌కు నేరుగా ఒక మెసేజ్ పంపిన మస్క్.. తనతో బిడ్డను కనేందుకు ఆసక్తి ఉన్నదా? అని ప్రశ్నించారని ఆ వార్తలో పేర్కొన్నారు.
అయితే.. ఆమె అందుకు నిరాకరించారని తెలిపింది. 26 ఏళ్ల సెయింట్ క్లెయిర్, ఫిబ్రవరిలో తనకు, మస్క్‌కు ఒక బిడ్డ పుట్టినట్టు బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాను మస్క్ ఆఫర్‌కు నో చెబితే తన సోషల్ మీడియా సంపాదన గణనీయంగా తగ్గిపోతుందేమోనని ఆమె భయపడిందని, ఫాంగ్ భయాలు కొంతకాలానికే నిజమయ్యాయని వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొన్నది. తన ప్రతిపాదన గురించి ఇతరులకు చెప్పినందుకు ఆమెను మందలించిన మస్క్.. ఫాంగ్‌ను అన్‌ఫాలో చేశారు. ఆ వెంటనే ఆమె సంపాదన పడిపోయింది.
ఇదిలా ఉంటే.. సెయింట్ క్లెయిర్.. తాను మౌనంగా ఉండేందుకు వన్‌టైమ్ పేమెంట్ కింద 15 మిలియన్ డాలర్లు ఇస్తానని, బిడ్డకు 21 ఏళ్లు వచ్చే వరకూ ప్రతి నెలా లక్ష డాలర్లు ఇస్తానని ప్రతిపాదించాడని పేర్కొంది. ఆ ఆఫర్‌ను తిరస్కరించి, తాను వాస్తవాన్ని ప్రజలకు తెలియజేశానని చెబుతున్నది. మస్క్‌కు నలుగురు వేర్వేరు మహిళలతో పుట్టిన 14 మంది వరకూ పిల్లలు ఉన్నారు. సెయింట్ క్లెయిర్ చెబుతున్న బిడ్డకు తండ్రి తానో కాదో కచ్చితంగా తనకు తెలియదని మస్క్ గతంలో చెప్పారు. అయితే.. ఆ బిడ్డకు మస్క్ తండ్రి అయ్యేందుకు 99.9999 శాతం అవకాశాలు ఉన్నట్టు టెస్ట్ రిజల్ట్స్ పేర్కొన్నట్టు జర్నల్ తెలిపింది.