విధాత: సీఎం చంద్రబాబు (CM CHANDRA BABU NAIDU) అధ్యక్షతన ఏపీ (AP) కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రివర్గ నిర్ణయాలను నిమ్మల రామానాయుడు మీడియాకు వివరించారు. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.617 కోట్లతో అసెంబ్లీ, రూ.786 కోట్లతో హైకోర్టు శాశ్వత భవన నిర్మాణాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నిర్మాణ పనులను ఎల్1 బిడ్డర్‌కు అప్పగించాలని నిర్ణయించింది. స్టేట్ సెంటర్ ఫర్ క్లైమేట్ ఇన్ సిటీస్ వ్యవస్థల ఏర్పాటును ఆమోదించింది. పట్టణ ప్రాంతాల్లో వరద నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
విశాఖలోని ఐటీహిల్ -3 పైన టీసీఎస్‌కి 21.66 ఎకరాలు, ఉరుస క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి 3.5 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఉరుస క్లస్టర్‌కు కాపులుప్పాడలో 56 ఎకరాల భూమిని కేటాయింపుకు, బలిమెల, జోలాపుట్ రిజర్వాయర్ల వద్ద చేపట్టాల్సిన హైడల్ ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణాలపై ఒడిశా పవర్ కన్సార్టియమ్‌కు కూడా అనుమతులపై రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 30 మెగావాట్ల సామర్థ్యంతో 2 హైడల్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం జలవనరుల శాఖ చేసిన ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదించింది. పలు ప్రాంతాల్లో పవన విద్యుత్, సౌర విద్యుత్ ప్లాట్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
త్వరలోనే డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని, వచ్చే విద్యా సంవత్సరంలోగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఈ నెల 26న మత్స్యకార భరోసా సాయం కింద లబ్ధిదారులకు రూ.20వేలు పంపిణీ చేస్తామన్నారు. ‘‘ రాష్ట్రంలో టీసీఎస్ విస్తరణకు భూమి కేటాయించాలని నిర్ణయించామని తెలిపారు. ఐటీని విస్తరించేందుకు మంత్రి లోకేశ్ ప్రయత్నాలకు అనుగుణంగా భూగర్భ కేబుల్ వ్యవస్థ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. గుంటూరులో ఈఎస్‌ఐ ఆస్పత్రికి ఉచితంగా భూమి ఇవ్వాలని నిర్ణయించామని, గ్రేహౌండ్స్ విభాగానికి కొత్తవలసలో భూమి కేటాయిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మంచి రోడ్లు వేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రజలకు సామాజిక న్యాయం జరిగింది’’ అని నిమ్మల రామానాయుడు తెలిపారు.
ఎస్సీ ఉప వర్గీకరణ ఆర్డినెన్స్ కు ఆమోదం: ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ కు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఎస్సీ ఉపవర్గీకరణలో 200 పాయింట్ల రోస్టర్ అమలుకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ‘‘విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల ఫలాలు సమానంగా అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్సీ ఉపవర్గీకరణ కింద గ్రూప్-1లో 12 ఉపకులాలకు 1శాతం రిజర్వేషన్ రానుంది. గ్రూప్-2లో 18 ఉపకులాలకు 6.5 శాతం రిజర్వేషన్ అమలు కానుంది. గ్రూప్-3లో 29 ఉపకులాలకు 7.5 శాతం రిజర్వేషన్ వర్తించనుంది. అన్ని జిల్లాల్లో ఈ ఆర్డినెన్స్ అమల్లోకి వస్తుంది’’ అని తెలిపారు.