విధాత: రోజువారి రొటీన్ లైఫ్‌తో విసిగిపోతున్నారా..?, పని వత్తిడి నుంచి రిలాక్స్ అయ్యేందుకు ఎక్కడికైనా దూరంగా మంచి విహార యాత్రకు వెళ్తే బాగుంటుంది అని అనుకునే వారికోసం IRCTC తక్కువ బడ్జెట్‌లోనే మంచి ప్యాకేజీలను మన ముందుకు తీసుకువచ్చింది. తక్కువ ధరలతోని ఎక్కువ ప్రదేశాలను చుట్టి వచ్చేందుకు మన ముందు ఓ బెస్ట్ ప్యాకేజీని ఉంచేసింది. ఆ ప్యాకేజీ ఎంటీ, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎంటో తెలుసుకుందాం..
కాఫీ విత్ కర్ణాటక అనే ప్యాకేజీని కేవలం రూ.11990 నుంచే అందిస్తున్నది. ఈ యాత్ర పూర్తిగా 5 రాత్రులు, 6 రోజులు ఉంటుంది. ఈ ట్రిప్‌లో మైసూర్, కూర్గ్ ప్రాంతాల్లోని ముఖ్యమైన ప్రదేశాలను చూపిస్తారు. ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుంది. ప్రతి బుధవారం రాత్రి 7 గంటలకు హైదరాబాద్‌లో కాచిగూడస్టేషన్ నుంచి రైలు బయలుదేరుతుంది. ఒక్కరమే వెళ్తే 3ఏసీ టికెట్ అయితే రూ. 34900, స్లీపర్ క్లాస్ టికెట్ ధర అయితే రూ. 32880 పడుతుంది.
అదే ఇద్దరు కలిసి వెళితే ఒక్కోక్కరికి 3ఏసీ టికెట్ అయితే రూ.19980, స్లీపర్ క్లాస్ టికెట్ అయితే.. రూ.17960. ఒక వేళ ముగ్గురు కలిసి వెళ్తే.. 3ఏసీ టికెట్ రూ. 15380, స్లీపర్ క్లాస్ టికెట్ ధర రూ.13360. నలుగురు నుంచి ఆరుగురు కలిసి వెళ్తే మాత్రం 3ఏసీ టికెట్ ధర రూ.14010, స్లీపర్ టికెట్ ధర రూ. 11990 ఉంటుంది. ఈ యాత్రలో మొదటి రోజు రాత్రి 7 గంటలకు కాచిగూడలో కాచిగూడ-మైసూర్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ నెం.12785 బయలుదేరి రాత్రంతా జర్నీ ఉంటుంది.
రెండో రోజు ఉదయం 9.30 గంటలకు మైసూరు చేరుకుంటాము. అక్కడి నుంచి 115 కిలో మీటర్ల దూరంలో ఉన్న కూర్గ్‌కు మనల్ని కారులో తీసుకు వెళ్తారు. అక్కడికి చేరుకునే వరకు మధ్యాహ్నం అవుతుంది. అక్కడ హోటల్‌లో చెక్ ఇన్ అవుతాము. ఆ తర్వాత అబ్బే ఫాల్స్, ఓంకారేశ్వర్ టెంపుల్ చూపించి రాత్రి హోటల్‌లో స్టే చేయిస్తారు. మరుసటి రోజు హోటల్‌లోనే బ్రేక్ ఫాస్ట్ చేయించి తలకావేరి, భాగమండల, రాజాస్ సీట్ చూపిస్తారు. మళ్లీ రాత్రికి కూర్గ్‌లోనే బస.
నాలుగో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేయించి మళ్లీ మైసూర్‌కు కార్లో తీసుకు వెళ్తారు. వెళుతూ మార్గ మధ్యలోనే కావేరి నిసర్గంధమ, టిబెటిన్ మోనెస్ట్రీ, బృందావన్ గార్డెన్స్ చూపించి మైసూర్‌లోని హోటల్‌కు చేరుస్తారు. రాత్రి హోటల్‌లో బస చేసి 5వ రోజు ఆదివారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయించి హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతాము. అనంతరం చాముండి హిల్స్, మైసూర్ ప్యాలెస్ చూపించి మధ్యాహ్నం మైసూర్ రైల్వే స్టేషన్‌లో దింపేస్తారు. అక్కడి నుంచి మధ్యాహన్నం 3.15 గంటలకు తిరిగి రైల్ నెంబర్. 12786 ఎక్కి రాత్రంతా జర్నీ చేసి 6వ రోజు ఉదయం 5.40 గంటలకు కాచిగూడ చేరుకుంటాము. అయితే ఈ ప్యాకేజీలో లంచ్, డిన్నర్ యాడ్ అవ్వవు. అలాగే సైట్ సీయింగ్ ప్రాంతాల్లో ఏవైనా ఎంట్రెన్స్ టికెట్లు ఉంటే వాటి ఖర్చులు రైల్లో ఫుడ్ ఖర్చులు అదనంగా మనమే భరించాల్సి ఉంటుంది.
