ktr : విధాతః జూన్ 2న తెలంగాణ భవన్ లో జరగబోయే ఆవిర్భావ వేడుకల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొనడం లేదని సమాచారం. విదేశీ పర్యటనల్లో ఉన్నందున కేటీఆర్ కూడా ఈ వేడుకలకు దూరంగా ఉండబోతున్నారు. పార్టీ సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి పతాకావిష్కరణ చేయబోతున్నట్టు కేటీఆర్ ప్రకటించారు. ఢిల్లీ పార్టీలో తెలంగాణ రాష్ట్రం ఆగం అవుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
అటువంటి శక్తులను ఎదుర్కొనేందుకు తెలంగాణ సమాజం సిద్ధం ఉండాలని కోరారు. ముమ్మాటికీ కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు. జూన్ 2 తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు వైభవంగా వేడుకలు నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్ లోనూ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తామన్నారు. ఊరూరా వాడవాడన సంబురాలు జరుపుకోవాలని కోరారు. అన్ని జిల్లా పార్టీ కార్యాలయాలతోపాటు నియోజకవర్గాలు, మున్సిపాలిటీలు పట్టణాలు, మండలాల్లో జాతీయ జెండాను, పార్టీ పతాకాన్ని ఎగరేయాలని కేటీఆర్ పిలుపు నిచ్చారు.
పార్టీ సీనియర్ నాయకులు, శ్రేణులంతా పాల్గొనాలని, ప్రజలతో కలిసి అవతరణ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని కోరారు. 14 ఏళ్ల అలుపెరగని పోరాటంతో ఉద్యమ రథసారథి కేసిఆర్ గారి సారథ్యంలో తెలంగాణ సాధించుకున్నామన్నారు. తెలంగాణ భవన్ లో జూన్ 2 పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదన చారి పాల్గొని జాతీయ జెండాను, పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తారని, ఈ వేడుకల్లో పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని నియోజకవర్గాలు , మున్సిపాలిటీలు, పట్టణాలు, మండలాలలో జాతీయ పతాకంతోపాటు గులాబీ జెండాను ఆవిష్కరించి తెలంగాణ అవతరణ సంబరాలను ప్రజలతో కలిసి జరుపుకోవాలని అన్నారు.
అమరుల త్యాగాలు, ప్రభుత్వ ఉద్యోగులు , విద్యార్థుల పోరాటాలు, సబ్బండ వర్గాల సమిష్టి కృషితోనే ఆరు దశాబ్దాల కల సాకారం అయిందని కేటీఆర్ గుర్తు చేశారు.
పదేండ్లలో ఎంతో సాధించాం
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ తొలి పదేళ్ల ప్రస్థానం యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన ప్రతి ఆలోచన అనేక రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర సర్కార్ కు కూడా దిక్సూచిగా నిలిచిందని పేర్కొన్నారు. తెలంగాణ గడ్డపై పురుడు పోసుకున్న రైతుబంధు , మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలు దేశానికే దారిచూపే దీపస్తంభంలా నిలవడం ప్రతి తెలంగాణ బిడ్డకు గర్వకారణమని అన్నారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంతో పాటు గత పదేళ్లపాటు సాగిన తెలంగాణ ఉజ్వల ప్రయాణంలో కేసీఆర్ గారితో కలిసి నడిచిన వారందరికీ కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. మాయమాటలతో మభ్యపెట్టే ఢిల్లీ పార్టీలతో రాష్ట్ర ప్రయోజనాలు అడుగడుగునా దెబ్బతింటున్న ప్రస్తుత తరుణంలో తెలంగాణ సమాజమంతా అప్రమత్తంగా వ్యవహరించాలని కేటీఆర్ సూచించారు.