Telangana Third DISCOM : తెలంగాణలో విద్యుత్ సరఫరా వ్యవస్థలో మూడో డిస్కమ్ !

తెలంగాణలో విద్యుత్ సరఫరా వ్యవస్థలో మూడో డిస్కమ్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రైతులకు వ్యవసాయ విద్యుత్ సరఫరా నిర్వహణ కోసం టీజీఆర్‌పీడీసీఎల్ ఏర్పాటు చేశారు.

Telangana Third DISCOM

విధాత, హైదరాబాద్ : తెలంగాణ విద్యుత్ సరఫరా వ్యవస్థలో కొత్తగా మూడో డిస్కమ్‌ ఏర్పాటుకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. తెలంగాణ రైతు పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ (టీజీఆర్‌పీడీసీఎల్‌) ఏర్పాటు చేస్తూ జీవో విడుదల చేసింది. ఇప్పటికే ఉన్న తెలంగాణ సదరన్, నార్తర్న్ డిస్కమ్‌లతో పాటు ఈ కొత్త డిస్కమ్‌ పనిచేయనుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి ముషారఫ్ అలీ ఫరూఖీని టీజీఆర్‌పీడీసీఎల్‌ సంస్థకు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది. ఆయనతో పాటు సంస్థ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు మరో నలుగురు డైరెక్టర్లను కూడా ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర విభజన తర్వాత విద్యుత్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కీలకమైన సంస్కరణల్లో కొత్త డిస్కమ్ ఏర్పాటు నిలిచిపోనుంది.

టీజీఎస్పీడీసీఎల్ హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ, మహబూబ్ నగర్ వంటి 15 దక్షిణ జిల్లాల్లో విద్యుత్ సరఫరా చేస్తుంది. టీజీఎన్ పీడీసీఎల్ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సరఫరాను పర్యవేక్షిస్తుంది.

టీజీఆర్‌పీడీసీఎల్‌ పరిధిలో బాధ్యతలు

కొత్త డిస్కం టీజీఆర్‌పీడీసీఎల్‌ ప్రత్యేకంగా వ్యవసాయం, ప్రజా అవసరాలకు సంబంధించిన విద్యుత్ సరఫరాను పర్యవేక్షించనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల నిర్వహణ, రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడం ప్రధానంగా పనిచేస్తుంది. రైతులు కోరుకునే కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను మంజూరు చేయనుంది. రాష్ట్రంలోని భారీ, మధ్యతరహా ఎత్తిపోతల పథకాలు, ప్రాజెక్టులకు విద్యుత్ సరఫరా చేయనుంది. ఇక మిషన్ భగీరథ, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్, మున్సిపల్ వాటర్ సప్లై స్కీమ్‌లకు సంబంధించిన విద్యుత్ కనెక్షన్లను ఈ డిస్కం పర్యవేక్షించనుంది.

ఇవి కూడా చదవండి :

విజయ డెయిరీ లొల్లి : మంత్రి లోకేష్..గుత్తా అమిత్ ట్వీట్ వార్
Telangana Engineering Colleges| తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజీలకు షాక్..అదనపు వసూళ్లకు చెక్

Latest News