నల్గొండ ప్రభుత్వాస్పత్రిలో లాప్రోస్కోపిక్ యూనిట్ ప్రారంభం
నల్గొండ : ధనవంతుల మాదిరిగానే పేదవారికి అధునాతన వైద్య సౌకర్యాలు కల్పించాలన్న లక్ష్యంతో నల్గొండ జిల్లాలో వైద్య రంగాన్ని పటిష్టం చేస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో సుమారు కోటి రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన లాప్రోస్కోపిక్ యూనిట్ ను సోమవారం డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ప్రారంభించగా, రాష్ట్ర మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలోనే గర్వించదగ్గ వ్యక్తి అయిన డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా లాప్రోస్కోపిక్ యూనిట్ ప్రారంభం కావడం సంతోషమన్నారు. ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిని అంచలంచెలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో లాప్రోస్కోపిక్ యూనిట్ ఏర్పాటు చేయడం వల్ల చిన్న చిన్న ఆపరేషన్లను ఇక్కడే నిర్వహించే అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థులు లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యసాధన కృషి చేయాలని సూచించారు.
ప్రభుత్వ వైద్య కళాశాలలో మెడికల్ విద్య పూర్తి చేసిన విద్యార్థులకు ఏఐజీ ఆసుపత్రిలో ఇంటర్న్‌షిప్ శిక్షణ చేసేందుకు అవకాశం కల్పించాలని మంత్రి.. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డిని కోరారు. అనంతరం డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. జీవితంలో అందరికీ అవకాశాలు వస్తాయని, వాటిని అందిపుచ్చుకున్న వారే ముందుకు వెళ్తారని తెలి తెలిపారు. నల్గొండ ప్రభుత్వ వైద్యశాల కళాశాల విద్యార్థులు ఏఐజీ ఆసుపత్రిలో ఇంటర్న్‌షిప్ చేసేందుకు నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలను దత్తత తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ అరుణకుమారి, డీఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డీసీహెచ్ఎస్ మాతృనాయక్, నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు హఫీజ్ ఖాన్, ఆర్డీఓ వై.అశోక్ రెడ్డి, ప్రముఖ సామాజిక కార్యకర్త, చారిటీ నిర్వాహకులు ఎస్పి రెడ్డి, మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ రాధాకృష్ణ, డిప్యూటీ డీఎంహెచ్వోలు, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.