కాంగ్రెస్ పార్టీ ముద్దు బిడ్డ దామన్న.. ప్రాణం కంటే ఎక్కువ పార్టీని ప్రేమించారు

కాంగ్రెస్ పార్టీ ముద్దు బిడ్డ దామన్న.. ఆయన ప్రాణం కంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీని ప్రేమించారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

దామోదర్ రెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్లగొండ, అక్టోబర్ 12 (విధాత): కాంగ్రెస్ పార్టీ ముద్దు బిడ్డ దామన్న.. ఆయన ప్రాణం కంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీని ప్రేమించారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఆదివారం తుంగతూర్తిలో నిర్వహించిన మాజీ మంత్రి దామోదర్ రెడ్డి సంతాప సభలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారు. రాంరెడ్డి దామోదర్ రెడ్డి 1985లో నల్లగొండ జిల్లాలో ఒక్క ఎమ్మెల్యేగా అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతూ కార్యకర్తలకు అండగా పార్టీ కోసం తన రక్తాన్ని దారపోశారన్నారు. అట్లాంటి దామోదర్ రెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు.. ఆయన లేని లోటు పూడ్చలేనిదన్నారు. తుంగతుర్తి ప్రాంతం అంటే వర్షం మీద ఆధారపడే ప్రాంతంగా ఉండేది. ఎడారిలా కనిపించేదని, అట్లాంటి తుంగతుర్తికి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీళ్ళు రావాలని తన రక్తాన్ని చిందించారన్నారు. అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఈ ప్రాంతానికి తీసుకువచ్చారు. నేను ఎన్నో సార్లు వచ్చానని తెలిపారు.

దామోదర్ రెడ్డి నాటి దౌర్జన్యాన్ని ధైర్యంగా ఎదుర్కొని, ఈ ప్రాంత ప్రజల పక్షాన నిలబడ్డారన్నారు. ఇవాళ ఎస్సారెస్పీ నీళ్లు వచ్చి,ఈ ప్రాంతం పచ్చగా ఉందంటే అది దామన్న కృషి వల్లేనని కొనియాడారు.కొంత మంది తామే తెచ్చామని చెప్పుకున్నా, ప్రజలకు అన్ని విషయాలు తెలుసని మంత్రి అన్నారు. ఇవాళ దామోదర్ రెడ్డి సంతాప సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మేమంతా వచ్చింది వారి కుటుంబానికి, వారిని నమ్ముకున్న పార్టీ కార్యకర్తలకు ధైర్యం చెప్పడానికేనని వెల్లడించారు. వారి కుమారుడు సర్వోత్తం రెడ్డి, ఆయన్ను నమ్ముకున్న వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ప్రజా నాయకుడు దామోదర్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నానని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.