Site icon vidhaatha

ప్రతి నియోజకవర్గంలో.. MSME పార్కులు: సీఎం చంద్రబాబు

విధాత, అమరావతి : పారిశ్రామిక ప్రగతి..ఉపాధి కల్పన లక్ష్యంగా 2028 నాటికి రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒకటి చొప్పున 175 ఎంఎస్‌ఎంఈ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో తొలిదశలో పూర్తిచేసిన 11 ఎంఎస్‌ఎఈ పార్కులను సీఎం చంద్రబాబు గురువారం ప్రారంభించారు. మేడే సందర్భంగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నారంపేటలో నిర్వహించిన కార్యక్రమంలో వర్చువల్‌గా ప్రారంభోత్సవం చేశారు. అనకాపల్లి, పీలేరు, రాజానగరం, బద్వేల్, గన్నవరం, పాణ్యం, డోన్, ఆత్మకూరు(నారంపేట), దర్శి, పుట్టపర్తి నియోజకవర్గాల్లో ఉన్నాయి. వీటితో పాటు రాంబిల్లిలోని ఫ్లాటెడ్‌ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌నూ(ఎఫ్‌ఎఫ్‌సీ) సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రూ.216 కోట్లతో 11 పార్కులను ప్రభుత్వం పూర్తిచేసిందన్నారు. దీంతో పాటు మరో 39 ఎంఎస్‌ఎంఈ పార్కులను రూ.376 కోట్లతో అభివృద్ధి చేస్తోందన్నారు. ఎంఎస్‌ఎంఈ పార్కులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. అభివృద్ధి జరుగుతుంటే సహించలేనివారు ఉన్నారని చంద్రబాబు విమర్శించారు.

అమరావతిలో పెరిగిన భూముల విలువ

ఆంధ్ర యువతకు ఉపాధి కల్పించడానికి అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని.. ఇచ్చిన భూములను అభివృద్ధి చేసి కొంతభాగం వారికి ఇస్తున్నామన్నారు. ఆ రైతులను కోటీశ్వరులుగా మారుస్తున్నామని..ఇప్పుడు రాజధానిలో భూముల విలువ పెరిగిందన్నారు. ఇసుక ద్వారా ప్రభుత్వానికి రూ.వేలకోట్ల ఆదాయం వస్తుందని..ఆ ఆదాయాన్ని వదులుకుని మరీ.. ఉచిత ఇసుక సరఫరా చేస్తున్నామని తెలిపారు. నిర్మాణ రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని..నాలా చట్టాన్ని రద్దు చేశామని..కార్మికుల కోసం కర్నూలు, గుంటూరులో వందపడకల ఆస్పత్రులు నిర్మిస్తున్నామని తెలిపారు.

Exit mobile version