విధాత: భారత మాజీ బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా తల్లి అయ్యారు. మంగళవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. కొన్నాళ్ల క్రితం కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ ను గుత్తా జ్వాల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు తమ 4వ వివాహ వార్షికోత్సవం.. అదే రోజున ఆడపిల్ల జన్మించడంతో తమకు రెట్టింపు సంతోషాన్ని కలిగిస్తుందంటూ వారు ఎక్స్ లో పోస్ట్ చేశారు.“మాకు ఆడపిల్ల జన్మించింది. ఆర్యన్ ఇప్పుడు అన్నయ్య అయ్యాడు. మా నాలుగో పెళ్లి రోజు నాడు పాప పుట్టడం మా ఆనందాన్ని మరింత రెట్టింపు చేసింది. మాకు దేవుడి ఇచ్చిన బహుమతిగా భావిస్తున్నాం. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదం కావాలి” అంటూ తమ కూతురి చేతి ఫోటోను పంచుకున్నారు.
హీరో విష్ణు విశాల్, గుత్తా జ్వాలాలు 22 ఏప్రిల్ 2021న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. విష్ణు విశాల్ కు ఇదివరకే పెళ్లి జరిగింది. కోలీవుడ్ సినీ నిర్మాత రజినీ నటరాజ్ ను తొలుత పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఆర్యన్ జన్మించాడు. ఆమెతో 2018లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2019లో గుత్తా జ్వాలతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరి 2021లో పెళ్లి చేసుకున్నారు.
అంతకు ముందు గుత్తా జ్వాల కూడా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్‌ను 2005లో వివాహం చేసుకుంది. వారిద్ధరూ 2011లో విడాకులు తీసుకున్నారు. భారత మాజీ బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల నితిన్ హీరోగా నటించిన గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు.
ఇక విష్ణు విశాల్ నటుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టకముందు కొన్నాళ్లు క్రికెటర్ గా కొనసాగారు. 2009లో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విశాల్ ఎఫ్ఐఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులలో గుర్తింపు పొందారు. గతేడాది విడుదలైన లాల్ సలాం సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు. ప్రస్తుతం అతడి చేతిలో మూడు సినిమాలు ఉన్నట్లు సమాచారం.