హైదరాబాద్, నవంబర్ 10 (విధాత): ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ మరణం పట్ల తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహా సంతాపం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను రాసిన అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు. తెలంగాణ సాధన కోసం సాగిన ఉద్యమంలో సాంస్కృతిక పోరాటంలో జయ జయహే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని గుర్తు చేశారు. అందెశ్రీ తెలంగాణ కోసం చేసిన సాంస్కృతిక పోరాటాన్ని, ఆయనతో తనకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు.
ప్రజా కవిగా అందెశ్రీ ప్రజాకళలకు, ఉద్యమాలకు చేసిన సేవలు మరుపురానివని, వారు లేని లోటు పూడ్చలేనిదని, ప్రజా కళాకారులకు కవులకు మరణం ఉండదనీ, ప్రజాకళలు వర్ధిల్లినంతకాలం ఆయన పేరు అజరామరంగా నిలిచి ఉంటుందని పేర్కొన్నారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు పల్లె నర్సింహా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
