రైతు కుటుంబాలకు ఆర్థిక ఆసరా
విధాత, జనగామ ప్రతినిధి : రైతుల అకాల మరణం సంభవించినప్పుడు.. రైతుబీమా పథకం ద్వారా ప్రభుత్వం వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నదని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సహజ లేదా ప్రమాదవశాత్తు మరణాలకు జీవిత బీమా కవరేజ్‌ను అందించడం ద్వారా మరణించిన రైతుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడం ఈ పథకం ప్రధాన లక్ష్యమన్నారు.
ఏకారణంతోనైనా రైతు చనిపోతే, నామినీకి ఎల్ఐసీ నుంచి 10 రోజుల్లోగా 5 లక్షల బీమా పరిహారాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఒక్కో రైతు కోసం ప్రభుత్వమే రూ.2,271 ప్రీమియంగా చెల్లించి, రూ.5 లక్షల బీమాను అందిస్తోందన్నారు. జనగామ జిల్లాలో 198072 మంది రైతులు పాసుపుస్తకాలు కలిగి ఉండగా..127418 మంది రైతుభీమా పథకంలో రిజిస్టర్ అయ్యారని కలెక్టర్ పేర్కొన్నారు.
ప్రతి ఏడాదీ అగస్టు 15నే ప్రామాణికంగా తీసుకుని పేర్లను నమోదు చేసుకుంటారన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలున్న ప్రతి రైతుకు రైతు బీమా వర్తిస్తుందని తెలిపారు. జిల్లాలో రైతు బీమా కింద అర్హులుగా నమోదు చేసుకునేందుకు గడువు ముగిసిందని పేర్కొన్నారు. జూన్ 5వ తేదీ వరకు పట్టాదారు పాసుపుస్తకాలు పొందినవారిని అర్హులుగా పరిగణించారన్నారు. సీసీఎల్ఏ(భూ భారతి)లో లేని భూములున్న రైతులకు బీమా వర్తింపు ఉండదని తాజా సర్క్యూలర్‌లో స్పష్టం చేశారు. ఏఈవోల వద్ద ఆయా గ్రామాల జాబితాలు ఉంటాయని..అయితే పేరు నమోదు చేసుకునే రైతు స్థానికంగా ఉండాలన్నారు. పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంకు ఖాతా, రైతుతోపాటు నామినీ ఆధార్‌కార్డుల నకలు ప్రతులను, నామినీ నమోదు పత్రాన్ని పూరించి ఏఈవోలకు ఇవ్వాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు.