విధాత: యువత రీల్స్, సెల్ఫీ పిచ్చి వారి ప్రాణాలు బలిగొంటున్నప్పటికి వారి తీరులో మార్పు రావడం లేదు. రీల్స్, సెల్ఫీల మోజులో పడి తమ ప్రాణాలు పోగొట్టుకుంటూ కన్నవారికి తీరన వేధన మిగిలిస్తున్నారు. ఇటీవల వేలం వెర్రిగా మారిన రీల్స్ పిచ్చిలో ట్రెండ్ అన్నట్లుగా రైలు పట్టాలపై పడుకుని రీల్స్ చేయడం చాలచోట్ల కొనసాగుతుంది. ఈ క్రమంలో ఓ యువకుడు రైలు పట్టాలపై పడుకుని రీల్స్ చేసే దుస్సాహసంలో తన ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక ఘటన వైరల్ గా మారింది.
ఇన్ స్టా రీల్ కోసం రైలు పట్టాలపై పడుకునే లోపునే రైలు వేగంగా దూసుకురావడంతో ఆ యువకుడు రైలు కింద పడి దుర్మరణం చెందాడు. ఈ ఘటనను వీడియో తీస్తున్న అతని మిత్రులు పట్టాలపై పడుకునే ప్రయత్రంలో రైలు కింద పడి చనిపోయిన తమ సహచరుడిని చూసి అతని వద్దకు పరుగులు తీయగా..అప్పటికే అతను తీవ్ర గాయాలతో మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. కనీసం ఈ వీడియో చూశాక అయినా యువత ఇలాంటి రీల్స్ పిచ్చి..దుస్సాహసాలు మానుకోవాలని..కన్నవారి ఆశలు నిలబెట్టి రియల్ లైఫ్ లో హీరోగా మారాలని నెటిజన్లు సూచిస్తున్నారు.
గత ఏడాది ఉత్తరప్రదేశ్ సీతాపూర్ జిల్లా లహర్‌పూర్‌కు చెందిన దంపతులు మహ్మద్ అహ్మద్ (26), నజ్రీన్ (24), కొడుకు అబ్ధుల్లా(3)తో సహా రైలు పట్టాలపై రీల్స్ చేస్తూ రైలు వచ్చేది గమనించకుండా రైలు కింద పడి చనిపోయారు. లఖింపూర్ ఖిరి జిల్లాలోని హర్‌గావ్ సమీపంలోని క్యోతి అనే గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కదులుతున్న రైళ్లు, రైల్వే ట్రాక్‌ల పక్కన చేసిన విన్యాసాల వీడియోలు సోషల్ మీడియాలో ఎన్నో ఉన్నాయి. ఇలాంటి వీడియోలు చేసి వైరల్‌గా మారి డబ్బు సంపాదించడం కోసం.. తమ ప్రాణాలతో పాటు వేలాది మంది రైల్వే ప్రయాణికుల ప్రాణాలను కూడా వారు పణంగా పెడుతున్నారు. ఆ ఘటన అనంతరం రైల్వే శాఖ స్పందించింది. రైలు పట్టాలపైన, రైళ్లలో రీల్స్, సెల్ఫీ వీడియోలతో న్యూసెన్స్ చేసిన వారిపై ఆర్పీఎఫ్ పోలీసులు కేసులు పెట్టి కటకటాల్లోకి పంపిస్తున్నారు. అయినప్పటికి రీల్స్ పిచ్చి ఎక్కడో ఒకచోట కొనసాగుతు విషాదాలను మిగిలిస్తుంది.
