- ఆదాయానికీ.. ఖర్చులకూ కుదరని పొంతన
- అప్పు మినహా అదనపు ఆదాయనికి అడ్డంకులు
- కనీసం భూములను విక్రయించుకోలేని పరిస్థితి
- వ్యాపారాలు పడిపోవడంతో తగ్గిన పన్ను రాబడి
- కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది అరకొర నిధులే
- ఫండ్స్ లేక పథకాల అమలులో తీవ్రమైన జాప్యం
- ఇదే అదనుగా ఎదురు దాడికి దిగిన ప్రతిపక్షం
- సమాధానం చెప్పుకోలేని స్థితికి రేవంత్ సర్కార్
Telangana | Hyderabad
హైదరాబాద్, మే 1 (విధాత): రేవంత్ సర్కారు ఆర్థిక దిగ్భందనంలో ఉందా? అంటే పరిస్థితులు అవుననే చెపుతున్నాయి. వ్యాపారాలు సరిగా లేక పన్నుల ఆదాయం వేసిన అంచనాలకు భిన్నంగా తక్కువగా వస్తున్నది. దీనికి తోడు కేంద్రం నుంచి నిధులు సరిగ్గా రావడం లేదు. మరోవైపు కనీసం ఇక్కడ కొంత భూములు అమ్ముకొనైనా డబ్బులు సంపాదించి ఖర్చు చేద్దామంటే ఆ అవకాశం లేకుండా ప్రతిపక్ష బీఆరెస్, బీజేపీ దిగ్విజయంగా అడ్డుకున్నాయి. ఇలా రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీతోపాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఈ రెండు పార్టీల నేతలు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వాన్ని ఆర్థిక దిగ్బంధానికి గురి చేస్తున్నాయన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతున్నది. పైగా ఇక్కడి నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాష్ట్రానికి నిధులు తీసుకు రావడానికి చేసే ప్రయత్నాలు పెద్దగా కనిపించడం లేదని, కానీ, రేవంత్ సర్కారుపై విమర్శల దాడి మాత్రం నిత్యం ఉంటున్నదని పరిశీలకులు అంటున్నారు. ఈ విషయంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్‌పై కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.
ఇదీ వాస్తవ స్థితి
రాజకీయ నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎలా ఉన్నా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్స్‌ను పరిశీలిస్తే వాస్తవ పరిస్థితి ఏమిటో అర్థం అవుతుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల నాటికే రియల్ ఎస్టేట్ వ్యాపారం మందగించింది. ఎన్నికల తరువాత పరిస్థితి మారుతుందని వేసిన అంచనాలు తలకిందులయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యం, అమెరికాలో జాబ్ మార్కెట్‌లో స్థిరత్వం లేకపోవడం తదితర కారణాల వల్ల తెలంగాణలో రియల్ ఎస్టేట్ మార్కెట్ పూర్తిగా నేల చూపులు చూస్తున్నది. దీంతో రిజిస్ట్రేషన్ల ఆదాయం సగానికి సగం తగ్గింది రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఆధారపడే ఇతర వ్యాపారాలు కూడా ఈ ప్రభావానికి గురవుతున్నాయి. 2024-25లో ట్యాక్స్ రెవెన్యూ రూ.1.60 లక్షల కోట్లు వస్తుందని బడ్జెట్‌లో అంచనాలు వేస్తే వీటన్నింటి కారణంగా అంచనాలన్నీ తలకిందులయ్యాయి. 1.24 లక్షల కోట్లు మాత్రమే వచ్చింది. స్టాంప్ డ్యూటీ రూ.13,500కోట్లు అంచనా వేస్తే వచ్చింది రూ.7918 కోట్లు మాత్రమే. జీఎస్టీ రూ.52 వేల కోట్లకు 44 వేల కోట్లు మాత్రమే వచ్చింది. సేల్స్ ట్యాక్స్ రూ.24,500 కోట్లకు రూ.15,792 కోట్లు మాత్రమే వచ్చింది.. రియల్ ఎస్టేట్ ప్రభావం ఎక్సైజ్ మీద కూడా పడింది. ఈ రంగంలో రూ.25,597 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తే వచ్చింది కేవలం16,966 కోట్లు మాత్రమే. ఇలా రాష్ట్ర రెవెన్యూ రూ.2.01 లక్షల కోట్లు వస్తుందని అంచనా వేసిన రేవంత్ ప్రభుత్వానికి 2024-25లో వచ్చిన ఆదాయం రూ.1.41 కోట్లే.. ఇందులో కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్స్ కూడా ఉన్నాయి.
భూముల అమ్మకాలే ప్రధాన వనరు
రాష్ట్రంలో నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఆదాయంలో ప్రధానంగా భూముల అమ్మకాల మీదనే వస్తుంది. రేవంత్ రెడ్డి పాలన చేపట్టిన తరువాత గత పాలనలో వచ్చిన దాంట్లో సగం కూడా రాలేదు. 2024-25లో బడ్జెట్‌లో రూ.10.576కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తే వచ్చింది రూ.4.492 కోట్లు మాత్రమే.. ఇవి కూడా గత ప్రభుత్వంలో వేలంలో కొనుగోలు చేసిన వాళ్లు చెల్లించిన వాయిదాలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. బీఆరెస్ పాలనలో నాన్ ట్యాక్స్ రెవెన్యూ (భూముల అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయం) 2022-23లో రూ.19,553 కోట్లు, 2023-24లో రూ.23,819 కోట్లు అయితే రేవంత్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత వచ్చిన ఆదాయం రూ.4,492 కోట్లు మాత్రమే.
బాక్స్ సంవత్సరాల వారీగా వచ్చిన ఆదాయం
విధానం 2022-23 2023-24 2024-25 (అంచనా) 2024-25 (వాస్తవం)
రెవెన్యూ 1.59 1.69 2.01 1.41 రూ.లక్షల కోట్లు
ట్యాక్స్ రెవెన్యూ 1.06 1.11 1.60 1.24 రూ. లక్షల కోట్లు
నాన్ ట్యాక్స్ 19,553 23,819 10,576 4,492 రూ. కోట్లు
కేంద్ర పన్నుల్లో వాటా 19,668 23,742 35,395 33,198 రూ. కోట్లు
గ్రాంట్స్ 13,179 9,729 30,333 12,892 రూ. కోట్లు
అంచనాలకు పొంతనలేని ఆదాయం
2025-25 బడ్జెట్ అంచనాలకు, వచ్చిన ఆదాయానికి పొంతన కుదరలేదు. ప్రపంచ మార్కెట్‌తో పాటు రష్యా, ఉక్రెయిన్ యుద్ద ప్రభావం వల్ల రాష్ట్రంలో మార్కెట్ బాగా దెబ్బతిన్నది. హైదరాబాద్‌కు కీలకమైన రియల్ ఎస్టేట్ వ్యాపారం నేల చూపులు చూడటం ఇతర అన్ని వ్యాపారాలపై ప్రభావం చూపింది. అందుకే జీఎస్టీ, ఎక్సైజ్ తదితర ఆదాయాలు గణనీయంగా తగ్గాయి. ఇది రేవంత్ రెడ్డి ఆర్థిక వనరులపై తీవ్ర ప్రభావం చూపింది. ఆదాయం పెరిగే మార్గాలు కనిపించక, కేంద్రం నుంచి ఆశించిన దాంట్లో సగం కూడా గ్రాంట్స్ వచ్చే పరిస్థితి లేక, పథకాలు కొనసాగించాలన్నా.. ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నా అదనపు నిధులు కావాలని గుర్తించిన రేవంత్ రెడ్డి భూముల అమ్మకాలపై ఫోకస్ చేశారు. ఈ మేరకు చంద్రబాబు తన హయాంలో ఐఎంజీకి కేటాయించిన భూములు తిరిగి ప్రభుత్వానికి రావడంతో అందులో 400 ఎకరాలను విక్రయించాలని నిర్ణయించారు. ఈ భూముల అమ్మకాల ద్వారా దాదాపు రూ.30 నుంచి రూ.40 వేల కోట్ల మధ్య నిధులను సమీకరించాలని భావించారు. అయితే ఈ నిధుల సమీకరణ జరిగితే పథకాలు అమలు అయితే ప్రభుత్వానికి సానుకూల వాతావరణం వస్తుందని భావించిన బీఆరెస్ మాస్టర్ ప్లాన్ వేసి అడ్డుకున్నదని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనలు, కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ భూమి విక్రయం ఆగిపోయింది. ఇది రేవంత్ సర్కారు కు గట్టి దెబ్బ తగిలింది.
సవాలుగా పథకాల అమలు
భూ విక్రయం ఆగిపోవడంతో రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో పెరుగుదల కనిపించక పోవడంతో పథకాల అమలు రేవంత్ సర్కారుకు చాలెంజ్‌గా మారింది. రైతు భరోసా పూర్తి స్థాయిలో అమలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. అలాగే రైతు రుణమాఫీ కూడా పూర్తిగా కాలేదని, టెక్నికల్ కారణాలు చూపి నిలిపి వేస్తున్నారని బాధిత రైతులు వాపోతున్నారు. ఇది ఇలా ఉంటే సామాజిక పింఛన్లు పెంచుతానని ఇచ్చిన వాగ్దానం అమలు చేయలేని స్థితి, రైతు కూలీలకు భరోసా ఇవ్వలేక పోయిన వైనం మన ముందు కనిపిస్తోంది. ఇలా వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి కావాల్సిన నిధులు లేక రేవంత్ సర్కారు సతమత మవుతుందన్నది వాస్తవం. దీంతో రేవంత్ పాలన ఫైయిల్ అంటూ బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రజితోత్సవ సభలో ఘాటైన విమర్శలు చేశారు. వాస్తవంగా రేవంత్ సర్కారును సమర్థిస్తున్న నేతలు కేసీఆర్‌పై ఎదురు దాడి చేయవచ్చును కానీ పథకాల అమలు చేయలేకపోతున్న విషయంపై సమాధానం చెప్పుకోలేని స్థితి మాత్రం రేవంత్ సర్కారుకు, కాంగ్రెస్ పెద్దలకు ఏర్పడింది. దీంతో రేవంత్ రెడ్డి తాజాగా15 నెలలో వాస్తవమేమిటో తెలిసింది.
ఇప్పటి నుంచి తమదైన పద్దతుల్లో అన్ని పథకాలను అమలు చేస్తామని, పాలనను దౌడ్ తీయిస్తామని అంటున్నారు. ఏదీ చేయాలన్నా ఆదాయాన్ని పెంచడానికి కావాల్సిన మార్గాలను వెతుక్కోక పోతే రేవంత్ సర్కారు కు కష్టాలు తప్పవని ఆర్థిక, రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే 2024-25 వార్షిక సంవత్సరంలో ఆదాయం లేక రూ.1.50 లక్షల కోట్ల అప్పు తెచ్చామని చెప్పుకొన్నారు. తెచ్చిన అప్పుతో ఏమి చేశారో చెప్పాలని విపక్షం ఇప్పటికే డిమాండ్ చేసింది. అప్పులు చేయడం కాదు.. చేసిన అప్పుల ద్వారా ఏమి సంపద సృష్టించారో చెప్పాలని నిలదీస్తున్నది. ఈ ఏడాది కూడా ప్రభుత్వం భారీగా రూ.74 వేల కోట్లకు బడ్జెట్ ఆమోదం తీసుకున్నది. కానీ ఏ మేరకు సంపద సృష్టిస్తుందో… పథకాల అమలు ఎలా చేయబోతున్నదో చూడాలి.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రేవంత్ సర్కారుకు అదనపు ఆదాయం రాకుంటే కష్టాలు తప్పవని ఆర్థిక పరిశీలకులు అంటున్నారు. రేవంత్ సర్కారుకు ఈ ఏడాది నిధుల సమీకరణ సవాల్‌గానే ఉంటుందన్న చర్చ జరుగుతోంది.