విధాత:రుద్రవీణ నాటిక తో నాటక రంగం లో గొప్ప పేరు తెచ్చుకున్న బి.విజయ ప్రకాష్ (75) కనుమూశారు. జూన్ 1వ తేదీ ఉదయం 11.35 గంటలకు తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నాటక ప్రయోక్త హనుమంతరావు గారి శిష్యులయిన విజయ ప్రకాష్ నాటకమే జీవితం గా బ్రతికారు! వైట్ అండ్ వైట్ డ్రెస్ లో ఆఖరకు చెప్పులు కూడా తెల్లనివి వేసుకుని చేతిలో తెల్లటి సిగరెట్ పట్టుకుని మొన్నా మొన్నటి వరకు త్యాగరాయ గానసభ కు నిత్యం వచ్చేవారు ! ఉండేది జవహర్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గరలోనే! పద్మభూషణ్ ఎ.ఆర్.కృష్ణ గారి దగ్గర, అనంతరం డి.ఎస్.దీక్షిత్ గారు స్థాపించిన అక్కినేని యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో నాటకానికి దగ్గరగా విశేష సేవలు అందించారు. చివరి వరకు నాటక రంగం లోనే వున్నారు! పరుచూరి రఘుబాబు నాటకోత్సవ వ్యవస్థాపకుల్లో విజయ ప్రకాష్ కూడా ముఖ్యులుగా వ్యవహరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలి నంది నాటకోత్సవ నిర్వహణ కమిటి లో కీలక పాత్ర పోషించారు. పలు నాటక పరిషత్ లకు సలహాదారుగా, న్యాయ నిర్ణేత గా వ్యవహరించారు! ఆ రోజుల్లో ఉధృతంగా నాటకాలు ప్రదర్శించి ఉత్తమ నటుడిగా దర్శకుడిగా ప్రశంసలు అందుకున్నారు. నాటకమే శ్వాస గా, ఆధారంగా చివరి వరకు బతుకు పోరాటం చేసిన విజయ ప్రకాష్ కు అశ్రు నివాళి. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.
నివాళులు అర్పించిన ప్రముఖులు
నాటకం అంటే ఇష్టంగా అహోరాత్రులు శ్రమించిన ఉత్తమ నట దర్శక ప్రయోక్త బి.విజయ ప్రకాష్ అని తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కె.వి.రమణాచారి నివాళులు అర్పించారు. తన హయాం లో నంది నాటకోత్సవాలు ప్రారంభం నుంచి కమిటి లో వుండి దిగ్విజయం కావడానికి విశేష కృషి చేసారని ఆ రోజులను గుర్తు చేసుకుని నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎ.ఆర్.కృష్ణ గారి దగ్గర పరిచయమయ్యారని, నాటకం అంటే ప్రాణమిచ్చే వారని, నాటక రంగ వికాసం కోసం విశేష కృషి చేశారంటూ ఆంధ్రప్రదేశ్ పూర్వ నాటక అకాడమీ అధ్యక్షులు గుమ్మడి గోపాలకృష్ణ తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. అక్కినేని నాటక కళా పరిషత్ అధ్యక్షులు సారిపల్లి కొండలరావు, కళ పత్రిక సంపాదకులు డాక్టర్ మహ్మద్ రఫీ, వంశీ ఇంటర్నేషనల్ డాక్టర్ వంశీ రామరాజు, కిన్నెర ఆర్ట్ థియేటర్స్ మద్దాళి రఘురాం, జి వి.ఆర్.ఆరాధన గుదిబండి వెంకటరెడ్డి, ఫాస్ వ్యవస్థాపకులు సంస్కృతిరత్న డాక్టర్ కె.ధర్మారావు, కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యులు పండిట్ అంజుబాబు, సత్కళా భారతి జి.సత్యనారాయణ, ఈవెంట్స్ నిర్వాహకులు సతీష్, యువకళావాహిని అధ్యక్ష, ఉపాధ్యక్షులు లంక లక్ష్మీనారాయణ, బొప్పన నరసింహారావు తీవ్ర ద్రిగ్భాంతి వ్యక్తం చేసి నివాళులు అర్పించారు.