ఇంద్రారామ్ (Indra Ram), పాయల్ రాధాకృష్ణ జంటగా నిఖిల్ గొల్లమారి (Nikhil Gollamari) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చౌర్య పాఠం’(Chaurya Patham). దర్శకుడు త్రినాధరావు నక్కిన (Trinadha Rao Nakkina) ఈ చిత్రంతో నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. ఏప్రిల్ 25న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయమే సాధించింది. ఆపై అమెజాన్ (Amazon Prime Video) ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ చిత్రం నిదానంగా ప్రారంభమై ఇప్పుడు పెద్ద సంచలనమే సృష్టించింది. ఈ క్రమంలో తెలుగు ఓటీటీ ప్రపంచంలో కొత్త రికార్డు నెలకొల్పింది. మిస్టరీ, థ్రిల్లర్, క్రైమ్ మేళవింపుతో ప్రేక్షకులను కట్టి పడేసిన ఈ చిత్రం ఓటీటీకి వచ్చిన కొద్ది రోజుల్లోనే 200 మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాలు పూర్తి చేసి సరికొత్త మైలురాయిని చేరింది.
ఈ సినిమాకు పెద్ద హీరోలు, భారీ బడ్జెట్ గానీ లేవు. కానీ కథ నడిచే తీరు, భావోద్వేగాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. చిత్ర కథ ప్రకారం, ఒక యువ దర్శకుడు తన తొలి ప్రయత్నంగా ఓ సినిమా తీయడానికి డబ్బు కోసం అనే క ప్రయత్నాలు చేసి చివరకు తన మిత్రులతో కలసి గ్రామంలోని బ్యాంకును దోచాలని నిర్ణయించుకుంటాడు. ఈ నేపథ్యంలో, సినిమా సాగుతున్నంత సేపు దొంగతనం మాత్రమే కాకుండా సినిమాలోని మనుషుల వ్యక్తిత్వం, బాధ్యతలు, మనసుకు హత్తుకునే భావాలే ప్రధానంగా నిలుస్తాయి.
రవితేజతో ధమాకా, రాజ్ తరుణ్‌తో సినిమా చూపిస్తా మామ, నానితో నేను లోకల్ వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన త్రినాథరావు నక్కిన, వి. చూడామణి నిర్మించిన ఈ చిత్రం నక్కిన నరేటివ్స్ బ్యానర్‌పై రూపొందింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ అయి విస్తృత ప్రేక్షకాదరణ పొందుతోంది. అందులోనూ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇంకా మీరు ఈ సినిమా చూడకపోతే, వెంటనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో వీక్షించండి.