Liquor Cartons | లారీ బోల్తాపడి బీరు కార్టన్స్ రోడ్డుపై పడటంతో దారిన పోయేవారు రెండు చేతుల్లో పట్టినన్న బీరు బాటిళ్లను ఎత్తుకుపోయారు. ఈ ఘటన సోమవారం మధ్యప్రదేశ్‌లోని కట్ని జిల్లాలో చోటు చేసుకున్నది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ క్యాబిన్‌లో ఇరుక్కుని నానా యాతన పడుతున్నా.. బీరు బాబులకు కనీస మానవత్వం లేకుండా పోయింది. కట్ని జిల్లాలోని చాపారా గ్రామం సమీపంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం సంభవించింది. ఈ లారీ.. జబల్ పూర్ నుంచి భోపాల్‌లోని హజారిబాగ్‌కు వెళుతున్నది. రోడ్డుపైకి అకస్మాత్తుగా ఒక బర్రె రావడంతో ట్రక్ బోల్తా కొట్టిందని స్థానికులు చెబుతున్నారు. ఆ బర్రెను కాపాడే క్రమంలో డ్రైవర్ స్టీరింగ్‌పై పట్టు కోల్పోయాడు. దాంతో రోడ్డుకు పక్కగా ఒరిగిపోయింది.
ఈ ప్రమాదంతో రోడ్డుపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గాయపడి, క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను, క్లీనర్‌ను రక్షించడానికి బదులు.. అక్కడ గుమిగూడిన వాళ్లంతా లారీలోంచి పడిన బీరు బాటిళ్లను ఎత్తుకుపోయారు. అసలే ఎండలు మండిపోతున్నాయి. ఈ సమయంలో రోడ్డుపై పెద్ద సంఖ్యలో బీరు బాటిళ్లు పడటంతో దొరికిందే సందు అనుకున్నారు బీరు బాబులు. కొంతమంది మొదట డ్రైవర్‌కు, క్లీనర్‌కు సహాయం చేయబోయినా.. మద్యం బాటిళ్లు ఎత్తుకుపోతున్నవారిని చూసి.. వారు కూడా అదే పనిలో పడ్డారు. కొంతమంది సంచుల్లో నింపుకొని మరీ వెళ్లారు. మరికొందరు బీర్ల కార్టన్‌లను మోసుకుంటూ పోయారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
విషయం తెలియడంతో పోలీసులు వచ్చారు. గాయపడిన డ్రైవర్‌ను, క్లీనర్‌ను రక్షించి.. హాస్పిటల్‌కు తరలించారు. ఎక్సయిజ్ అధికారులు సైతం ఘటనాస్థలానికి చేరుకుని మిగిలిన మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. అయితే.. అప్పటికే దాదాపు లారీ మొత్తం ఖాళీ అయిపోయింది. ఈ ప్రమాదంతో తనకు లక్షల రూపాయల్లో నష్టం వాటిల్లిందని లిక్కర్ కాంట్రాక్టర్ వాపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. వైరల్ అయిన వీడియో ఆధారంగా బీర్లను పట్టుకుపోయినవారిని గుర్తించేపనిలో పోలీసులు ఉన్నారు.
People Rush To Loot Beer Bottles As Loaded Truck Overturns In MP’s Jabalpur #people #Jabalpur #BearBottles #loot #MadhyaPradesh pic.twitter.com/EUoJkaEtER
— Free Press Madhya Pradesh (@FreePressMP) May 19, 2025