Site icon vidhaatha

VasaalaMarri Village | ఆ రోజు కేసీఆర్ వదిలేస్తే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటున్నది.. 

VasaalaMarri Village | యాదాద్రి భ‌వ‌న‌గిరి జిల్లా వాసాల‌మ‌ర్రి గ్రామంలో ఇండ్ల నిర్మాణం పేరుతో మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేతిలో మోస‌పోయిన ప్ర‌జ‌ల‌కు కాంగ్రెస్ ప్ర‌భుత్వం అండ‌గా నిలుస్తుంద‌ని రాష్ట్ర రెవెన్యూ. హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ప్ర‌క‌టించారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వాసాల‌మ‌ర్రి గ్రామాన్ని ద‌త్త‌త తీసుకుంటున్న‌ట్లు 2020 న‌వంబ‌ర్ 1న ముఖ్య‌మంత్రి హోదాలో కేసీఆర్ ఆనాడు ప్ర‌క‌టించారని.. 2021 జూన్ 22న గ్రామ‌స‌భ నిర్వ‌హించి స్ధానికుల‌తో సహ‌పంక్తి భోజ‌నం చేసి..గ్రామాన్ని బంగారు వాసాల‌మ‌ర్రిగా అభివృద్ది చేస్తాన‌ని హామీ ఇచ్చారని పొంగులేటి గుర్తు చేశారు. గ్రామంలోని ప్ర‌తి కుటుంబానికి డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్లు క‌ట్టించి ఇస్తాన‌ని కేసీఆర్ హామీ ఇచ్చారని..కానీ వాస్త‌వంగా ఆరోజు నుంచి ముఖ్య‌మంత్రి ప‌ద‌వి నుంచి దిగిపోయే 2023 డిసెంబ‌ర్ 7వ తేదీ వ‌ర‌కు వాసాల‌మ‌ర్రి వైపు క‌న్నెత్తి చూడ‌లేద‌ని పొంగులేటి ప్ర‌క‌ట‌న‌లో విమ‌ర్శించారు.

ఫామ్‌హౌస్‌కు వెళ్లేందుకు ఇళ్లు కూల్చారు

కేసీఆర్ తన ఫాంహౌస్‌కు వెళ్ల‌డానికి రోడ్డు విస్త‌ర‌ణ కోసం రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇండ్ల‌ను కూల్చివేసి నిలువ నీడ లేకుండా చేశారని పొంగులేటి విమర్శించారు. ఆ బాధితులు ఇండ్లు కోల్పోయి తాత్కాలికంగా గుడిసెలు, టెంట్లు వేసుకొని కాలం వెళ్ల‌దీస్తున్నారని పేర్కొన్నారు. బంగారు వాసాలమ‌ర్రి దేవుడెరుగు.. ఉన్న ఇండ్ల‌ను కోల్పోయామ‌ని బాధితులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారన్నారు. వీరికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఇందిర‌మ్మ ప్ర‌భుత్వం అక్కున చేర్చుకుంద‌న్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేర‌కు వాసాల‌మ‌ర్రి గ్రామంలో స‌ర్వే నిర్వ‌హించి ఇందిర‌మ్మ ఇండ్ల‌కు అర్హుల‌ను గుర్తించ‌డం జ‌రిగిందని తెలిపారు.

205 మంది ఇళ్లు

అర్హులైన 205 మందికి ఇందిర‌మ్మ ఇండ్ల‌ను మంజూరు చేశామని.. ఇందుకు సంబంధించిన మంజూరు పత్రాల‌ను గురువారం నేనే స్వ‌యంగా వారికి అంద‌జేస్తున్నానని పొంగులేటి తెలిపారు . దేశానికి ద‌శ దిశ చూపిస్తా అని ప్ర‌గ‌ల్బాలు ప‌లికిన కేసీఆర్ ద‌త్త‌త గ్రామ ప్ర‌జ‌ల‌కు పంగ‌నామాలు పెట్టారని..కొత్త ఇల్లు రాలేదు.. ఉన్న ఇల్లు పోయిందని.. ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను ఆశ‌ల‌ను వారి రాజ‌కీయ అవ‌స‌రాల‌కు మాత్ర‌మే వాడుకున్నార‌ని చెప్ప‌డానికి వాసాలమ‌ర్రి గ్రామ‌మే ఒక నిద‌ర్శ‌నం” అని పొంగులేటి విమర్శించారు.

Exit mobile version