Site icon vidhaatha

బీజేపీని గెలిపిస్తే.. తెలంగాణకు అయోధ్య రామాలయంలో ఫ్రీ దర్శనం


విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అవినీతి, కుంభకోణాల్లో తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానానికి చేరుకుందని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్రంగా విమర్శించారు. మియాపూర్ భూ కుంభకోణం, కాళేశ్వరం ప్రాజెక్టులో కుంభ కోణం, మద్యం విక్రయాల్లో అక్రమాలు, ఫౌల్ర్టీలో అవినీతి, మిషన్ కాకతీయలో కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనంతా అవినీతిమయంగా మారిందని విమర్శించారు. వరంగల్ కోటలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం జరిగిన భారీ బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ధనవంతమైన తెలంగాణను కేసీఆర్ అవినీతితో అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. ప్రస్తుతం తెలంగాణను అవినీతి అడ్డగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అంటే భారత్ బ్రష్టాచార్ సమితిగా మారిందని ఎద్దేవా చేశారు. మియాపూర్ లో 4వేల కోట్ల భూ కుంభకోణం, కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్ద కుంభకోణం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిస్తూ దీనిలో వేలాది కోట్లు ఆదాయంగా మార్చుకున్నారన్నారు. పార్లమెంట్ సభ్యలు ఫౌల్ట్రీలో కుంభకోణానికి పాల్పడ్డారని విమర్శించారు. మిషన్ కాకతీయ పథకంలో రూ.22వేల కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. కేసీఆర్ కుంభకోణాలు లెక్కబెట్టాలంటే వారం రోజులు పడుతుందన్నారు. పైగా ఈఎన్నికల్లో ప్రజలను వంచిస్తూ బుజ్జగింపు చర్యలు చేపడుతోందన్నారు.తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని విమర్శించారు. ఈప్రాంత ప్రజలు నిజాం నిరంకుశ పాలనలో అనేక ఇబ్బందులు అనుభవించారన్నారు. సర్దార్ వల్లభభాయి పటేల్ వల్ల విముక్తి జరిగిందన్నారు. తాము తెలంగాణలో అధికారంలోకి రాగానే సెప్టెంబర్ 17న ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు.


– ముస్లీం రిజర్వేషన్లు రద్దు చేస్తాం

ఓవైసీ ఒత్తిడికి లోనై ముస్లింలకు రిజర్వేషన్లు పెంచారని, తాము అధికారంలోకి రాగానే రద్దు చేసి బీసీ, ఎస్సీల రిజర్వేషన్లు పెంచుతామని అమిత్ షా అన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా 4 శాతం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నారు… వాటిని రద్దు చేస్తామని ప్రకటించారు. భద్రాచలం రాముడికి సీఎం హోదాలో కేసీఆర్ పట్టు వస్త్రాలు సమర్పించే సంప్రదాయాన్ని విస్మరించి అవమానపరిచారని విమర్శించారు. కారు స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉందన్నారు. నిరుద్యోగులకు తీరని అన్యాయం చేశారని విమర్శించారు. టీఎస్పీఎస్ పరీక్షల లీకేజీ, పరీక్షల నిర్వహణ లోపం వల్ల జరిగిన ఆత్మహత్యలకు కేసీఆర్ బాధ్యులుగా పేర్కొన్నారు. బీజేపీకి అధికారం ఇస్తే ఐదేళ్ళలో రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ప్రవళిక, రహమత్ లాంటి యువత ఆత్మహత్యలు సాగకుండా చూస్తామన్నారు. తెలంగాణలో అత్యంత అవినీతికరమైన ప్రభుత్వం ఉందన్నారు. మియాపూర్ భూముల్లో 4వేల కోట్ల కుంభకోణం జరిగింది. బీజేపీ సర్కారుకు అవకాశం కల్పించండి, కేసీఆర్ దోపిడీచేసిన సొమ్మును కక్కించి ఈ డబ్బు ప్రజలకు అందజేస్తామన్నారు.


– తెలంగాణకు కాంగ్రెస్ ఏమిచ్చింది

రాహుల్ బాబాకు చెబుతున్నా.. పదేళ్ళక్రితం రెండు లక్షల కోట్లు మాత్రమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చారని అమిత్ షా విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ఒక్క తెలంగాణకే రెండున్నర లక్షల కోట్లిచ్చామన్నారు. ఐదు లక్షల కోట్లివ్వడమే కాకుండా రోడ్లు, విమానాశ్రయం, సమ్మక్క, సారలమ్మ గిరిజన యూనివర్శిటీతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఎంజీఎంలో ఎలుకలు కొరికి వ్యక్తి చనిపోయారని గుర్తుచేశారు. బీజేపీని గెలిపిస్తే ఎంజీఎం అభివృద్ధి కోసం వెయ్యికోట్ల రూపాయలు కేటాయిస్తామని ప్రకటించారు.


– అయోధ్యలో గుడి కావాలా? వద్దా

అయోధ్యలో రాముడి గుడి నిర్మాణం కావాలా? వద్దా? అంటూ అమిత్ షా ప్రశ్నించారు. 70 సంవత్సరాలుగా కాంగ్రెస్ గుడి నిర్మాణం కాకుండా అడ్డుకున్నదని విమర్శించారు. మోదీ హయాంలో జనవరి 22 పున: ప్రతిష్ట చేస్తుందన్నారు. రాముడి దర్శనం కావాలా? వద్దా? అంటూ ప్రశ్నించారు. బీజేపీని అధికారంలోకి తీసుకొస్తే తెలంగాణ ప్రజలకు రాముని దర్శనం ఉచితంగా అవకాశం కల్పిస్తామన్నారు. ఈ సభలో బీజేపీ తూర్పు అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావు, పశ్చిమ అభ్యర్థి రావు పద్మ, వర్ధన్నపట అభ్యర్థి కొండేటి శ్రీధర్, పరకాల అభ్యర్థి డాక్టర్ కాళీప్రసాదరావు, నర్సంపేట అభ్యర్థి పుల్లారావులను ప్రజలకు పరిచయం చేశారు. వీరిని గెలిపించాలని అమిత్ షా కోరారు. సమావేశంలో ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు.

Exit mobile version