Cyber Crime | సైబర్ మోసానికి గురైతే ఏం చేయాలి?

సైబర్ మోసానికి గురైతే ఏం చేయాలి? ఎలా దాని నుంచి బయటపడాలి? మోసపోయిన సొమ్మును రికవరీ చేసుకొనే అవకాశం ఉందా? ఎక్కడ ఫిర్యాదు చేయాలి? ఆన్ లైన్ లో కూడా ఫిర్యాదు చేసే వెసులుబాటు ఉంటుందా? సైబర్ నేరాలకు గురికాకుండా ఉండేందుకు ఏం చేయాలి?

సైబర్ మోసానికి గురైతే వెంటనే ఫిర్యాదు చేయాలి. 1930 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా మీరు వెంటనే ఫిర్యాదు చేయవచ్చు. లేదా https:cybercrime.gov.in వెబ్ సైట్ ద్వారా కూడా మీ ఫిర్యాదును రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదా సమీపంలోని పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఎన్ సీ ఆర్ బీ ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా సైబర్ నేరాలను దర్యాప్తు చేసే సిబ్బంది ప్రత్యేకంగా ఉన్నారు. సైబర్ నేరాలకు గురైతే ఫిర్యాదు చేయడానికి కొన్ని సమయాల్లో ఇబ్బంది పడుతుంటాం. ఎలాంటి ఇబ్బందిపడకుండా ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు చేసిన వారి వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచుతారు. సైబర్ నేరగాళ్లు మీ బ్యాంకు సమాచారం తీసుకొని డబ్బులు డ్రా చేస్తారనే అనుమానం ఉంటే వెంటనే బ్యాంకు అధికారులకు మెయిల్ ద్వారా సమాచారం ఇవ్వండి. అవసరమైతే రాతపూర్వకంగా కూడా సమాచారం ఇవ్వాలి. ఇలా చేస్తే మీ బ్యాంకు నుంచి సైబర్ నేరగాళ్లు నగదును తమ బ్యాంకు ఖాతాకు తరలించకుండా బ్యాంకు అధికారులు ఖాతాను హోల్డ్ లో పెడతారు.

డబ్బులు కోల్పోతే ఏం చేయాలి?

సైబర్ నేరగాళ్ల చేతిలో డబ్బులు కోల్పోతే వెంటనే 1930 నెంబర్ కు ఫిర్యాదు చేయాలి. లేదా సైబర్ క్రైమ్ పోర్టల్ లేదా ఎన్ సీ ఆర్ పీ వెబ్ సైట్ లో ఫిర్యాదు చేయాలి. ఈ ఫిర్యాదు అందిన వెంటనే సంబం‌‍ధిత పోలీసు అధికారితోపాటు బ్యాంకు నోడల్ అధికారికి చేరుతుంది. ఈ ఫిర్యాదు ఆధారంగా సంబంధిత బ్యాంకు లావాదేవీలను పరిశీలిస్తారు. మోసపూరితంగా డబ్బులు పొందినట్టు గుర్తిస్తే సీఆర్ పీ సీ సెక్షన్ 102 కింద అకౌంట్లను ఫ్రీజ్ చేస్తారు. మోసానికి గురైన అరగంటలోపుగానే ఫిర్యాదు చేస్తే డబ్బును రికవరీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గంట తర్వాత రికవరీ చేస్తే ఈ అవకాశం కొంత తక్కువగా ఉండవచ్చు. 24 గంటల తర్వాత ఫిర్యాదు చేస్తే మీ డబ్బులు రికవరీ అయ్యే అవకాశం 30 శాతానికి పడిపోయే అవకాశం ఉంది. 72 గంటల తర్వాత ఫిర్యాదు చేస్తే డబ్బులు రికవరీ అయ్యే అవకాశం ఐదు శాతమే అని అధికారులు చెబుతున్నారు.

సాక్ష్యాలను భద్రపర్చడం ముఖ్యమే

సైబర్ మోసాలకు సంబంధించి మేసేజ్, ఈ మెయిళ్లు, ఇతర పత్రాల స్క్రీన్ షాట్లు, ప్రింట్లు భద్రపర్చుకోవాలి. సైబర్ క్రైమ్ పోర్టల్ , స్థానికంగా సైబర్ క్రైమ్ కార్యాలయం లేదా స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసే సమయంలో ఈ పత్రాలు ఉపయోగపడతాయి. మీరు మొబైల్ లో ఉపయోగించే పోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్ ల పాస్ వర్డులు మార్చుకోవాలి. అదే విధంగా నెట్ బ్యాంకింగ్ పాస్ వర్డ్స్ కూడా మార్చుకోవాలి.

రికవరీ సొమ్ము ఎలా తీసుకోవచ్చు?

సైబర్ నేరగాళ్ల నుంచి రికవరీ చేసిన సొమ్మును నేరుగా బాధితుడు తీసుకొనే వీలుండదు. ఈ డబ్బు కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలి. ఈ పిటిషన్ పై కోర్టు విచారిస్తుంది. విచారణ అధికారి నివేదికను కోర్టు పరిశీలిస్తుంది. దీని ఆదారంగా బాధితుడికి డబ్బు ఇవ్వాలని కోర్టు ఆదేశిస్తుంది. దీని ఆధారంగా పోలీసులు బ్యాంకులను సంప్రదించి ఫ్రీజ్ చేసిన అకౌంట్ల నుంచి డబ్బులను తిరిగి ఇస్తారు.

Also Read –Uttarpradesh | గంటల వ్యవధిలోనే పెళ్లి, విడాకులు.. అసలేం జరిగిందంటే?
Sarpanch Elections| అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ గా పోటీ
AP News | భర్త వేధింపులు.. ఐఏఎస్ ఆఫీసర్ కూతురు ఆత్మహత్య

Latest News