విధాత, హైదరాబాద్ : సినిమాల పైరసీ కేసులో ఐబొమ్మ రవిపై సైబర్‌క్రైమ్ పోలీసులు 5 కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఒక కేసులో సైబర్‌క్రైమ్ పోలీసులు ఇమ్మడి రవిని అరెస్టు చేశారు.ఐ బొమ్మ రవి కేసులో రెండో రోజు కస్టడీలో విచారణ కొనసాగిస్తున్నారు. క్రిప్టో వ్యాలెట్స్ వివరాలు, విదేశీ భాగస్వాముల వివరాలపై ఆరా తీస్తున్నారు.
విచారణలో భాగంగా సైబర్ క్రైమ్ పోలీసులు ఎస్బీఐ టెక్నీకల్ టీంని పిలిపించారు. ఎస్బీఐ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పోర్టల్ కు ఐ-బొమ్మకు లింక్ ప్రత్యక్షమవడంతో దీనిపై ఎస్బీఐ టీమ్ నుంచి వివరాలు సేకరిస్తున్నారు. పోర్టల్ నుండి ఐ బొమ్మ లింక్ ను తొలగించే అంశంపై టెక్నికల్ సపోర్ట్ ను పరిశీలిస్తున్నారు.
ఐ బొమ్మ రవిపై ఇప్పటికే 10 సెక్షన్లు పెట్టిన పోలీసులు..మరో మూడు సెక్షన్లు నమోదు చేశారు. ఐటీ యాక్ట్ , బీఎన్ఎస్ సెక్షన్లు, సినిమాటోగ్రఫీ యాక్ట్ , ఫారినర్స్ యాక్ట్ కింద 10 సెక్షన్లు నమోదు చేశారు. తాజాగా ఫోర్జరీ సెక్షన్ ను జోడించారు. ప్రహ్లాద్ అనే వ్యక్తి పేరు మీద పాన్ కార్డ్, బైక్ లైసెన్స్, ఆర్సీ తీసుకున్న కేసులో ఫోర్జరీ సెక్షన్లు జోడిస్తూ కోర్టులో మెమో ఫైల్ చేశారు.
