పోటాపోటీగా బీఆర్ఎస్..జాగృతి విద్యార్థి సదస్సులు

కవిత తమ అనుబంధ సంస్థల సదస్సులు నిర్వహించడం చర్చనీయాంశమైంది. కవిత మాత్రం తన ప్రసంగంలో రాజకీయ విమర్శలు చేయనప్పటికి ఈ రోజు రాజకీయాలు సోషల్ మీడియా బలంగా సాగుతున్నాయని..ఎవరు ఎక్కువ తిట్లు తిడితే వారికి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయని..కంటెంట్..కాలిబర్ లేని నాయకులే తిట్లకు దిగుతారంటూ వ్యాఖ్యానించారు. కవిత పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డి సహా కేటీఆర్ లక్ష్యంగానే ఆ వ్యాఖ్యలు చేసినట్లుగా కనిపిస్తుంది

విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరుకు నిదర్శనమన్నట్లుగా ఒకేరోజు ఆ పార్టీ కీలక నాయకులు మాజీ మంత్రి టి.హరీష్ రావు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, పార్టీ ఎమ్మెల్సీ కవితలు తమ అనుబంధ సంస్థల సదస్సులు నిర్వహించడం చర్చనీయాంశమైంది. హైదరాబాద్ ఉప్పల్ సమీపంలోని మల్లాపూర్ వీఎన్ఆర్ గార్డెన్‌లో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్వీ రాష్ట్ర స్థాయి సదస్సుకు హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్బంగా బనకచర్ల ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నీళ్ల కోసం మరో ఉద్యమం చేస్తామని ప్రకటించారు. మరోవైపు యువత, మహిళలు, బహుజనులను రాజకీయాల్లో ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ‘‘లీడర్’’ బిల్డ్ తెలంగాణ రాజకీయ శిక్షణ తరగతులను మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని కొంపల్లి శ్రీ కన్వెన్షన్ హాల్ లో నిర్వహించారు. ఇలా ఒకే పార్టీకి చెందిన నాయకులు తమ పరిధిలోని విభాగాల సారధ్యంలో నిర్వహించిన సదస్సులు నిర్వహించిన తీరు ఆ పార్టీలో రాజకీయ ఆధిపత్య పోరుకు నిదర్శనంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

హరీష్ రావు తన ప్రసంగంలో సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. కవిత మాత్రం తన ప్రసంగంలో రాజకీయ విమర్శలు చేయనప్పటికి ఈ రోజు రాజకీయాలు సోషల్ మీడియా బలంగా సాగుతున్నాయని..ఎవరు ఎక్కువ తిట్లు తిడితే వారికి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయని..కంటెంట్..కాలిబర్ లేని నాయకులే తిట్లకు దిగుతారంటూ వ్యాఖ్యానించారు. కవిత పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డి సహా కేటీఆర్ లక్ష్యంగానే ఆ వ్యాఖ్యలు చేసినట్లుగా కనిపిస్తుంది. తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ జాగృతి పోరాడుతుందని మరోసారి పునరుద్ఘాటించారు. ఆగస్టు 6న జయశంకర్ బర్త్ డే సందర్భంగా జిల్లా, మండల కమిటీలు వేస్తామని ప్రకటించారు. జాగృతి సంస్థ బలోపేతం..విస్తరణ లక్ష్యంగానే ఆమె అడుగులు..విమర్శలు..రాజకీయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆమె వ్యవహారం చూస్తే సొంతంగా రాజకీయంగా ఎదిగి బీఆర్ఎస్ లో నాయకత్వం కోసం ఒత్తిడి చేయడం…లేదా మరో రాజకీయ పార్టీలో కీలక స్థాయిలో ఎంట్రీ కోసం కావచ్చని విశ్లేషిస్తున్నారు. వీలైతే జాగృతిని రాజకీయ పార్టీగా మార్చవచ్చని కూడా భావిస్తున్నారు.