బీఆరెస్ చస్తూ .. బీజేపీనే గెలిపించింది

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సంతోషకరమైన ఫలితాలు వచ్చాయని, రాహుల్ గాంధీ భారత్ జోడో, న్యాయ్‌ యాత్ర దేశవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులను ఏకం చేయడంతో ఇండియా కూటమిని ప్రజలు ఆదరించి అధికారానికి చేరువ చేశారని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

  • Publish Date - June 5, 2024 / 03:46 PM IST

పార్లమెంటు ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు సంతృప్తికరం
బీఆరెస్ చస్తూ బీజేపీనే గెలిపించింది
అందుకే బీఆరెస్ ఓట్ల శాతం తగ్గి..బీజేపీ ఓట్ల శాతం పెరిగింది
బీజేపీ గెలిచిన ఎనిమిది చోట్ల బీఆరెస్‌కు డిపాజిట్లు కూడా రాలేదు
బీజేపీని గెలిపించేందుకు బీఆరెస్ ఆత్మబలిదానంతో అవయవదానం
కేసీఆర్ ఒక రాజకీయ జూదగాడు..
ప్రజా తిరస్కరణకు గురైన మోదీ మళ్లీ ప్రధాని పదవి చేపట్టవద్దు

ఏపీలో ఏ ప్రభుత్వమున్నా సమస్యలు పరిష్కరించుకుంటాం
సీఎం రేవంత్‌రెడ్డి

విధాత, హైదరాబాద్‌ : పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సంతోషకరమైన ఫలితాలు వచ్చాయని, రాహుల్ గాంధీ భారత్ జోడో, న్యాయ్‌ యాత్ర దేశవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులను ఏకం చేయడంతో ఇండియా కూటమిని ప్రజలు ఆదరించి అధికారానికి చేరువ చేశారని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

2023 శాసనసభ ఎన్నికల్లో 64 సీట్లలో కాంగ్రెస్‌కు,మిత్రపక్షం సీపీఐకి ఒక సీటులో 39.5శాతం ఓట్లతో ప్రజా పాలనకు ప్రజలు ఆమోదం తెలిపారని గుర్తు చేశారు. ప్రజా ప్రభుత్వంలో వందరోజుల్లో 5 గ్యారంటీలను అమలు చేసి పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగామని, ఈ ఎన్నికలు మా వంద రోజుల ప్రజా పాలనకు రెఫరెండం అని ముందే విస్పష్టంగా చెప్పామన్నారు. 17పార్లమెంట్ స్థానాల్లో 8 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుందని, ఈ ఎన్నికల్లో 41శాతం ఓట్లు కాంగ్రెస్‌కు వచ్చాయని పేర్కోన్నారు. అంటే డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాకు 39.5శాతం ఓట్లు వస్తే మా ప్రభుత్వం వంద రోజుల పాలన తర్వారా 41శాతం ఓట్లు వేసి ప్రజలు మా పాలనను ఆశీర్వదించారని భావిస్తున్నామన్నారు. 2019పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మూడు సీట్లు ఇస్తే ఈ ఎన్నికల్లో 8సీట్లలో గెలిపించి అధిక ఓట్లు, సీట్లు ఇచ్చారన్నారు. మా పరిపాలనపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఈ ఫలితాలతో అర్ధమవుతోందన్నారు. అంతేగాకుండా కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలిపించి ప్రజలు మాకు మరో సీటు అదనంగా ఇచ్చి అసెంబ్లీలో మా సీట్ల సంఖ్యను 65కు పెంచి మా పాలనను ఆమోదించారని చెప్పారు. ఎన్నికల్లో పనిచేసిన పార్టీ కేడర్‌కు కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు.

బీఆరెస్ ఆత్మబలిదానంతో బీజేపీని గెలిపించింది

పార్లమెంటు ఎన్నికల్లో బీఆరెస్ నాయకులు ఆత్మ బలిదానం చేసుకుని అవయవదానం చేసి బీజేపీ గెలిపించారన్నారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 4సీట్లు గెలువగా, ఈ ఎన్నికల్లో 8పార్లమెంటు సీట్లు గెలిచిందని, గత ఎన్నికల్లో 20శాతం ఓట్లు వస్తే, ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి 35శాతం ఓట్లు పెరిగాయన్నారు. బీజేపీ గెలిచిన 8 స్థానాల్లో బీఆరెస్ 7 సీట్లలో డిపాజిట్లు కోల్పోవడమే ఇందుకు నిదర్శనమని రేవంత్‌రెడ్డి పేర్కోన్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ ప్రారంభంలోనే కేసీఆర్ బీజేపీ గెలుపుకు సహాయం చేసేందుకు బలహీనమైన అభ్యర్థులను పోటీలో పెట్టాడని తాను ఆరోపించిన సంగతిని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. 2001లో టీడీపీకి రాజీనామా చేసిన కేసీఆర్ సిద్ధిపేటలో పోటీ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా సిద్దిపేటలోనే బీఆరెస్‌కు అత్యధిక మెజార్టీ రావడం జరుగుతుందన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సిద్దిపేటలో హరీష్ తమ ఓట్లను పూర్తిగా బీజేపీకి బదిలీ చేయించడంతో సిద్ధిపేటలో బీఆరెస్‌కు 2,500ఓట్ల మెజార్టీ మాత్రమే వచ్చిందని, తద్వారా రఘునందన్‌రావు గెలుపుకు సహకరించారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రఘునందన్ రావుకు బీఆరెస్‌ ఓట్లను బదిలీ చేసి మెదక్ పార్లమెంట్ స్థానంలో బలహీన వర్గాల బిడ్డను ఓడించారన్నారు. సిద్ధిపేటలో బీఆరెస్ ఓట్ల బదలాయింపు కారణంగానే మేం మెదక్ సీటు కోల్పోవడానికి కారణమని రేవంత్ స్పష్టం చేశారు. బీఆరెస్‌ను నమ్మి నిలబడిన వెంకట్ రామ్ రెడ్డిని నమ్మించి మోసం చేసి మరీ కాంగ్రెస్‌ను ఓడించే లక్ష్యంతో కేసీఆర్ బీజేపీని గెలిపించారన్నారు.

తగ్గిన బీఆరెస్ ఓట్ల శాతమే ఓట్ల బదిలీకి రుజువు

ఏడు పార్లమెంటు స్థానాల్లో గత పార్లమెంటు ఎన్నికల్లో బీఆరెస్‌ 37.5శాతం ఓట్లు సాధిస్తే ఈ ఎన్నికల్లో 16.5శాతం ఓట్లకు అంటే 22శాతం ఓట్ల శాతానికి పడిపోయారంటే ఆ మేరకు బీఆరెస్ వాళ్లు తమ ఓట్లు బీజేపీకి బదిలీ చేశారని ఆరోపించారు. తద్వారా బీజేపీ 8సీట్లు గెలువగలిగిందన్నారు. 2023లో 13శాతం ఓట్లున్న బీజేపీకి.. ఈ ఎన్నికల్లో 35.5 శాతంకు ఓట్లు పెరిగాయన్నారు. బీజేపీ ఓట్లు 22.5శాతం పెరిగితే బీఆరెస్ ఓట్లు 22శాతం ఓట్లు తగ్గిపోయాయన్నారు. తద్వరా బీజేపీ 8సీట్లు గెలువగా, మెదక్ మినహా ఆ పార్లమెంటు స్థానాల్లో బీఆరెస్ డిపాజిట్లు కోల్పోయి తద్వారా బీజేపీని గెలిపించిందన్నారు. బీఆరెస్ చస్తూ బీజేపీని గెలిపించిందని, ఇంందుకు కేసీఆర్‌, హరీశ్‌రావులు ప్రయత్నం చేశారన్నారు. శాసన సభ ఎన్నికల్లో 39ఎమ్మెల్యేల స్థానాలు బీఆరెస్ గెలువగా, ఈ పార్లమెంటు ఎన్నికల్లో 119 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 3సీట్లు సిరిసిల్ల, సిద్ధిపేట, గజ్వేల్‌లో మాత్రమే బీఆరెస్‌కు డిపాజిట్లు వచ్చిన తీరు ఓట్ల బదలాయింపు కుట్రకు రుజువన్నారు. అంటే కేసీఆర్‌,హరీశ్‌రావులు బీఆరెస్ నాయకుల తమ ఆత్మగౌరవాన్ని, ఆ పార్టీ శాసన సభ్యుల ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారని తేలిపోతుందన్నారు. రాష్ట్రంలో తనంతట తానే అంతర్ధానం అయ్యి కేసీఆర్‌ బీజేపీకి మద్దతుగా నిలిచారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. పూర్తిగా వారి ఓట్లను బీజేపీకి బదలాయించి రాజకీయ అరాచకానికి పాల్పడ్డారని, ఈ పరిణామాన్ని ప్రజల, ప్రజాస్వామ్యవాదులు, లౌకిక వాదులు గమనించాలన్నారు. కేటీఆర్ బీఆరెస్ మళ్లీ ఫినెక్స్ పక్షిలాగా లేస్తామంటున్నారని, ఇప్పటికే బూడిద అయ్యారని, బూడిదైన బీఆరెస్ మళ్లీ పుట్టేది లేదని, ఆ బూడిద తీసుకెళ్లి కేసీఆర్‌కు పూసుకోమన్నారు. వందరోజుల్లోనే మాపై ఆరోపణలు చేసిన బీఆరెస్ కు ప్రజలు బుద్ధి చెప్పారని, రాష్ట్ర అవతరణ వేడుకలకు కూడా రాకుండా కుట్రపూరితంగా వ్యవహరించిన బీఆరెస్ ను ప్రజలు తిరస్కరించారని, ఇప్పటికైనా వ్యవహార శైలి మార్చుకోవాలని బీఆరెస్ కు సూచన చేస్తున్నాన్నారు. హరీష్ రావు , బీఆరెస్ నాయకులు ఆత్మాహుతి దళాలుగా మారి కాంగ్రెస్ ను దెబ్బతీయాలనుకుంటే చివరికి కనుమరుగై కాలగర్భంలో కలిసిపోతారని హెచ్చరించారు.

ప్రజాతీర్పు మేరకు మోదీ ప్రధాని పదవి మళ్లీ చేపట్టకూడదు

పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని మోదీ గ్యారెంటీ పేరుతో బీజేపీ నేతలు ఈ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లారని, బీజేపీ 303 సీట్ల నుంచి 243కి పడిపోయిందని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. మోదీ గ్యారెంటీకి వారంటీ చెల్లిపోయిందని ప్రజలు తీర్పు ఇచ్చారని, దేశ ప్రజలు మోదీని తిరస్కరించారని, తక్షణమే మోదీ ప్రధాని పదవికి రాజీనామా చేయాలని, ప్రజల తిరస్కరణకు గురైన మోదీ మళ్లీ ప్రధాని పదవి చేపట్టకూడదని డిమాండ్ చేశారు. విలువలు కలిగిన నాయకుడిగా హుందాగా తప్పుకుంటే మోదీకి గౌరవం ఉంటుందన్నారు. ఇప్పటికైనా బీజేపీ అప్రజాస్వామిక తీరును మార్చుకోవాలన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీ 42శాతంఓట్లు, కాంగ్రెస్‌కు 41శాతం ఓట్లు వచ్చిన తీరు ఇండియా కూటమికి ప్రజాదరణను వెల్లడిస్తుందన్నారు. ప్రజల ఆలోచనలో మార్పుకు నిదర్శనమని, యూపీలో ఫలితాలు కూడా ఇదే చాటుతున్నాయన్నారు. రామాలయం నిర్మించిన ఫైజాబాద్ లోక్‌సభ స్థానంలోనూ బీజేపీ ఓటమి చెందిందని, రాముడి పేరుతో ఓట్ల యాచనకు పాల్పడిన బీజేపీకి ఫైజాబాద్ ప్రజలు, రాముడు గుఠపాఠంచెప్పారన్నారు. రాష్ట్రంలో నా జిల్లా మహబూబ్‌నగర్ సీటుతో పాటు అన్ని సీట్ల గెలుపు, ఓటములకు పూర్తి బాధ్యత పీసీసీ చీఫ్‌గా, సీఎంగా నాదేనని స్పష్టం చేశారు. వచ్చిన ఫలితాలు ఉగాది పచ్చడిలాంటివన్నారు. ఇప్పటివరకు 18 గంటలే పనిచేశామని, ప్రజలను మెప్పించేందుకు ఇకనుంచి మరో రెండు గంటలు ఎక్కువ పనిచేస్తామన్నారు. మల్కాజ్‌గిరి ఎంపీ సీటు ఓడినా ఆ పార్లమెంటు పరిధిలోని కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం గెలుచుకున్నామన్నారు.

బీజేపీతో కేసీఆర్ బేరసారాలు

బీఆరెస్ నాయకులు, కార్యకర్తల ఆత్మగౌరవాన్ని బలిస్తున్న కేసీఆర్ బీజేపీతో బేరసారాలు చేస్తున్నాడని, ఇప్పటికైనా బీఆరెస్ ఎమ్మెల్యేలు ఆత్మ ప్రబోధానుసారం నిర్ణయాలు తీసుకోవాలన్నారు. కేసీఆర్ ఒక రాజకీయ జూదగాడని, ఆయన ఉన్నంత కాలం కుట్రలు కుతంత్రాలు కొనసాగుతూనే ఉంటాయని తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మహారాష్ట్రలో ఇలాంటి కుట్రలతో శివసేనను చీల్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మోదీ తెలంగాణలో అలాంటి ప్రయోగం చేస్తాడో లేదో చూడాల్సివుందన్నారు. కేసీఆర్ అత్యంత అవినీతి పరుడు అన్న బీజేపీ… బీఆరెస్‌తో ఎలా జతకడుతుందో చూడాలని వాటన్నింటిని విశ్లేషించేందుకు మరికొంత సమయం పడుతుందన్నారు. ఏపీలో ఏ ప్రభుత్వం ఏర్పడినా రాష్ట్ర సమస్యలను స్నేహపూర్వక వాతావరణంలో సంప్రదింపులతో శాశ్వతంగా పరిష్కరించుకుంటామన్నారు. ఉమ్మడి రాజధాని చట్టపరంగా పరిష్కృతమై హైదరాబాద్ ఇప్పుడు తెలంగాణ రాజధానిగా ఉందని, అలాగే చట్టపరంగా చర్చల ద్వారా అన్ని సమస్యలు పరిష్కరించుకోవడం జరుగుతుందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాకు సంబంధించి చట్టబద్దతతో కూడిన హామీకి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు.

Latest News