చార్‌ సౌ పార్‌.. పాయె.. బీజేపీకే సాధారణ మెజార్టీ లేదు!

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తనకు 370, తన కూటమికి 400 సీట్లు దాటిపోతాయంటూ ప్రచారం చేసుకుంటూ వచ్చింది. కానీ.. కడపటి వార్తలు వచ్చేసరికి బీజేపీకే మెజార్టీ దక్కని దుస్థితి నెలకొన్నది. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో కలిసి 290 దగ్గర్లో కొట్టుమిట్టాడుతున్నది.

  • Publish Date - June 4, 2024 / 04:02 PM IST

(విధాత ప్రత్యేకం)
ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తనకు 370, తన కూటమికి 400 సీట్లు దాటిపోతాయంటూ ప్రచారం చేసుకుంటూ వచ్చింది. కానీ.. కడపటి వార్తలు వచ్చేసరికి బీజేపీకే మెజార్టీ దక్కని దుస్థితి నెలకొన్నది. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో కలిసి 290 దగ్గర్లో కొట్టుమిట్టాడుతున్నది. ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు యూపీ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, కేరళలో బీజేపీ ప్రభావాన్ని గట్టిగా నిలువరించగలిగాయి. ఎందుకిలా జరిగింది? భారీ ఎత్తున ఎన్నికల యంత్రాంగాన్ని కలిగి ఉన్న బీజేపీ, అందులోనూ అధికార యంత్రాంగాన్ని సైతం తన చెప్పుచేతల్లో ఉంచుకున్నదన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్డీయే ప్రభుత్వం.. వాస్తవాలను గుర్తించడానికి నిరాకరించిందా? లేక వాస్తవ పరిస్థితులను సరిగా అర్థం చేసుకోలేక దెబ్బతిన్నదా? ఇప్పుడు బీజేపీ అనుకూల వర్గాలను వేధిస్తున్న ప్రశ్న ఇది.

వాస్తవానికి ఎగ్జిట్‌పోల్స్‌లో బీజేపీ హవా ఉంటుందని పలు మీడియా సంస్థలు హోరెత్తించాయి. కొన్ని బీజేపీ అనుకూల చానళ్లుగా చెప్పేవి 400 దాటిపోతారని కూడా జోస్యం చెప్పాయి. ఇది మైండ్‌ గేమ్‌ మాత్రమేనని ఇండియా కూటమి నేతలు చెబుతూ వచ్చారు. వాస్తవ ఫలితాలు వచ్చేసరికి ఎగ్జిట్‌పోల్స్‌ మరోసారి అట్టర్‌ఫ్లాప్‌ అయ్యాయని తేలిపోయింది. ఇప్పుడు మోదీ తనకు బలం లేక.. తన భాగస్వామ్యపక్షాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొన్నది.2004లో బీజేపీ ప్రభుత్వం భారత్‌ వెలిగిపోతున్నదంటూ ఎన్నికలకు వెళ్లింది. కానీ.. ఆ నినాదం బెడిసికొట్టింది. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా వాజ్‌పేయి ప్రభుత్వం వ్యవహరించిన దరిమిలా ఓడిపోయింది. ఇప్పుడు సైతం బీజేపీకి అదే పరిస్థితి ఎదురైంది. కాకపోతే.. చావు తప్పి కన్ను లొట్టబోయింది. దేశ ఆర్థిక వ్యవస్థలో పురోగతి ఉన్నప్పటికీ.. అది కొన్నివర్గాలకే పరిమితమైపోయింది. ధరల పెరుగుదల, నిరుద్యోగిత అంశాలను రామ మందిరం, హిందూ, ముస్లిం విద్వేషాలు కొన్ని చోట్ల అధిగమించలేక పోయాయి.

ప్రతిపక్షాల ఐక్యతతో దెబ్బ

బీజేపీ ఇంతటి దయనీయ పరిస్థితిని ఎదుర్కొనడానికి బయటి కారణాల్లో ప్రతిపక్షాల ఐక్యత ఒక కీలక అంశంగా ఉన్నది. అందుకే మొదటి నుంచీ ప్రతిపక్షాలు ఏకం కాకుండా బీజేపీ చేయని ప్రయత్నం లేదు. ప్రతిపక్ష పార్టీల్లో చీలికలు తెచ్చి, ప్రతిపక్ష నాయకులను జైళ్లలో వేసి వారి సంకల్పాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించింది. ఇండియా కూటమి ఆవిర్భావానికి కారకుడైన నితీశ్‌కుమార్‌ను తనవైపు తిప్పుకొని ఆదిలోనే హంసపాదులా నిలిచింది. కానీ.. మిగిలిన పక్షాలు ఐక్యంగా ఉండటమే కాకుండా.. ఇండియా కూటమిని కొద్దికాలంలోనే అయినా దృఢంగా తయారు చేసుకోగలిగారు. ఫలితంగానే ఎన్డీయే 300 సీట్లకు అటూ ఇటూగా కొట్టుమిట్టాడుతున్నది. ఇక బీజేపీకి సొంతగా మెజార్టీ కూడా దక్కలేదు. అదే సమయంలో రాహుల్‌గాంధీ ఒకే ఒక్కడై దేశవ్యాప్తంగా పర్యటిస్తూ కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోను ప్రజలకు బలంగా తీసుకువెళ్లగలిగారన్న చర్చ జరుగుతున్నది. రిజర్వేషన్ల పెంపు వంటి అంశాలు, కోట్ల మందిని లక్షాధికారులను చేస్తామన్న హామీలు ప్రజల్లో సానుకూలను పెంచాయి. అదే సమయంలో బీజేపీ 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చివేసి, రిజర్వేషన్లను రద్దు చేస్తుందనే ప్రచారం కూడా బీజేపీ కొంప ముంచింది.

చెప్పుకోవడానికి చేసిన అభివృద్ధి లేకపోవడంతో బీజేపీ ప్రధానంగా రామ మందిరంపైనే ఆశలు పెట్టుకున్నది. అయితే.. రాముడు సైతం యూపీలో బీజేపీని కాపాడలేక పోయాడు. అయోధ్య ఉన్న ఫైజాబాద్‌లోనే బీజేపీ గెలవలేక పోయింది. దీనర్థం.. బీజేపీ బలంగా ఉంటాయనుకునే ఉత్తరాది రాష్ట్రాల ఓటర్లు ఆ పార్టీ మతతత్వ వాదనలను తిరస్కరిస్తున్నారు. దీన్ని గమనించే దక్షిణ భారతదేశంలో తన ప్రాబల్యం పెంచుకునేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నించింది. అందులో భాగంగానే కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ప్రధానంగా కేంద్రీకరించింది. తమిళనాడు, కేరళ మినహాయిస్తే మిగిలిన చోట్ల తన సీట్లు పెంచుకోగలిగింది. ఏపీలో టీడీపీతో ఆఖరి నిమిషంలో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఉత్తరాదిలో తగ్గే సీట్లలో కొన్నింటిని ఇక్కడ భర్తీ చేసుకోవడంలో సఫలమైంది. ఒక విధంగా బీజేపీకి పరువు నష్టం కాకుండా కాపాడింది కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలేనని ఒక సీనియర్‌ జర్నలిస్టు అన్నారు.

బీజేపీ పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈడీ, సీబీఐ, ఐటీ విభాగాలను ఉపయోగించుకుని ప్రతిపక్షాలను కట్టడి చేయగలిగింది. ఇద్దరు ముఖ్యమంత్రులను కీలక సమయంలో జైల్లో వేసి.. వాటి రాజకీయ ప్రచార కార్యక్రమాలను అడ్డుకున్నది. ఎన్నికల సంఘం లాంటి స్వతంత్ర సంస్థలు అధికార పక్షం పెద్ద ఎత్తున కోడ్‌ ఉల్లంఘనలకు పాల్పడుతున్నా.. మౌనంగా చూస్తూ ఉండిపోయింది. ఎన్నికల్లో, ప్రచారంలో అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు ఉండి ఉంటే.. బీజేపీ ఓటమి చవిచూడాల్సి వచ్చేదంటే ఆశ్చర్యం కాదు.

Latest News