విధాత : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం అత్తా కోడళ్ల మధ్య చిచ్చు రేపడంతో పాటు ఇరువర్గాల వారు పరస్పరం దాడులకు దిగి కొట్టుకునేందుకు కారణమైంది. ఇందుకు సంబంధించిన వివాదం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం జనగామ గ్రామంలో “శిరీష” అనే మహిళ కు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యింది. ఇంటి నిర్మాణ పెట్టుబడి కోసం శిరీష తన అత్త, మామలను డబ్బులు అడిగింది. ఆ డబ్బుల విషయంలో అత్తా-కోడళ్ల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ పంచాయితీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. అత్త మామలతో పాటు.. వారి కుటుంబ సభ్యులపైనా కోడలు పిర్యాదు చేసింది.
ఇది కుటుంబ సమస్య కాబట్టి.. పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకోవాలని పోలీసులు సముదాయించారు. దీంతో.. పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకుంటుండగానే.. అత్తా, కోడళ్ల కు చెందిన వర్గాలు.. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇరువర్గాల వారు పోలీసుల సమక్షంలోనే పొట్టు పొట్టుగా కొట్టుకున్నారు. వారి ఘర్షణతో నారాయణపురం పోలీస్ స్టేషన్ ప్రాంగణమంతా యుద్ధ వాతావరణాన్ని తలపించింది. వారి గొడవను ఆపేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు. ఇది చూసిన గ్రామస్తులు ఇందిరమ్మ ఇళ్లు ఎంత పనిచేసింది…అత్తా కోడళ్లను పోలీస్ స్టేషన్ పాలు చేసిందంటూ పెదవి విరుస్తున్నారు.