విధాత, హైదరాబాద్ : ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు దుష్ప్రచారం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షులు బీ.మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎంల భేటీ అంశాలు..తీసుకున్న నిర్ణయాలపై హరీష్ రావు చేసిన విమర్శలను ఖండించారు. హరీష్ రావు వాదనలలో పస లేదన్నారు. సీఎంల సమావేశంలో ఏ అంశాలపై ఏమీ మాట్లాడారో స్వయంగా కేంద్ర మంత్రి సీ.ఆర్ పాటిల్ చెప్పిన కూడా హరీష్ రావు పిచ్చి వాగుడు వాగుతూ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలోని అంశాలు, ఏమి మాట్లాడారో స్పష్టంగా సీఎ: రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా కూడా హరీష్ రావు మెదడుకు ఎక్కనట్టు ఉందన్నారు. హరీష్ రావు ఆరు అడుగులు పెరిగాడే తప్ప.. ఆర అంగుళం మెదడు పెంచుకోలేదని.. అడ్డగోలు వాదన, అర్థం లేని తర్కంతో పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాడని మండిపడ్డారు. సీఎం మాట్లాడగానే దానిపై ఏదో ఒకటి మాట్లాడి తన ఉనికిని చాటు కోవాలన్న తపన తప్ప రాష్ట్ర ప్రయోజనాలు హరీష్ రావు మాటల్లో లేవన్నారు.
ఇప్పటికే బనకచర్ల సహా తెలంగాణకు సంబంధించిన అన్ని అంశాలు..హక్కులపై రేవంత్ రెడ్డి సీఎం హోదాలో మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కు సవాల్ విసిరారని..అసెంబ్లీ వచ్చి చర్చల్లో పాల్గొనండి లేదా మేమే ఫామ్ హౌస్ కు వచ్చి అక్కడ మాక్ అసెంబ్లీ పెడుతామన్నారని.. మీరు పాల్గొనండి అని సవాల్ చేస్తే అక్కడ నుంచి నోరు లేవలేదన్నారు. మళ్ళీ సిగ్గులేకుండా సవాళ్ల గురించి మాట్లాడుతున్నారని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. గోదావరిలో 3000టీఎంసీల నీటి వరద ఉందని..ఆంధ్ర ప్రాజెక్టులు కట్టుకున్నా మనకు సమస్య లేదని..రాయలసీమను రతనాల సీమ చేస్తానని కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు. బేసీన్లు లేవు, భేషజాలు లేవు అని కేసీఆర్ అంటేనే కదా ఈ రోజు వాళ్ళు బనకచర్ల, రాయలసీమ ఎత్తిపోతల పథకాలు కడుతున్నదన్నారు. తెలంగాణ కు అడ్డగోలుగా ద్రోహం చేసినా మీరే మళ్ళీ సిగ్గులేకుండా కాంగ్రెస్ మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మీకు దమ్ముంటే అసెంబ్లీ లో పెట్టె చర్చలకు నువ్వు, మీ మామ కేసీఆర్ లు వచ్చి మీ వాదన చెప్పండి.. అప్పుడు ఎవరు ఏంటో తెలుస్తుందన్నారు. ప్రెస్ మీట్ లు పెట్టి కోడిగుడ్డు మీద ఈకలు పీకుదామని చూస్తే జనం నమ్మబోరన్నారు.