విధాత, హైదారాబాద్ : దేశంలోనే తొలి రాష్ట్రంగా ఏపీ ప్రభుత్వం రాష్ట్ర సమాచార కమిషన్ (AP Information Commission) విచారణలను ప్రత్యక్ష ప్రసారం(RTI Hearings Live) చేసిన రికార్డు(Record)ను సాధించింది. మంగళవారం ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ రాష్ట్ర సమాచార కమిషన్ విచారణలను( RTI Hearings) ప్రారంభించారు. సమాచార కమిషన్‌లోని అన్ని కోర్టు హాళ్లలో జరిగే కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలని గవర్నర్ ఆదేశించారు. ప్రసారాల కోసం వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తేవడానికి సీఎం చంద్రబాబు రూ.1.84 కోట్లు మంజూరు చేశారని గవర్నర్ వెల్లడించారు. ప్రత్యక్ష ప్రసారాల ద్వారా సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) మరింత పారదర్శకంగా మారతుందని గవర్నర్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రక్రియతో ఫిర్యాదుదారులకు, అప్పీల్ దారులకు మేలు జరుగుతుందన్నారు.
ప్రధాన సమాచార కమిషనర్ బాష మాట్లాడుతూ రెండున్నరేళ్ల నుంచి రాష్ట్ర కమిషన్ ఆన్‌లైన్ విధానంలో విచారణ ప్రక్రియను కొనసాగిస్తోందని తెలిపారు. సమాచార కమిషన్ల విచారణలో పారదర్శకత పెంచేందుకు ప్రత్యక్ష ప్రసారాలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ఏపీ రాష్ట్ర కమిషన్ ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారాన్ని ఏర్పాటు చేసిందని నివేదించారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులతో జాతీయ సమాచార కేంద్రం (ఎన్‌ఐసీ) ద్వారా ప్రత్యక్ష ప్రసారాల ప్రాజెక్టుతో పాటు రాష్ట్ర సమాచార కమిషన్ వెబ్ పోర్టల్ అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.