అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తున్నాం.

• మార్చిలో అసెంబ్లీ పెట్టమంటే కరోనా ఉందని చెప్పిన ముఖ్యమంత్రి, ఇప్పుడేమో తూతూమంత్రంగా ఒక్కరోజు సమావేశానికి పరిమితమయ్యాడు.• 900 కేసులున్నప్పుడు అసెంబ్లీ పెడితే, శాసనసభ్యులప్రాణాలకు ప్రమాదమని చెప్పిన వ్యక్తి, 2లక్షల16వేలకేసులున్నప్పుడు సమావేశాలు ఎలా పెడుతున్నాడు?• రాజ్యాంగ నిబంధనలప్రకారం 6నెలలకు ఒకసారి అసెంబ్లీ పెట్టాలికాబట్టి, లేకపోతే ప్రభుత్వం కూలిపోతుందన్న భయంతోనే ముఖ్యమంత్రి ఒకరోజు అసెంబ్లీకి సిద్ధమయ్యాడు.• ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సమావేశాలు 150 రోజలు నిర్వహించాలని చెప్పిన జగన్, ఇప్పుడు ఒక్కరోజుకే పరిమితమవ్వడమేంటి?• కరోనా కట్టడిదృష్ట్యా, ప్రజల ప్రాణాలు […]

  • Publish Date - May 19, 2021 / 12:57 AM IST

• మార్చిలో అసెంబ్లీ పెట్టమంటే కరోనా ఉందని చెప్పిన ముఖ్యమంత్రి, ఇప్పుడేమో తూతూమంత్రంగా ఒక్కరోజు సమావేశానికి పరిమితమయ్యాడు.
• 900 కేసులున్నప్పుడు అసెంబ్లీ పెడితే, శాసనసభ్యులప్రాణాలకు ప్రమాదమని చెప్పిన వ్యక్తి, 2లక్షల16వేలకేసులున్నప్పుడు సమావేశాలు ఎలా పెడుతున్నాడు?
• రాజ్యాంగ నిబంధనలప్రకారం 6నెలలకు ఒకసారి అసెంబ్లీ పెట్టాలికాబట్టి, లేకపోతే ప్రభుత్వం కూలిపోతుందన్న భయంతోనే ముఖ్యమంత్రి ఒకరోజు అసెంబ్లీకి సిద్ధమయ్యాడు.
• ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సమావేశాలు 150 రోజలు నిర్వహించాలని చెప్పిన జగన్, ఇప్పుడు ఒక్కరోజుకే పరిమితమవ్వడమేంటి?
• కరోనా కట్టడిదృష్ట్యా, ప్రజల ప్రాణాలు కాపాడటానికి బాధ్యతగల ముఖ్యమంత్రి హోదాలో ఒక్కసారి కూడా అఖిలపక్ష సమావేశం నిర్వహించలేకపోయాడు.
• తూతూమంత్రంగా, మొక్కుబడిగా అసెంబ్లీ నిర్వహించడం ఎంతవరకు ధర్మమో, న్యాయమో ముఖ్యమంత్రి సమాధానంచెప్పాలి.
• ప్రజలప్రాణాలు కాపాడటం చేతగాని ముఖ్యమంత్రి అలసత్వాన్ని, నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ, టీడీపీ ఒక్కరోజు అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తోంది.

విధాత:ఎల్లుండి శాసనసభ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు అసెంబ్లీ కార్యదర్శిద్వారా తమకు సమాచారం అందించారని, జగన్మోహన్ రెడ్డి వింతమనిషని, ఆయన చేష్టలు ఎప్పుడూ వింతగానే ఉంటాయని, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవ్యక్తి, ఎంతోబాధ్యతతో వ్యవహరించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీమంత్రి వర్యులు అచ్చెన్నాయుడు తెలిపారు. మంగళవారం ఆయన జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు.

ఈ ప్రభుత్వం ఏర్పడి నెలాఖరుకి దాదాపు రెండేళ్లు అవుతుందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీనేతలు, చంద్రబాబునాయుడు అసెంబ్లీ అంటేనే దడుచుకుంటున్నారని, సంవత్సరానికి 150రోజులు సమావేశాలు పెట్టాలని, అప్పుడే ప్రజల సమస్యలు పరిష్కరింపబడతాయని జగన్మోహన్ రెడ్డి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం జరిగిందన్నారు. అలా చెప్పిన వ్యక్తి ఈ రెండేళ్లలో ఎన్నిరోజులు శాసనసభ నిర్వహించారన్నారో సమాదానం చెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కుప్రకారం ప్రతిసంవత్సరం బడ్జెట్ సమావేశాలు సకాలంలో విడివిడిగా నిర్వహించాలని, అలా జరిపి బడ్జెట్ ను ఆమోదింపచేసుకోవాల్సిన గురుతర బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుందని మాజీమంత్రి తెలిపారు. అనుకోని సంఘటనలు ఏవైనా జరిగి, అసెంబ్లీ జరగడానికి పూర్తిగా వీల్లేని పరిస్థితుల్లోనే ఆర్డినెన్స్ పెట్టి, బడ్జెట్ ను ఆమోదింపచేసుకోవడమనేది గతంలో చూశామన్నారు. ఈ ప్రభుత్వానికి మాత్రం అదేపని ఒకఅలవాటుగా మారిందన్నారు. తొలిఏడాది బడ్జెట్ సమావేశాలు నిర్వహించలేదని, రెండోసంవత్సరం ఆర్డినెన్స్ తోనే బడ్జెట్ నుఆమోదింపచేసుకున్నారని, మరలా మొన్నటికి మొన్నకూడా బడ్జెట్ ను అదేవిధంగా పాస్ చేశారన్నారు. సాధారణంగా మార్చిలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని, కేంద్రప్రభుత్వం కూడా పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి, బడ్జెట్ ను ఆమోదింపచేసుకుందన్నారు. కేంద్రంతోపాటుగా దేశంలోని అనేకరాష్ట్రాలు మార్చిలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి, బడ్జెట్ ను పాస్ చేసుకున్నాయన్నారు.

మార్చిలోనే బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రతిపక్షసభ్యులుగా తాము చెబితే, జగన్మోహన్ రెడ్డి వింతవింత సమాధానాలు చెప్పాడన్నారు. కరోనా ఉందని, ఈసమయంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించలేమని, అసెంబ్లీ నిర్వహిస్తే శాసనసభ్యులు కరోనా బారినపడతారన్న వ్యక్తి, ఎల్లుండి నిర్వహిస్తున్న సమావేశాలకు ఎలా పిలుస్తున్నాడో సమాధానంచెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 900 కరోనాకేసులున్నప్పుడు అసెంబ్లీ పెట్టమని అడిగితే కుదరదని చెప్పినవ్యక్తి, 2లక్షల16వేల పాజిటివ్ కేసులున్నప్పుడు అసెంబ్లీ సమావేశం ఒక్కరోజుతో సరిపెట్టి, తూతూమంత్రంగా చేయడమనేది ఎంతమాత్రం మంచిపద్ధతి కాదని అచ్చెన్నాయుడు తేల్చిచెప్పారు. కేంద్రప్రభుత్వం నుంచి గ్రామపంచాయతీ వరకు అందరూ కరోనాపై దృష్టిపెట్టి, దాన్ని తగ్గించడానికి, ప్రజల ప్రాణాలు కాపాడటానికి కృషిచేస్తుంటే, ఈముఖ్యమంత్రికి అసలు కరోనాపై దృష్టే లేకుండా పోయిందన్నారు. కరోనాని అరికట్టడంలో, ముఖ్యమంత్రి కనీసస్థాయిలోకూడా వ్యవహరించడంలేదన్నారు.

కరోనా కట్టడి చేయాలన్న ఆలోచన ముఖ్యమంత్రికి ఉంటే, బాధ్యత ఉంటే, ఆయన ఒక్కరోజు కూడా అఖిలపక్ష సమావేశం ఎందుకు నిర్వహించలేదని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. కనీసం నిష్ణాతులైన వైద్యులతో ముఖ్యమంత్రి ఒక్కరోజైనా సమావేశం జరిపి, కరోనాకట్టడికి వారిసలహాలు, సూచనలను ఎందుకు స్వీకరించలేదని టీడీపీనేత నిలదీశారు. ఈ ముఖ్యమంత్రి కనీసం పొరుగురాష్ట్రాలను కూడా చూసినేర్చుకోవడంలేదన్నారు. పొరుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు, అక్కడున్న ప్రతిపక్షాలతో సంప్రదింపులు జరుపుతూ, కరోనాకట్టడిలో ముందుకు పోతుంటే, ఈ ముఖ్యమంత్రి ఒక్కరోజుకూడా ఆదిశగా ఆలోచన చేయకుండా కరోనాను గాలికి వదిలేశాడన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా గాలికొదిలేశాడని, ముఖ్యమంత్రి అసమర్థత , చేతగానితనంవల్ల రాష్ట్రంలో ఎంతోమంది వ్యాక్సిన్ అందక ప్రాణాలు కోల్పోయారని అచ్చెన్నాయుడు ఆవేదనవ్యక్తంచేశారు. బాధ్యత గలప్రభుత్వం, ముఖ్యమంత్రి నిజంగా రాష్ట్రంలో ఉంటే, సకాలంలో ఆక్సిజన్ అందక 106మంది ఎందుకు చనిపోతారన్నారు? గతంలో గోదావరి పుష్కరాల్లో కొందరు భక్తులు ప్రమాదవశాత్తూ చనిపోతే, అందుకు కారణం ముఖ్యమంత్రిగా ఉన్నచంద్రబాబే నని ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి, ఆయనపార్టీనేతలు ఐదేళ్లపాటు మాటలంటూనేఉన్నారని, మరిప్పుడు ముఖ్యమంత్రి నిర్లక్ష్యంవల్ల ,చేతగానితనం కారణంగా 106మంది ఆక్సిజన్ అందక చనిపోతే, ఈ జగన్మోహన్ రెడ్డి ఏంచేశాడన్నారు? జరిగిన మరణాలపై ఒక్కఅధికారిపై కూడా చర్యలు లేవని, ఒక్క విచారణ జరిగిన దాఖాలాలు కూడా లేవన్నారు.

ప్రజలంతా ఆక్సిజన్, పడకలు అందించి తమప్రాణాలు కాపాడాలనిఆర్తనాదాలు చేస్తుంటే, ఈ ముఖ్యమంత్రి అవేవీ ఇవ్వకపోగా, చనిపోయాక దహనానికి రూ.15వేలుఇస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రప్రభుత్వం అన్నిఏర్పాట్లుచేసి, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించి, విధిలేక చనిపోయినవారికి చివరిప్రయత్నంగా దహనానికి డబ్బులివ్వడమనేది జరుగుతుందన్నారు. కానీ ఈ ముఖ్యమంత్రి అన్నీ వదిలేసి, దహనానికి డబ్బులిస్తానని చెప్పడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనంకాదా అని అచ్చెన్నాయుడు నిలదీశారు.

బాధ్యతగల ప్రభుత్వం కరోనా బాధితులను ఆదుకోవాలని, కేరళ ప్రభుత్వం నిత్యావసరసరుకులను, ఒక్కోకుటుంబానికి రూ.6వేలసాయాన్ని అందించిందన్నారు. నిన్నటికి నిన్న తమిళనాడు ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.4వేలిస్తామని ప్రకటించి, రూ.2వేలు తక్షణమే అందచేసిందన్నారు. ఈ ముఖ్యమంత్రికి ఆ ప్రకటనలు చూశాకైనా జ్ఞానంకలగలేదని, అలాంటి ఆలోచనలు చేయకపోవడం బాధాకరమన్నారు. రాజ్యాంగ నియమాలను దృష్టిలోపెట్టుకొని, 6నెలలకు ఒకసారి సమావేశాలు పెట్టకపోతే ప్రభుత్వంకూలిపోతుందని గ్రహించి, ఏదో తూతూమంత్రంగా అసెంబ్లీ పెడుతున్నారుతప్ప, ప్రజల కోసం కాదని అచ్చెన్న స్పష్టంచేశారు. ప్రభుత్వానికి ఇదేమి న్యాయమో, ఇదేమి ధర్మమో సమాధానంచెప్పాలని అచ్చెన్న డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి నిజంగా బాధ్యత ఉంటే, ఈ విధంగా మొక్కుబడిగా ఒక్కరోజు సమావేశం నిర్వహించేవారు కాదని మాజీమంత్రి తేల్చిచెప్పారు.

మార్చిలో కావాలనే ప్రభుత్వం అసెంబ్లీ నిర్వహించలేదని, ఇప్పుడు 2లక్షల పైచిలుకు కేసులుంటే, సమావేశంపెట్టి, కావాలనే ముఖ్యమంత్రి నటిస్తున్నాడని తేలిపోయిందన్నారు. అందుకే బాధ్యతగలప్రతిపక్షంగా, ముఖ్యమంత్రి నిర్ణయాన్ని నిరసిస్తూ, ఒక్కరోజు శాసనసభ సమావేశాన్ని బాయ్ కాట్ చేస్తున్నామని అచ్చెన్నాయుడు ప్రకటించారు. కరోనా ఇంత ఉధృతంగా ఉన్న సమయంలో బాధ్యతగలప్రభుత్వంగా, జగన్ ప్రభుత్వం వ్యవహరించలేదన్నారు. ఒక్కరోజు కూడా అఖిలపక్షసమావేశం నిర్వహించి అన్నిపార్టీల అభిప్రాయాలు, సూచనలు తీసుకోలేదన్నారు. ప్రభుత్వ తీరుని, నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ తాము అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేవలం తనస్వార్థంకోసమే అసెంబ్లీ పెడుతున్నాడు తప్ప, ప్రజల సమస్యల పరిష్కారానికి కాదన్నారు.

ప్రధానమంత్రి వైద్యులు, వివిధరంగాల నిపుణులతో పలుమార్లు సమావేశమైతే, ఈముఖ్యమంత్రి ఆదిశగా ఆలోచించకపోవడం బాధాకరమన్నారు. ప్రతిపక్షంగా తాము బాధ్యతలనుంచి పారిపోవడంలేదని, తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడానికే మాక్ అసెంబ్లీ నిర్వహణకు సిద్ధమయ్యామని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా అచ్చెన్నాయుడు స్పష్టంచేశారు. తాము అసెంబ్లీకి వెళ్లి నిరసనతెలిపినాకూడా ప్రజలకు తెలియడంలేదని, లోపలేం జరుగుతుందో బయటిప్రపంచానికి తెలియకుండా ప్రభుత్వం వ్యవహరిస్తుంది కాబట్టే, ప్రజాసమస్యలే ఎజెండాగా తాము మాకు అసెంబ్లీ నిర్వహణకు సిద్ధమవుతున్నామని అచ్చెన్నాయుడు తేల్చిచెప్పారు.