న్యూఢిల్లీ : న్యూస్‌క్లిక్ ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్థ, మరికొందరు జర్నలిస్టులపై కేంద్ర ప్రభుత్వ చర్యల పట్ల తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రవాదం అభియోగాలపై పుర్కాయస్థ, న్యూస్‌క్లిక్ పోర్టల్ హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్ చీఫ్ అమిత్ చక్రవర్తిని మంగళవారం తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మరికొందరు పాత్రికేయుల నివాసాల్లోనూ సోదాలు జరిపి, వారి ల్యాప్‌టాప్‌లు, ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది స్వతంత్ర పాత్రికేయ వ్యవస్థలపై మోదీ ప్రభుత్వ దాడి అని ప్రజాస్వామిక వాదులు మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్రం టార్గెట్ చేసినవారిలో అప్పుడప్పుడు పోర్టల్‌కు వ్యాసాలు రాసేవారు కూడా ఉన్నారు. వీరి ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకునేముందు కనీస నోటీసులు కూడా ఇవ్వకపోవడాన్ని పాత్రికేయలోకం తీవ్రంగా ఖండించింది. దాదాపు 46 మంది జర్నలిస్టులను పోలీసులు ప్రశ్నించారు. ఈ చర్య కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ పోకడలను చాటుతున్నదని ప్రజాస్వామికశక్తులు మండిపడుతున్నాయి.
పాత్రికేయులకు అత్యంత ప్రమాదకర దేశం
న్యూస్‌క్లిక్ పాత్రికేయులు, కాంట్రిబ్యూటర్లపై సోదాలు, అరెస్టులను భారత మీడియా హక్కుల సంస్థ తీవ్రంగా ఖండించింఇ. పాత్రికేయులకు అత్యంత ప్రమాదకరంగా భారతదేశం తయారైందని ఆందోళన వ్యక్తం చేసింది. ఉపా లోని కిరాతక సెక్షన్లయిన 13, 16, 17, 17, 22సీ, ఐపీసీ 120లోని 153 (విద్వేష ప్రసంగం), (బీ) (కుట్ర) సెక్షన్ల కింద ఈ కేసును విచారిస్తుండటం దిగ్భ్రాంతికరమని పేర్కొన్నది. పుర్కాయస్థ, ఇతరులపై కేసులో కోర్టు పరిధిలో ఉన్న సమయంలో కోర్టులను, ప్రజాభిప్రాయాన్ని దారిమళ్లించేందుకే ఈ అరెస్టులు జరిగాయని విమర్శించింది. పాత్రికేయులను గంటల కొద్దీ విచారించడం వారిని హింసిండానికే అని స్పష్టంగా అర్థమవుతున్నదని పేర్కొన్నది. ఢిల్లీ పోలీసుల చర్యను ఖండించాలని అన్నివర్గాల ప్రజలకు పిలుపునిచ్చింది. ప్రస్తుత పరిస్థితులు ఎమర్జెన్సీ రోజులను గుర్తుకు తెస్తున్నాయని విమర్శించింది.
చీకట్లలో పత్రికా స్వేచ్ఛ
పత్రికాస్వేచ్ఛలో భారతదేశం మునుపెన్నడూ లేనంత చీకట్లలో ఉన్నది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ ఇండెక్స్‌లో మొత్తం 180 దేశాలకు గాను భారత్ 161వ స్థానంలో ఉండటం గమనార్హం. నిజానికి ర్యాంకు 2015 నుంచి.. అంటే మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి క్రమంగా దిగజారుతూ వస్తున్నదని గణాంకాలు పేర్కొంటున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా ఇంటర్నెట్ బంద్ అయ్యే దేశాలను గమనిస్తే భారత్ అందుకు రాజధానిగా విలసిల్లుతున్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏ ప్రజాస్వామ్య దేశంలో లేనంత సంఖ్యలో అనేక సార్లు దేశంలో ఇంటర్నెట్‌ను నిలిపివేసిన సందర్భాలు ఉన్నాయి. దేశంలో ప్రజాస్వామ్యం నానాటికీ దిగజారుతున్నదని, అందులోనూ కీలక వ్యవస్థ అయిన పత్రికారంగం కృశించి పోతున్నదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా భారతదేశం ప్రజాస్వామిక వ్యవస్థకు తల్లిలాంటిదని మోదీ చెప్పుకొంటున్నారని మండి పడుతున్నారు.
దాదాపు దశాబ్ద కాలంలో ఒక్కటంటే ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన మోదీ.. డిజిటల్, స్వతంత్ర మీడియా గొంతు నులిమే ప్రయత్నం చేస్తున్నారని బుద్ధిజీవులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు విద్వేష ప్రసంగాలను, ప్రసారాలను తీవ్రంగా ఆక్షేపిస్తున్నా కొన్ని టీవీ చానళ్లు దర్జాగా విద్వేషాలు రెచ్చగొడుతుతూ హింసను ప్రేరేపిస్తున్నాయి. వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోవాడానికి సిద్ధపడని కేంద్రం.. స్వతంత్ర మీడియాపై దమనకాండకు దిగడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నారు. ఒక మీడియా సంస్థపై దాడి చేసి, ఎలాంటి న్యాయపరమైన నిబంధనలు పాటించకుండా అక్కడి పాత్రికేయుల ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకోవడం పత్రికా స్వేచ్ఛకు అపశకునమని పరిశీలకులు అంటున్నారు. ఇప్పుడు పత్రికా స్వేచ్ఛ ప్రమాదంలో పడిందని, తదుపరి ఇతర వ్యవస్థలపైనా ఉంటుందని ప్రతి భారతీయుడూ గుర్తించాలని సూచిస్తున్నారు. ఈ ప్రమాద ఘంటికలు వినపడనివారు చెవిటివాళ్లయినా అయి ఉండాలి లేదా వినడానికి ఉద్దేశపూర్వకంగానే నిరాకరిస్తున్నట్టయినా అయి ఉండాలని అంటున్నారు.
పత్రికా స్వేచ్ఛపై పెరుగుతున్న ఆంక్షలు
భారత్‌లో పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు క్రమంగా పెరుగుతున్నాయని హ్యూమన్ రైట్స్ వాచ్ (హెచ్‌ఆర్‌డబ్ల్యూ) గతంలో స్పష్టం చేసింది. పాత్రికేయులను ఉగ్రవాదం, రాజద్రోహం నేరాలపై అరెస్టు చేస్తున్న సందర్భాలను అది ఉటంకించింది. ప్రభుత్వాన్ని విమర్శించేవారిని, స్వతంత్ర వార్తా సంస్థలను తరచూ టార్గెట్ చేస్తున్నారని పేర్కొన్నది. పెగాసస్ వివాదం వచ్చినప్పుడు దాదాపు 40 మంది జర్నలిస్టులు కేంద్ర ప్రభుత్వ నిఘానీడలో ఉన్నారని తేలింది. రైట్స్ అండ్ రిస్క్స్ అనాలసిస్ గ్రూప్ (ఆర్‌ఆర్‌ఏజీ) 2021లో రూపొందించిన ఇండియా ప్రెస్ ఫ్రీడం నివేదికలో ఆ ఏడాది దేశవ్యాప్తంగా ఆరుగురు పాత్రికేయులు హత్యకు గురయ్యారని, 108 మందిపై దాడులు జరిగాయని, 13 మీడియా సంస్థలను టార్గెట్ చేశారని తెలిపింది.
రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ (ఆర్‌ఎస్‌ఎఫ్) అనే మీడియా అనుకూల సంస్థ నివేదిక ప్రకారం.. 2019లో మొత్తం 180 దేశాలకు గాను.. 105వ ర్యాంకులో ఉన్న భారత్.. 2019 నాటికి 140వ స్థానానికి పడిపోయింది. 2021 నాటికి 142వ స్థానానికి, 2022లో 150వ స్థానానికి దిగజారిపోయింది.భారతదేశంలో అనేక మంది జర్నలిస్టులు బెదిరింపులను ఎదుర్కొంటున్నారని, విమర్శనాత్మక కథనాలపై అధికారులు వారిని టార్గెట్ చేస్తున్నారని వాషింగ్‌టన్ పోస్ట్ కాలమిస్ట్ రాణా అయ్యూబ్ ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. ప్రభుత్వం వెలుపల ఉన్న హిందూత్వ వాదులు సైతం వారిని వేధిస్తున్నారని పేర్కొన్నారు.
దేశంలో ఎల్లో జర్నలిజం అనే దాన్ని పక్కనపెడితే.. కాషాయ జర్నలిజం పెరిగిపోతున్నదని పలువురు పరిశీలకులు ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు. ఒకప్పుడు నిర్భయంగా వార్తలు అందించిన పలు న్యూస్ చానళ్లను ప్రధానికి సన్నిహితుడని పేరున్న అదానీ వంటి శక్తులు హస్తగతం చేసుకున్న విషయాలను వారు ప్రస్తావిస్తున్నారు. ఒకప్పుడు ఎల్లో జర్నలిజం అమెరికాలో ఉండేది. ఇప్పుడు భారత్‌లో అది కాషాయ రంగు పులుముకున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అమెరికాలో ఎల్లో జర్నలిజం మరింత మంది పాఠకులను ఆకర్షించే క్రమంలో వివిధ పత్రికల మధ్య పోటీకి దారి తీస్తే.. భారతదేశంలో మాత్రం ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందేందుకు, ప్రభుత్వంతో అంటకాగేందుకు పోటీ పడే ప్రయత్నాల్లో కాషాయ జర్నలిజం తయారైందని అంటున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారిని ప్రభుత్వం తరఫున వకాల్తా పుచ్చుకున్నట్టు నిలదీయడం ఈ కాషాయ జర్నలిజానికి పనిగా తయారైందన్న విమర్శలు ఉన్నాయి.
పత్రికా స్వేచ్ఛతోనే ప్రజాస్వామ్యం
ఒక క్రియాశీల, ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని క్లిష్టమైన ప్రశ్నలు అడిగే పాత్రికేయ రంగాన్ని ఒక వ్యవస్థగా ఎదిగేందుకు తప్పనిసరిగా ప్రోత్సహించాలి. మీడియాలో జరిగే చర్చలు, వాదాలే కార్యాచరణకు తొలిమెట్టు. నిర్భయ వంటి ఉదంతాల్లో మీడియా కవరేజీతోనే పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. అంతిమంగా నేర చట్టాల్లో మార్పులకు దారితీశాయి. మార్చి నెలలో రాంనాథ్ గోయెంకా పురస్కారాల సభలో చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ వ్యాఖ్యలు
జర్నలిస్టులపై దాడులను ఉద్యమాలతో ఎదుర్కొంటాం: ఐజేయూ, టీయూడబ్ల్యూజే పిలుపు
పథకం ప్రకారం మీడియా సంస్థలపై, జర్నలిస్టులపై దాడులకు, అక్రమ కేసులకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఉద్యమాలతోనే తగిన రీతిలో బుద్ధి చెబుతామని ఐజేయూ, టీయూడబ్ల్యూజే సంఘాలు హెచ్చరించాయి. ఢిల్లీలో న్యూస్ క్లిక్ పోర్టల్ కార్యాలయంపై, జర్నలిస్టులపై పోలీసులు జరిపిన సోదాలను ఖండిస్తూ తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే), హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్‌యూజే) ఆధ్వర్యంలో బుధవారం బషీర్ బాగ్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఐజేయూ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ స్వతంత్రంగా పనిచేసే జర్నలిస్టుల మీద, మీడియా సంస్థల మీద కేంద్ర ప్రభుత్వం ఒక పథకం ప్రకారం దాడులు చేస్తూ మీడియా గొంతు నొక్క డానికి ప్రయత్నిస్తున్నదని విమర్శించారు.
ఇందులో భాగంగానే న్యూస్ క్లిక్ పోర్టల్ లో పని చేస్తున్న 46 మంది జర్నలిస్టులను ప్రశ్నించి, కొందరిని అరెస్టు చేయడం దేశంలోని జర్నలిస్టులకు విస్మయం కలిగించిందన్నారు. ఈ దాడులకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టేందుకు ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా, ఐజేయూ, ఇతర సంఘాలు కార్యచరణ రూపొందిస్తున్నాయని తెలిపారు. సీనియర్ సంపాదకుడు కే రామచంద్ర మూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలను, అధికార పార్టీ భావజాలాన్ని విమర్శిస్తూ రాసే వారిని లక్ష్యంగా పెట్టుకొని ఈ దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. వీటిని సమైక్యంగా ప్రతిఘటించాలని జర్నలిస్టు సంఘాలకు, మేధావులకు ప్రజాస్వామ్యవాదులకు ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ అధ్యక్షుడు కే శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ సంపాదకుడు కే రామచంద్రమూర్తి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే విరాహత్ అలీ, ఐజేయూ కార్యదర్శి వై నరేందర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు ఆలపాటి సురేశ్ కుమార్, కల్లూరి సత్యనారాయణ, హెచ్‌యూజే అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ శంకర్ గౌడ్, షౌకత్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు ఏ రాజేశ్, బీ కిరణ్ కుమార్, కల్కురి రాములు, జనం సాక్షి సంపాదకుడు రహ్మాన్ తదితరులు పాల్గొన్నారు.
నేడు భారీ ర్యాలీ
న్యూస్ క్లిక్ జర్నలిస్టులపై దాడులను గర్హిస్తూ గురువారం ఉదయం 11గంటలకు, బషీర్‌బాగ్‌లోని ఎల్బీ స్టేడియం ప్రక్కన ఉన్న తమ కార్యాలయం నుంచి ట్యాంక్ బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించినట్లు ఐజేయూ, టీయూడబ్ల్యూజే నాయకులు కే శ్రీనివాస్ రెడ్డి, ఎన్ శేఖర్, కే విరాహత్ అలీ తెలిపారు. ఐజేయూ, టీయూడబ్ల్యూజే, హెచ్‌యూజే, హైదరాబాద్ ప్రెస్ క్లబ్, నెట్‌వర్క్ ఆఫ్ ఉమెన్ ఇన్ మీడియా, ఇండియా (ఎన్‌డబ్ల్యూఎంఐ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ర్యాలీలో సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిలతో పాటు పలువురు ఎడిటర్లు, ఆయా న్యూస్ చానళ్ల ప్రముఖులు, న్యాయవాదులు, విద్యావేత్తలు, పౌర సంఘాల కార్యకర్తలు, జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీకి హాజరుకానున్నారు.