సీఎం జ‌గ‌న్ హామీల‌న్నీ మ‌ద్యం షాపులోనే క‌నిపిస్తున్నాయి

స‌త్య‌వేడు ఎమ్మెల్యే ఎన్నిక‌ల్లో డ‌బ్బులు బాగా పంచుతార‌ట‌, ఎంత ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు మాత్రం ఎవ‌రికి వేయాలో ఆలోచించండ‌న్నారు ఏపీసీసీ ఛీఫ్ వైఎస్ ష‌ర్మిల

  • Publish Date - April 14, 2024 / 07:48 PM IST

స‌త్య‌వేడులో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు

డ‌బ్బులు ఎంత పంచినా తీసుకోండి

స‌త్య‌వేడు భారీ భ‌హిరంగ స‌భ‌లో ఏపీసీసీ ఛీఫ్ వైఎస్ ష‌ర్మిల‌

విధాత‌: స‌త్య‌వేడు ఎమ్మెల్యే ఎన్నిక‌ల్లో డ‌బ్బులు బాగా పంచుతార‌ట‌, ఎంత ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు మాత్రం ఎవ‌రికి వేయాలో ఆలోచించండ‌న్నారు ఏపీసీసీ ఛీఫ్ వైఎస్ ష‌ర్మిల. ఆదివారం చిత్తూరు జిల్లా, సత్యవేడులో ఏపీ కాంగ్రెస్‌ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ కార్య‌క్ర‌మంలో ష‌ర్మిల మాట్లాడుతూ.. ఇక్క‌డ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు ఉన్నార‌ట‌, తండ్రి అసలు అయితే కొడుకు షాడో ఎమ్మెల్యేగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ట అని విమ‌ర్శించారు. షాడో ఎమ్మెల్యే ప్ర‌తి ప‌నిలో రేట్ ఫిక్స్ చేస్తున్నార‌ట అని ఆరోప‌ణ చేశారు. ఇక్క‌డ అభివృద్ధి వైఎస్సార్ హ‌యాంలోనే జ‌రిగింది. అప్ప‌ట్లో శ్రీ సిటీ ఏర్పాటు చేసి 300 ప‌రిశ్ర‌మ‌లు తీసుకొచ్చార‌ని, ల‌క్ష‌మందికి ఉపాది క‌ల్పించార‌ని తెలిపారు. గాలేరు – నగరి ద్వారా ఇక్కడ ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వాలని వైఎస్సార్‌ అనుకున్నారు, 10శాతం పనులు మాత్ర‌మే పెండింగ్ లో ఉంటే 5 ఏళ్లు బాబుకి,ఇప్పుడు జగన్ కి పూర్తి చేయడం చేతకాలేదని ఎద్దేవా చేశారు. టీడీపీ, వైసీపీ ప్ర‌త్యేక హోదా కోసం పోరాటం చేయ‌కుండా బీజేపీకి బానిస‌ల‌య్యార‌ని దుయ్య‌బ‌ట్టారు. మ‌ద్యం నిషేధం అని చెప్పి వైసీపీ స‌ర్కారే క‌ల్తీ మ‌ద్యం అమ్ముతుంద‌ని విమ‌ర్శించారు. బూమ్ బూమ్ బీర్లు, స్పెషల్ స్టేటస్ విస్కీ, డీఎస్సీ బ్రాండిని క‌ల్తీ మ‌ద్యాన్ని అమ్ముతున్నార‌న్నారు. సీఎం జ‌గ‌న్ హామీల‌న్నీ మ‌ద్యం షాపులోనే క‌నిపిస్తున్నాయ‌ని ష‌ర్మిల ఎద్దేవా చేశారు. రాష్ట్రం అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్య‌మ‌న్నారు. తాము అధికారంలోకి వ‌స్తే ప‌దేళ్లు ప్ర‌త్యేక హోదా క‌ల్పిస్తామ‌ని, ఇండ్లు లేని పేద‌ల‌కు ఐదు ల‌క్ష‌ల‌తో ఇండ్లు నిర్మిస్తామ‌న్నారు. ప్రతి పేద కుటుంబానికి మహిళా పేరు మీద ఏటా లక్ష రూపాయలు అందిస్తామ‌ని, ఖాళీగా ఉన్న 2.25లక్షల ఉద్యోగాలను తక్షణం భర్తీ చేస్తామ‌న్నారు. అలాగే వృద్దులకు, వితంతువులకు 4 వేల పెన్షన్, వికలాంగులకు 6 వేల పెన్షన్ ఇస్తామ‌ని, ఉపాది పథకం కింద రోజు 400 రూపాయలు ఇస్తామ‌న్నారు. సత్యవేడులో బాలగురవం బాబు, ఎంపీగా చింతా మోహన్‌ల‌ను గెలిపించాలని వైఎస్ ష‌ర్మిల కోరారు.

Latest News