Mahindra XUV 7XO Launch January 5: Triple Screen, Features, Price & XUV700 Comparison
విధాత ఆటో డెస్క్ | డిసెంబర్ 25, 2025
భారత ఎస్‌యూవీల విభాగంలో మరో కీలక అధ్యాయానికి తెరలేపేందుకు Mahindra & Mahindra సిద్ధమవుతోంది. తమ అత్యధిక విక్రయాలు సాధించిన XUV700ను పూర్తిగా నవీకరించి, XUV 7XO అనే కొత్త పేరుతో మార్కెట్లోకి తీసుకువస్తోంది. ఇది సాధారణ మార్పు కాదు; రూపకల్పన, అంతర్గత సౌకర్యాలు, అత్యాధునిక సాంకేతికతతో పూర్తి స్థాయి అప్‌గ్రేడ్‌గా చెప్పవచ్చు.
మహింద్రా ఎలక్ట్రిక్ ఫ్లాగ్షిప్ మోడల్స్ XEV 9e, XEV 9Sలలో కనిపించిన డిజైన్, టెక్నాలజీలను స్ఫూర్తిగా తీసుకుని రూపొందించిన XUV 7XOను 2026 జనవరి 5న ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా ఆవిష్కరించనున్నారు. డిసెంబర్ 15 నుంచి ముందస్తు బుకింగులు ప్రారంభమయ్యాయి. రూ.21,000 చిన్న మొత్తంతో ఆన్లైన్ లేదా డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకునే సదుపాయం కల్పించారు. జనవరి మధ్య నుంచి డెలివరీలు మొదలయ్యే అవకాశం ఉంది. అంచనా ధర రూ.15 లక్షల నుంచి రూ.26 లక్షల వరకు (ఎక్స్–షోరూమ్) ఉండొచ్చని సమాచారం.
బయటినుండి చూడ్డానికి: XUV700 కంటే అందంగా ఉంది
టీజర్లు, గూఢచిత్రాల ఆధారంగా చూస్తే XUV 7XO బాహ్య రూపం XUV700 కంటే స్పష్టంగా ఆకర్షణీయంగా మారింది. ముందు భాగంలో పెద్ద గ్రిల్, కొత్త షేపులో ఎల్ఈడీ హెడ్ల్యాంపులు, ప్రత్యేకమైన డీఆర్ఎల్ నమూనా, కఠినమైన బంపర్ డిజైన్ రోడ్డుపై ఈ బండికి మంచి లుక్కిస్తాయి 19 అంగుళాల డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్, వెనుక భాగంలో తేనెతుట్టె నమూనా()తో కొత్తగా రూపొందించిన టెయిల్ ల్యాంపులు కనిపిస్తాయి. కొత్త రంగులు కూడా అందుబాటులోకి రానున్నాయి.
లోపలి డిజైన్ – సౌలభ్యాలు: మూడు స్క్రీన్ల అద్భుతం
XUV 7XOలో ప్రధాన ఆకర్షణ అంతర్గత విభాగమే. ఇంధన వాహనాల్లో తొలిసారిగా మహీంద్రా మూడు డిజిటల్ తెరల అమరికను ప్రవేశపెడుతోంది. ఇది ఇప్పటివరకు ఎలక్ట్రిక్ వాహనాలైన XEV 9e, XEV 9Sలలో మాత్రమే ఉంది. డాష్‌బోర్డ్ అంతటా విస్తరించే మూడు 12.3 అంగుళాల తెరలు— డిజిటల్ డ్రైవర్ క్లస్టర్, సెంట్రల్ ఇన్ఫోటైన్మెంట్, ప్యాసింజర్ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ —వాహనాన్ని పూర్తిగా ఫ్యూచరిస్టిక్ స్టైల్లో నిలబెడతాయి.
అంతర్గత భాగంలో టూ–స్పోక్ స్టీరింగ్ వీల్, వెలిగే మహీంద్రా లోగో, బీజ్–నలుపు రంగుల కలయిక వాహనానికి విలాసవంతమైన అనుభవాన్ని ఇస్తాయి. ఫిజికల్ HVAC బటన్లను తగ్గించి, ఎక్కువగా టచ్ కంట్రోల్స్‌పై దృష్టి పెట్టారు.
అధికారికంగా నిర్ధారించిన సౌకర్యాలు:
- విద్యుత్ ఆధారిత ‘బాస్ మోడ్’ – వెనుక సీటు నుంచే ముందు ప్యాసింజర్ సీటును సర్దుబాటు చేసే సౌకర్యం
- 16 స్పీకర్ల హర్మన్ కార్డన్ సౌండ్ సిస్టమ్ – గత మోడల్లోని 12 స్పీకర్ల వ్యవస్థకన్నా మెరుగైనది
- Bring Your Own Device-(BYOD) టాబ్లెట్ డాక్ – 65 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌తో
- మల్టీ–కలర్ యాంబియంట్ లైటింగ్, రియర్ సన్ బ్లైండ్స్
- టూ–స్పోక్ స్టీరింగ్ వీల్ (ఇల్యూమినేటెడ్ లోగోతో)
ఇవేకాకుండా, పవర్ టెయిల్ గేట్, వెనక వెంటిలేటెడ్ సీట్లు, ఆధునిక డ్రైవర్ సహాయక వ్యవస్థ(ADAS), స్లైడింగ్ సెకండ్ రో వంటి సౌకర్యాలు కూడా వచ్చే అవకాశముందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
ఇంజిన్ విభాగం: ఏం మార్పు లేదు.. అదే సేమ్ ఇంజన్
ఇంజిన్ విషయంలో మహీంద్రా మార్పులు చేయలేదు. XUV700లో ఉన్న శక్తివంతమైన ఇంజన్లే కొనసాగుతాయి.
- 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్
- 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ (ఆల్ వీల్ డ్రైవ్ ఎంపికతో)
- మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు
- ఆరు, ఏడు సీట్ల అమరికలు
XUV700తో పోలిస్తే XUV 7XO ఎందుకు ప్రత్యేకం?
తక్కువ ధర, వెంటనే డెలివరీ కావాలంటే XUV700 ఇంకా కూడా మంచిదే. కానీ ఫ్యూచరిస్టిక్ డిజైన్, ట్రిపుల్ స్క్రీన్ ఇంటీరియర్, ప్రీమియం ఆడియో, రియర్ సీటు కంఫర్ట్ ఫీచర్లు కోరుకునేవారికి XUV 7XO తప్పనిసరిగా ముందుంటుంది. టాటా సఫారీ, హ్యుందాయ్ అల్కాజార్, MG హెక్టర్ ప్లస్‌లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.
XUV 7XO ఒక సాధారణ ఆధునీకరణ కాదు. ఇది డిజైన్, టెక్నాలజీ, సౌకర్యాల పరంగా మహీంద్రా ఫ్లాగ్షిప్ వాహనానికి కొత్త గుర్తింపును ఇచ్చే ప్రయత్నం. కుటుంబ ప్రయాణాలు, దూర ప్రయాణాలు, విలాసవంతమైన అనుభూతిని కోరుకునే వారికి ఖచ్చితంగా ఇది మంచి చాయిస్.
జనవరి 5 ఆవిష్కరణ తర్వాత వెలువడే ధరలు, వేరియంట్ల వివరాలతో మరింత స్పష్టత రానుంది.
