Freight Corridor | తెలంగాణ మీదుగా ‘ఇటార్సీ–విజయవాడ’ ప్రత్యేక గూడ్స్​ ట్రాక్​

తెలంగాణ మీదుగా ప్రతిపాదించిన ‘ఇటార్సీ–విజయవాడ’ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ప్రాజెక్టు కీలక దశకు చేరుకుంది. రైల్వే బోర్డుకు డీపీఆర్ సమర్పణతో, ఉత్తర–దక్షిణ రాష్ట్రాల మధ్య సరుకు రవాణా వేగవంతం కానుంది. పరిశ్రమలు, లాజిస్టిక్స్ హబ్‌లు, గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్‌కు ఇది కీలకమలుపుగా మారనుంది.

North–South DFC project overview showing Telangana as a logistics hub

Itarsi–Vijayawada Freight Corridor via Telangana | Key North–South Logistics Link

తెలంగాణ మీదుగా ఇటార్సీ–విజయవాడ ఫ్రైట్ కారిడార్

 తెలంగాణ మీదుగా ప్రతిపాదించిన ఇటార్సీ–విజయవాడ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ప్రాజెక్టు కీలక దశకు చేరుకుంది.   రైల్వే బోర్డుకు డీపీఆర్ సమర్పించడంతో, ఉత్తర–దక్షిణ భారతదేశం మధ్య సరుకు రవాణా మరింత వేగవంతం కానుంది.  గూడ్స్ రైళ్లకు ప్రత్యేక మార్గం లభించడం ద్వారా రవాణా ఖర్చులు తగ్గి, ప్రయాణికుల రైళ్ల వేగం పెరగనుంది. పరిశ్రమలు, లాజిస్టిక్స్ హబ్‌లు, గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్‌కు ఇది తెలంగాణకు ఒక పెద్ద అవకాశంగా మారనుంది.

ఉత్తరదక్షిణ భారతాల సరకు రవాణాకు నుసంధానంగా మారనున్న ప్రాజెక్టు

దేశవ్యాప్తంగా సరకు రవాణా వ్యవస్థకు కొత్త మలుపు తీసుకొచ్చే కీలక ప్రాజెక్టు ఒకటి ఇప్పుడు నిర్ణాయక దశకు చేరుకుంది. మధ్యప్రదేశ్‌లోని ఇటార్సీ నుంచి తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ వరకు ప్రతిపాదించిన డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (North–South DFC)కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను Dedicated Freight Corridor Corporation of India Limited రైల్వే బోర్డుకు సమర్పించింది. దాదాపు 922 కిలోమీటర్ల పొడవుతో రూపొందించిన ఈ కారిడార్ ప్రతిపాదన ప్రస్తుతం Railway Board పరిశీలనలో ఉంది.

ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుపై కీలక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయని రైల్వే వర్గాలు సూచిస్తున్నాయి. ఆమోదం లభిస్తే, ప్రయాణికుల రైళ్లు–గూడ్సు రైళ్లు ఒకే ట్రాక్‌పై నడుస్తున్న ప్రస్తుత వ్యవస్థకు ముగింపు పలకనుంది. గూడ్సు రైళ్లకు ప్రత్యేక మార్గం ఏర్పడటంతో సరుకు రవాణా వేగవంతం కావడంతో పాటు, ఖర్చులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రయాణికుల రైళ్లకు కూడా మరింత వేగం, సమయపాలన సాధ్యమవుతుంది.

తెలంగాణ లాజిస్టిక్స్ హబ్​గా మారే అవకాశాలు

ఇటార్సీ–విజయవాడ ఫ్రైట్ కారిడార్ తెలంగాణ మీదుగా వెళ్లనుండటం రాష్ట్రానికి వ్యూహాత్మక ప్రాధాన్యతను తీసుకురానుంది. సిర్పూర్ కాగజ్‌నగర్, మంచిర్యాల, రామగుండం, కాజీపేట, వరంగల్​, ఖమ్మం వంటి పారిశ్రామిక ప్రాంతాల మీదుగా ఈ రైల్వే నడవా వెళ్లే అవకాశం ఉండటంతో, రాష్ట్రం సరుకు రవాణా కేంద్రంగా మారే దిశగా అడుగులు వేయనుంది. బొగ్గు, ఎరువులు, సిమెంట్, స్టీల్ వంటి భారీ సామాగ్రిని తక్కువ సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలించే సౌలభ్యం లభించనుంది.

రోడ్లపై తిరిగే భారీ ట్రక్కుల సంఖ్య తగ్గడం వల్ల ట్రాఫిక్ ఒత్తిడి, కాలుష్యం రెండూ తగ్గుతాయి. రైల్వే ఆధారిత గ్రీన్ లాజిస్టిక్స్కు ఇది కీలక మార్గంగా మారనుంది. ప్రాజెక్టు కింద భారీ వ్యాగన్లను తట్టుకునేలా బలమైన ట్రాక్‌లు, అధిక సామర్థ్య విద్యుత్ వ్యవస్థలు, ఆధునిక సిగ్నలింగ్ ఏర్పాటు చేయనున్నారు. రైళ్ల కదలికలను రియల్ టైమ్‌లో పర్యవేక్షించే డిజిటల్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ను కూడా పరిశీలిస్తున్నారు. దీనికి ప్రత్యేకంగా ఒక కమాండ్​ కంట్రోల్​ సెంటర్​ కూడా ఉంటుంది.

రైల్వే బోర్డు ఆమోదం తర్వాత కేంద్ర క్యాబినెట్ నుంచి తుది అనుమతి, బడ్జెట్‌లో నిధుల కేటాయింపు, భూసేకరణ, పర్యావరణ అనుమతుల ప్రక్రియలు కొనసాగనున్నాయి. ఇదే సమయంలో, ఇప్పటికే ప్రకటించిన ఖరగ్‌పుర్–విజయవాడ ఈస్ట్‌కోస్ట్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌ను నిడుబ్రోలు వరకు పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయం, దేశంలో ఫ్రైట్ నెట్‌వర్క్ వేగంగా విస్తరిస్తోందనడానికి సూచనగా నిలుస్తోంది.

ఇటార్సీవిజయవాడ ఫ్రైట్ కారిడార్ కార్యరూపం దాలిస్తే, తెలంగాణ ఆర్థిక ముఖచిత్రంలో సరుకు రవాణా ఒక కీలక శక్తిగా మారడం ఖాయం.

Latest News