Uddhav, Raj reunion | నిన్నటి వరకు ఉప్పు నిప్పులా వ్యవహరించిన శివసేన బ్రదర్స్ చేతులు కలిపారు. విడిపోవడం మూలంగా బీజేపీ తమను కోలుకోని విధంగా దెబ్బతీసిందని భావించిన బ్రదర్స్ పాత పగలు మరిచి ఏకమయ్యారు. ఈ పరిణామం మరాఠా రాజకీయాల్లో పెను మార్పులకు దారి తీస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కొద్ది రోజుల్లో బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలు ఉండడంతో తమ సత్తా నిరూపించుకునేందుకు బ్రదర్స్ సిద్ధమయ్యారు. రెండు దశాబ్ధాల తరువాత ఉద్ధవ్ ఠాక్రె, రాజ్ ఠాక్రె గత విభేదాలను మరిచి రెండు దశాబ్దాల తరువాత ఒక్కటయ్యారు.
బాల్ ఠాక్రె స్థాపించిన శివసేన నుంచి రాజ్ ఠాక్రె విడిపోయి 2005 మార్చి నెలలో మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన పార్టీని ప్రారంభించారు. సోదరుడు ఉద్ధవ్ ఠాక్రె శివసేన (యూబీటీ) అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు ఎన్నికలలో సీట్ల సర్ధుబాటు, బాల్ ఠాక్రె చనిపోవడం, ఉద్దవ్ ఠాక్రె కుటుంబంతో పొసగకపోవడంతో ఇద్దరూ వేర్వేరు కుంపట్లు పెట్టుకున్నారు. ఎవరికి వారుగా ఎన్నికల్లో పోటీ చేయడం, కొన్నింట్లో విజయం సాధించడం, మెజారిటీ స్థానాలలో ఓడిపోవడం కూడా జరిగింది. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో శివసేన పార్టీ ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రె ముఖ్యమంత్రి అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా లతో వైరుధ్యం, బుల్లెట్ ట్రైన్ పై బేధాభిప్రాయాలు రావడంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నుంచి ఉద్ధవ్ దిగిపోక తప్పలేదు. ఆయన పార్టీకే చెందిన ఏక్ నాథ్ షిండే కొంత మంది శాసనసభ్యులను చీల్చి, బీజేపీ సభ్యులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రిగా, బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. వీరికి మద్ధతుగా ఎన్సీపీని చీల్చిన అజిత్ పవార్ కూడా ఉప ముఖ్యమంత్రి అయ్యారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మూడు పార్టీల కూటమి విజయం సాధించడంతో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రస్తుతం మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వమే కొనసాగుతున్నది. ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ మూడు పార్టీల కూటమి ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోగా, కాంగ్రెస్, ఎన్సీపీ (ఎస్పీ), శివసేన (యుబీటీ) పేలవంగా ఫలితాలను దక్కించుకున్నాయి. 288 మునిసిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో మహాయుతి 207 గెలుపొందగా, విపక్ష మహా వికాస్ అఘాడీకి 44 మాత్రమే దక్కాయి.
ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న శివసేన (యుబీటీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రె, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధినేత, సోదరుడు రాజ్ ఠాక్రె చేతులు కలపాలని నిర్ణయించారు. ఇద్దరు వేర్వేరుగా ఉండడం, కలహించుకోవడం మూలంగా మహారాష్ట్రలో బీజేపీ బలపడుతున్నదనే నిర్ణయానికి వచ్చారు. గుజరాత్ బ్రదర్స్ నరేంద్ర మోదీ, అమిత్ షా ఆధిపత్యాన్ని గండి కొట్టేందుకు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. రెండు పార్టీల మధ్య శ్రేయోభిలాషులు జరిపిన చర్చలు ఫలప్రదం కావడంతో మంగళవారం ఉద్ధవ్, రాజ్ ఒకే వేదికపై కన్పించారు. మరాఠా ప్రజలు తాము ఎప్పుడు కలుస్తా అని ఎదురు చూస్తున్నారని రాజ్ ఠాక్రె వ్యాఖ్యానించారు. మేము కలిశామని, ఇకనుంచి కలిసే పనిచేస్తామని ఉద్దవ్ తెలిపారు. బీఎంసీ తో పాటు 29 మునిసిపల్ కార్పొరేషన్లలో కలిసే పోటీ చేస్తామని సంయుక్తంగా ప్రకటించారు.
105 మరాఠా అమరుల ప్రాణత్యాగంతో సంయుక్త మహారాష్ట్ర ఏర్పాటు అయ్యిందని, ఈ ఉద్యమంలో తమ తాత ప్రభోదాంకర్ ఠాక్రె కూడా పాల్గొన్నారని తెలిపారు. ముంబై కోసం బాల్ ఠాక్రె, శ్రీకాంత్ ఠాక్రె సోదరులు పోరాడారన్నారు. ఇద్దరం కలిసి మహారాష్ట్ర ప్రైమరీ స్కూళ్లలో హిందీ భాషను రుద్ధడాన్ని ఈ ఏడాది జూలై నెలలో వ్యతిరేకించగా, రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి రద్ధు చేసిందని గుర్తు చేశారు. కొందరు ముంబై మహానగరాన్ని విధ్వంసం చేయాలని చూస్తున్నారని, అది జరగనివ్వను అని ఉద్ధవ్ స్పష్టం చేశారు. బీజేపీని ద్వేషించే వారు తమ పార్టీలో చేరవచ్చని ఆయన పిలుపునిచ్చారు. సంయుక్త మీడియా సమావేశానికి ముందుగా ముంబై శివాజీ పార్క్ లోని బాల్ ఠాక్రె సమాధి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించారు.
బీఎంసీ లో మొత్తం 227 వార్డులు ఉండగా గత ఎన్నికల్లో ఎంఎన్ఎస్, శివసేన (యూబీటీ) అత్యధిక స్థానాలు దక్కించుకున్నాయి. శివసేన (యూబీటీ)కి 84 ఉండగా, ఎంఎన్ఎస్ కు 7, బీజేపీకి 82, కాంగ్రెస్ కు 31, ఎన్సీపీ (ఎస్పీ) కు 9 స్థానాలు ఉన్నాయి. బీఎంసీ వార్షిక బడ్జెట్ రూ.75వేల కోట్లు. దేశంలోని చిన్న రాష్ట్రాలకు కూడా ఈ స్థాయిలో బడ్జెట్ ఉండదు.
