Sunetra Pawar : మహారాష్ట్ర తొలి మహిళా డిప్యూటీ సీఎంగా సునేత్ర ప్రమాణ స్వీకారం

మహారాష్ట్ర తొలి మహిళా డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం. అజిత్ పవార్ మృతి తర్వాత మహాయుతి ప్రభుత్వంలో కీలక రాజకీయ పరిణామం.

Sunetra Pawar

విధాత: ఇటీవల విమాన ప్రమాదంలో మరణించిన ఎన్సీపీ అధినేత, డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ సతీమణి సునేత్రా పవార్‌ మహారాష్ట్ర తొలి మహిళా ఉపముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేశారు. శనివారం గవర్నర్ ఆచార్య దేవవ్రత్ సునేత్రతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర మహయూతి కూటమి సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే, మంత్రులు హాజరయ్యారు. అజిత్ పవార్ వారసులుగా సునేత్రను మంత్రివర్గంలోకి తీసుకోవాలని మహయుతి కూటమి నిర్ణయించి ఆమెతో సుదీర్ఘంగా చర్చించింది. ప్రస్తుతం సునేత్ర రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు.

అంతకుముందు పార్టీ పార్లమెంటరీ బోర్డు సునేత్రను శాసనసభాపక్ష నాయకురాలిగా ఎన్నుకుంది. డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన సునేత్రకు మంత్రిత్వ శాఖల కేటాయింపుపై ఆసక్తి నెలకొంది. అజిత్ పవార్ నిర్వహించిన ఆర్థిక మంత్రిత్వ శాఖను తాత్కాలికంగా సీఎం ఫడ్నవిస్ పర్యవేక్షిస్తారని, వచ్చే నెల శాసనసభ సమావేశాల్లో 2026-27 బడ్జెట్‌ సమర్పణ అనంతరం ఆ శాఖను సునేత్రకు అప్పగిస్తారని తెలుస్తుంది. ప్రస్తుతం ఆమెకు క్రీడలు, ఎక్సైజ్ శాఖలు కేటాయించనున్నట్లుగా సమాచారం.

అజిత్‌ పవార్‌ ఆకస్మిక మృతి నేపథ్యంలో నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) చీలిక వర్గాల పునరేకీకరణ జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు భావించారు. పుణె, చించ్వాడ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో శరద్ పవార్ పార్టీ, అజిత్ పార్టీలు కలిసి పోటీ చేశాయి కూడా.రెండు చీలిక వర్గాలను విలీనం ఆలోచన పురోగతిలో ఉండగానే పవార్ మరణించారని, ఈ నేపథ్యంలో సునేత్ర మంత్రివర్గంలో చేరకపోవచ్చని భావించారు. అందుకు విరుద్దంగా సునేత్ర మహాయుతి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టడం విశేషం. సునేత్రను పార్టీ శాసనసభాపక్ష నాయకురాలిగా ఎన్నుకున్న నేపథ్యంలో అజిత్ పెద్ద కుమారుడు పార్థ్‌ పవార్‌ రాజ్యసభ కు ఎంపిక కావచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇది ఇలా ఉండగా…అజిత్‌ పవార్‌ మరణానికి దారితీసిన విమాన ప్రమాద ఘటనపై మహారాష్ట్ర నేర పరిశోధన విభాగం (సీఐడీ) విచారణ ప్రారంభించింది.

ఇవి కూడా చదవండి :

రేపు సిట్ విచారణకు కేసీఆర్…రాష్ట్ర వ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు
Delimitation Telangana | 2029లో జమిలి ఎన్నికల దిశగా తెలంగాణ…

Latest News