విధాత, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ జారీ చేసిన నోటీసుల మేరకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రేపు ఆదివారం నందినగర్ నివాసంలో విచారణకు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 3గంటలకు నందినగర్ నివాసంలో కేసీఆర్ ను సిట్ ప్రశ్నించనుంది. సిట్ నోటీసులపై కేసీఆర్ న్యాయ నిపుణులు, పార్టీ ముఖ్యులతో చర్చించిన అనంతరం రేపు విచారణకు హాజరుకావాలని నిర్ణయించుకున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు
తెలంగాణ రాష్ట్ర సాధకులుగా భావించే మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కేసీఆర్ ను సిట్ విచారణకు పిలవడాన్ని నిరసిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని బీఆర్ఎస్ నాయకత్వం పిలుపునిచ్చింది. అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో బైక్ ర్యాలీలు, నల్లజెండాలు, బ్యాడ్జీలతో బైక్ ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు, రాస్తారోకోలు నిర్వహించాలని బీఆర్ఎస్ పిలుపునివ్వడం జరిగింది. దీంతో రేపటి ఆదివారం ఓ వైపు కేసీఆర్ ను సిట్ విచారణ..మరోవైపు నిరసనలతో ఆసక్తికర పరిణామాలకు వేదిక కాబోతుంది. అయితే చట్టబద్ద ప్రక్రియలో భాగంగా జరిగే కేసీఆర్ విచారణ వ్యవహరంపై బీఆర్ఎస్ నిరసనల పేరుతో రాజకీయ రచ్చ చేస్తుందంటూ కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయంగా మైలైజీ సాధించేందుకు బీఆర్ఎస్ కేసీఆర్ విచారణపై నిరసనల డ్రామాలకు తెరలేపిందని కాంగ్రెస్ వర్గాలు విమర్శలు సంధిస్తున్నాయి.
బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ ఆరోపణలను కొట్టిపారేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలు, ఎన్నికల హామీలపై నిలదీతలను సహించలేక, ప్రభుత్వం అవినీతి అక్రమాలు బయటపెడుతుండటాన్ని జీర్ణించుకోలేక ప్రజల దృష్టిని మళ్లీంచేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులను విచారణల పేరుతో రాజకీయ వేధింపులకు గురి చేస్తుందంటూ విమర్శిస్తుంది. అందుకే కాంగ్రెస్ డైవర్షన్ రాజకీయాలను, కక్ష సాధింపు చర్యలను ప్రజల్లో ఎండగట్టేందుకే రేపు నిరసనలు నిర్వహిస్తున్నామని బీఆర్ఎస్ పేర్కొంది. కేసీఆర్ తానుంటున్న నివాసం అడ్రస్‌తో సహా పోలీసులకు రిప్లై ఇచ్చినప్పటికి కూడా ..ఆయన ఉంటున్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్ ను కాదని, ఆయన ఉండని నివాసానికి రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించి పైశాచిక ఆనందం పొందడం ప్రభుత్వది అహంకారానికి నిదర్శనమని ఆరోపించింది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి భయంతోనే సీఎం రేవంత్ సిట్ పేరిట కేసీఆర్ కు నోటీసులు పంపారని బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ శ్రేణుల దృష్టి మున్సిపల్ ఎన్నికలల్లో ఉండకుండా చేసేందుకే కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చారని ఆరోపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Ambati Rambabu : సీఎం చంద్రబాబుపై అంబటి తీవ్ర వ్యాఖ్యలు.. గోరంట్లలో టెన్షన్
Medaram Traffic Collapse | కుప్పకూలిన మేడారం ట్రాఫిక్ నియంత్రణ.. 14 గంటలపాటు భక్తులకు నరకం
