Gold | భారతీయులు బంగారం( Gold ) అంటే పడిచస్తారు. ఎందుకంటే బంగారు ఆభరణాలు( Gold Ornaments ) ధరించడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఆభరణాలు మనిషిని ఆకర్షణీయంగా కూడా తయారు చేస్తాయి. కాబట్టి ప్రతి శుభకార్యానికి బంగారు ఆభరణాలు ధరిస్తారు. అందుకే భారతీయులు బంగారంపై మక్కువ చూపిస్తారు. అయితే ఇటీవలి కాలంలో బంగారం ధరలు( Gold Rates ) భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. భారతీయ గృహాల వద్ద ఉన్న మొత్తం బంగారం విలువ మన దేశ మొత్తం ఆర్థిక వ్యవస్థ పరిమాణం కంటే ఎక్కువగా ఉందట. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. పెరిగిన బంగారం ధరల రీత్యా ఇది అక్షరాలా నిజం.
తాజా అంచనాల ప్రకారం.. దేశంలోని కుటుంబాల వద్ద సుమారు 30 వేల టన్నుల బంగారం ఉందట. ప్రస్తుతం మార్కెట్ ధరల ప్రకారం ఈ బంగారం విలువ సుమారు 5 ట్రిలియన్ డాలర్లు. అంటే రూ. 420 లక్షల కోట్లు అన్నమాట. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నివేదిక ప్రకారం.. 2025 నాటికి దేశ జీడీపీ 4.125 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. అంటే దేశం మొత్తం ఉత్పత్తి చేసే ఆదాయం కంటే.. మన ఇళ్లలో ఉన్న బంగారం విలువే దాదాపు ఒక ట్రిలియన్ డాలర్ల వరకు ఎక్కువగా ఉంది. 2025 సంవత్సరంలోనే బంగారం ధరలు ఏకంగా 65 శాతం పెరగడం ఈ విలువ పెరగడానికి ప్రధాన కారణం.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా..
కేవలం సామాన్యులే కాదు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా గత 10 ఏళ్లుగా బంగారం నిల్వలను పెంచుకుంటుంది. ఈ క్రమంలో బంగారం నిల్వలను ఆర్బీఐ 57.81 శాతం పెంచుకుంది. ప్రస్తుతం ఆర్బీఐ వద్ద 800 టన్నుల బంగారం ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. డాలర్ మీద ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి, అంతర్జాతీయ ఆర్థిక ఒడిదుడుకుల నుంచి దేశాన్ని రక్షించుకోవడానికి ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంటోంది. “గతంలో చమురు ధరలు ప్రపంచ ఉద్రిక్తతలకు నిదర్శనంగా ఉండేవి, ఇప్పుడు బంగారం ధరలే గ్లోబల్ టెన్షన్లకు బేరోమీటర్‌గా మారాయి” అని ఆర్బీఐ గవర్నర్ ఇటీవల పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యధికంగా బంగారం నిల్వలు ఉన్న దేశాల్లో ఇండియా 8వ స్థానంలో ఉందని తేలింది.
ఏది ఏమైనా ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పుల వల్ల గోల్డ్ (Gold) కు ఉన్న డిమాండ్ ఎప్పటికీ తగ్గదు. అది సామాన్య ఇల్లాలు అయినా శక్తివంతమైన ఆర్బీఐ అయినా.. పసిడిపై ఉన్న నమ్మకం మాత్రం అచంచలం.
