Babar Azam | టీ20 వరల్డ్ కప్‌లో సూపర్-8 మ్యాచులు కొనసాగుతున్నాయి. సెమిస్ బెర్తు కోసం జట్లు పోటీపడుతున్నాయి. పొట్టి ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించింది. టోర్నీలో జట్టు ప్రదర్శనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్‌కు సంబంధించి సంచలన ఆరోపణలు వస్తున్నాయి. పాక్‌కు చెందిన ముబాషిర్ లుక్మాన్ అనే సీనియర్ జర్నలిస్ట్ కెప్టెన్ బాబర్ ఆజమ్ సహా జట్టుపై సంచనల ఆరోపణలు చేశారు. బాబార్ ఆజామ్‌కు ఖరీదైన కారు బహుమతి అందిందంటూ ఆయన తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
గతేడాది చివరలో బాబర్, అతడి సోదరుడు ఖరీదైన ఆడి ఈ-ట్రాన్ జీటీ కారును బహుమతిగా ఇచ్చాడని.. ఈ కారు విలువ పాక్ కరెన్సీలో రూ.7కోట్ల నుంచి రూ.8కోట్ల వరకు ఉండవచ్చని చెప్పాడు. అంత ఖరీదైన కారుని బహుమతిగా ఇచ్చిన బాబర్ అన్నయ్య ఏం చేస్తాడా? అనే అన్వేషించానని.. కానీ అతను ఏం చేయడని తెలిసి ఆశ్చర్యపోయానని ముబాషిర్ తెలిపారు. అయితే.. చిన్న జట్లపై ఓడిపోయినప్పుడు ప్లాట్లు, కార్లు రావన్న ఆయన.. ఆ సమయంలో ఎవరిస్తారని ఓ వ్యక్తి నాతో అన్నారని.. ఇవి తీవ్రమైన ఆరోపణలు అని నేను పేర్కొనగా ఎవరేం చేస్తున్నారో అందరికీ తెలుసు అంటూ అతను బదులిచ్చాడన్నారు. ఈ వ్యాఖ్యలు పాకిస్థాన్ జట్టుపై మ్యాచ్ ఫిక్సింగ్ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
ఇదిలా ఉండగా.. పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై స్పాట్ ఫిక్సింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై పీసీబీ స్పందించింది. ఫిక్సింగ్ ఆరోపణలు చేసేవారంతా ఆధారాలు చూపించాలని డిమాండ్ చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పీసీబీ వర్గాలు హెచ్చరించాయి. సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతున్న విషయంపై తమకు అవగాహన ఉందని, పరిమితికి లోబడే విమర్శలు చేయాలని పీసీబీకి చెందిన ఓ అధికారి సూచించారు. ఫిక్సింగ్ ఆరోపణలు నిరాధారమన్న ఆయన.. ఆ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి ఆరోపణలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించలేమని స్పష్టం చేశారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై పీసీబీకి ఎలాంటి సందేహాలు లేవని, అలాంటప్పుడు ఎందుకు విచారణ చేపట్టాలంటూ ఆయన ప్రశ్నించారు.