Site icon vidhaatha

Geoffrey Boycott | మళ్లీ ఆస్పత్రిపాలైన క్రికెట్ దిగ్గజం జెఫ్రీ బాయ్‌కాట్‌.. విషమంగా ఆరోగ్యం..!

Geoffrey Boycott : ఇంగ్లండ్‌ (England) క్రికెట్ దిగ్గజం జెఫ్రీ బాయ్‌కాట్ (Geoffrey Boycott) మళ్లీ ఆస్పత్రిలో చేరారు. ఇటీవలే గొంతు క్యాన్సర్‌ బారినపడి శస్త్రచికిత్స చేయించుకున్న బాయ్‌కాట్‌ ఆ తర్వాత డిశ్చార్జి అయ్యి ఇంటికి వెళ్లారు. అయితే ఇప్పుడు మరోసారి ఆరోగ్యం విషమించడంతో ఆయనను ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు.

నిమోనియా కారణంగా ఆరోగ్యం విషమంగా మారిందని బాయ్‌కాట్‌ కుమార్తె ఎమ్మా తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆమె ఒక పోస్టు పెట్టారు. ‘మా నాన్న జెఫ్రీ కోలుకోవాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మద్దతు ఇస్తున్న అశేషమైన అభిమానులను చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది. అయితే దురదృష్టవశాత్తు ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త విషమంగానే ఉంది. నిమోనియా పెరగడంతో మా నాన్న తిండి తినలేకపోతున్నారు. కనీసం ద్రవ పదార్థాలు కూడా తీసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. దాంతో ఆయనను ఆస్పత్రికి తరలించాం. వెంటిలేషన్‌ మీద ఉన్నారు. ట్యూబ్‌ ద్వారా ఆహారం అందిస్తున్నాం’ అని బాయ్‌కాట్‌ అధికారిక ఖాతాలో ఆమె పోస్టు చేశారు.

కాగా 83 ఏళ్ల బాయ్‌కాట్‌ తొలిసారి 2002లో క్యాన్సర్‌ బారినపడ్డారు. చాలా రోజులు పోరాడి కోలుకున్నారు. కీమో థెరఫీ చేయించుకున్నారు. ఈ ఏడాది మే నెలలో క్యాన్సర్‌ తిరగబెట్టడంతో మరోసారి శస్త్రచికిత్స తప్పలేదు. ఈ క్రమంలో మళ్లీ అతడి ఆరోగ్యం విషమించింది. దాంతో ఆయన కుటుంబం బాయ్‌కాట్‌ను మరోసారి ఆస్పత్రిలో చేర్పించింది.

Exit mobile version