HCA irregularities | హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో అక్రమాల కేసులో సీఐడీ విచారణలో పలు సంచలన అంశాలు వెలుగు చూశాయి. హెచ్ సీఏ నిధుల దుర్వినియోగంపై టీసీఏ అధ్యక్షుడు ధరం గురువారెడ్డి ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సీఐడీ విచారణలో కీలక అంశాలు గుర్తించింది. హెచ్ సీఏ సభ్యులు, జగన్ మోహన్ రావు మధ్య భారీగా ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. నిధులను జగన్ మోహన్ రావు గోల్ మాల్ చేసినట్లు నిర్ధారించారు. హెచ్ సీఏ నిధుల దుర్వినియోగం కేసులో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, హెచ్‌సీఏ కోశాధికారి శ్రీనివాసరావు, సీఈవో సునీల్ అరెస్ట్ అయ్యారు. అలాగే శ్రీచక్ర క్రికెట్ క్లబ్‌కు చెందిన రాజేందర్ యాదవ్, అతని భార్య కవితను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. వాని నుంచి ఫోర్జరీ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
హెచ్‌సీఏ అధ్యక్ష ఎన్నికల్లో జగన్మోహన్‌రావు నకిలీ పత్రాలు సమర్పించినట్లు అధికారులు గుర్తించారు. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరుతో నకిలీ పత్రాలను జగన్మోహన్ రావు సృష్టించారు. గౌలిపురా క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ సి. కృష్ణ యాదవ్ సంతకం ఫోర్జరీ చేశారు. కృష్ణ యాదవ్ సంతకాన్ని శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ కవిత ఫోర్జరీ చేశారు. ఆ ఫోర్జరీ పత్రాలను జగన్మోహన్‌రావుకు రాజేందర్ భార్య కవిత అందించినట్లు సీఐడీ వెల్లడించింది. జగన్మోహన్‌రావుకు కోశాధికారి శ్రీనివాస్‌రావు, సీఈవో సునీల్ సహకరించినట్లు ఆధారాలు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రావు, శ్రీనివాస్‌రావు, సునీత్, రాజేందర్ యాదవ్, కవితను అరెస్ట్ చేశారు. నిందితులపై 465, 468, 471, 403, 409, 420 r/w 34 ఐపీసీ కింద కేసులు నమోదు చేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్, హెచ్‌సీఏ మధ్య ఐపీఎల్ టికెట్ల వివాదంలో కూడా సీఐడీ విచారణ చేపడుతోంది. అదనపు టికెట్ల కోసం సన్ రైజర్స్ ను జగన్మోహన్‌రావు బ్లాక్ మెయిల్ చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.