హైదరాబాద్ వేదికగా భారత్ – బంగ్లాదేశ్(India – Bangladesh)ల మధ్య జరిగిన ఆఖరి టి20(T20 match) పోరులో భారత్ రికార్డు స్కోరు నమోదు చేసింది. సంజూ శాంసన్, సూర్యకుమార్ విరుచుకుపడటంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 297 పరుగుల భారీ స్కోరు చేసింది(297/6). తదనంతరం బంగ్లా తన 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది(164/7). భారత్ 133 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించి, సిరీస్‌ను 3–0తో క్లీన్ స్వీప్ చేసింది.
20 ఓవర్లు, 120 బంతులు, 297 పరుగులు, 22 సిక్సర్లు, 25 ఫోర్లు..
ఇవి ఓ ఊచకోతకు సాక్ష్యాలు. దీనికి వేదిక హైదరాబాద్. భారత్, బంగ్లాల తుది టి20 పోరులో ఇండియా బ్యాటింగ్‌లో పెను విధ్వంసం సృష్టించింది. భారత ఇన్నింగ్స్ ఆద్యంతం రికార్డులతో హోరెత్తిపోయింది.
టాలెంట్ ఉన్నా, దురదృష్టం వెంటాడుతున్న సంజూ శాంసన్(Sanju Samson)దే ఈ రోజు. బంగ్లాదేశ్ బౌలర్లపై నిర్దాక్ష్యిణ్యంగా విరుచుకుపడి సంజూ బాదిన బౌండరీలతో ఉప్పల్ స్టేడియం తడిసి ముద్దయింది. సంజూ పరుగుల జోరువానకు తోడు కెప్టెన్ సూర్య(Surya Kumar Yadav) సుడిగాలితో పరుగుల సునామీ హైదరాబాద్‌ను ముంచెత్తింది. తామేమీ తక్కువ కాదన్నట్లు వచ్చినవారు వచ్చినట్లు బాదుడే బాదుడయ్యేసరికి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 297 పరుగుల రికార్డు స్కోరు నమోదు చేసింది. ఇందులో 232 పరుగులు కేవలం సిక్స్‌లు, ఫోర్ల ద్వారా వచ్చేనవే అంటే దాడి ఏ స్థాయితో ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతర్జాతీయ టి20ల్లో భారత్‌కిదే అత్యధిక స్కోరు(India’s highest score in T20Is). మొత్తం టి20 ఇంటర్నేషనల్స్‌లో రెండో అత్యధికం. మొదటి స్థానంలో నేపాల్ ఉంది. ఆసియా గేమ్స్‌లో నేపాల్, మంగోలియాపై 314 పరుగులు చేసింది. అయితే టెస్ట్‌లు ఆడే దేశాలకు సంబంధించి ఇదే అత్యధిక టి20 స్కోరు.
ఓపెనర్‌గా వచ్చిన సంజూ శాంసన్, అభిషేక్ శర్మలు ధాటిగానే బ్యాటింగ్ ప్రారంభించారు. సంజూ ఆదినుండే దంచుడు మొదలుపెట్టాడు. అభిషేక్ ఒక ఫోర్ కొట్టి, 23 పరుగుల స్కోరు వద్ద అవుటయ్యాడు. ఆ తర్వాత మొదలైంది హరికేన్ విధ్వంసం. కెప్టెన్ సూర్య, సంజూతో జత కలిసి వానకు గాలిలా తోడయ్యాడు. వీరిద్దరూ 2 వికెట్‌కు 173 పరుగులు(173 runs for 2nd wicket) జోడించారు. ముఖ్యంగా సంజూ శాంసన్‌ను ఆపే బౌలరే కరువయ్యాడు. ఇన్నింగ్స్ పదో ఓవర్లో, రిషద్ హొస్సేన్ బౌలింగ్‌లో మొదటి బంతిని వదిలి, మిగిలిన 5 బంతులను సిక్సర్లు( 5 Sixers in 10th Over)గా మలిచాడు. అంతర్జాతీయ టి20ల్లో తన తొలి సెంచరీ నమోదు చేసిన సంజూ (47 బంతుల్లో 111 పరుగులు: 8 సిక్స్‌లు, 11 ఫోర్లు ) ముస్తఫిజుర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. తర్వాత కొద్దిసేపటికే సూర్య(35 బంతుల్లో 75: 5 సిక్స్‌లు, 8 ఫోర్లు) కూడా పెవిలియన్ చేరాడు. కానీ, పరుగుల వేగం ఏమాత్రం తగ్గలేదు. రియాన్ పరాగ్(13 బంతుల్లో 34: 4 సిక్స్‌లు, 1ఫోర్) హార్థిక్ పాండ్యా(18 బంతుల్లో 47: 4 సిక్స్‌లు, 4 ఫోర్లు), చివర్లో ఒక సిక్స్‌తో రింకూ ఇన్నింగ్స్‌ను ముగించాడు. దాంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది.
అనంతరం అసాధ్యమైన లక్ష్యాన్ని చేధించేందుకు బ్యాటింగ్‌కు వచ్చిన బంగ్లాలు కూడా ధాటిగానే ఆరంభించారు. వికెట్లు పడుతున్నా, వారు కూడా తగ్గకుండా బ్యాటింగ్ కొనసాగించారు. పోరాడి ఓడాలన్న వాళ్ల ఆలోచన వారితో 164 పరుగులు చేయించింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసి ఓటమి పాలైంది. బంగ్లా బ్యాటర్లలో తౌహీద్ హృదయ్(63), లిటన్ దాస్(42) ఓ మాదిరి పోరాటం చేసినా, మిగతా వారు ఎవరూ నిలబడలేకపోయారు.