India Beat New Zealand as Kohli, Gill Lead 301-Run Chase
విధాత క్రీడా విభాగం | హైదరాబాద్:
న్యూజీలాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వడోదరాలో జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత్ విజయదుంధుభి మోగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ విసిరిన 301 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఇంకో ఓవర్ మిగిలుండగానే ఛేదించి సిరీస్‌లో 1–0తో ముందంజ వేసింది.
విరాట్ – శుభమన్ : బలంగా నిలబడ్డారు
భారీ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన భారత్ ఆరంభంలో కొంచెం ఇబ్బందిపడినా, తర్వాత హిట్‌మ్యాన్ రోహిత్ బౌండరీలతో గాడిలో పడింది. మరోపక్క కెప్టెన్, ఓపెనర్ శుభమన్ గిల్ ప్రారంభంలో తడబడ్డా, కాసేపటికి కుదురుకుని సింగిల్స్‌తో పరుగుల వేగం పెంచాడు. జట్టు పరుగులు 39 వద్ద ఉన్నప్పుడు రోహిత్(26) అవుట్ కాగానే క్రీజ్‌లోకి వచ్చిన కింగ్ కోహ్లీ ఆట స్వరూపాన్నే మార్చేసాడు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ కొండంత లక్ష్యాన్ని అలవోకగా కరిగించాడు. కెప్టెన్‌తో కలిసి రెండో వికెట్‌కు 112 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన కోహ్లీ, గిల్ అర్థ సెంచరీ(56 పరుగులు, 2 సిక్స్‌లు, 3 ఫోర్లు) చేసి ఔటయ్యాక, శ్రేయస్ అయ్యర్‌తో ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. 234 పరుగుల వద్ద కోహ్లీ(93 పరుగులు, 1 సిక్స్, 8 ఫోర్లు) దురదృష్టవశాత్తు త్రుటిలో సెంచరీ చేజార్చుకుని అవుటవగా, అయ్యర్(49) అర్థసెంచరీ మిస్సయ్యాడు. భారత్ 13 బంతుల వ్యవధిలో కోహ్లీ, జడేజా, శ్రేయస్ అయ్యర్ వికెట్లను కోల్పోయింది. కేఎల్ రాహుల్, హర్షిత్ రాణా మిగిలిన ఆటను ముగించే దశకు చేరుకున్నాక రాణా(29) పెవిలియన్ చేరుకున్నాడు. క్రీజ్‌లోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్‌తో కలిసి రాహుల్(29*) మిగిలిన లాంఛనాన్ని పూర్తిచేసాడు. భారత్ లక్ష్యఛేదనలో భాగంగా 6 వికెట్లు కోల్పోయినా, అందులో 3 వెంటవెంటనే పోగొట్టుకున్నా, ఎక్కడా తడబడకుండా గమ్యాన్ని చేరుకోవడం విశేషం.
‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డులు
ఇదే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. అత్యంత వేగంగా 28వేల అంతర్జాతీయ పరుగులు సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. అంతేకాకుండా మొత్తంగా అత్యధిక పరుగుల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. మొదటి స్థానంలో మాస్టర్ సచిన్ టెండుల్కర్ 34,357 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.
న్యూజీలాండ్ బౌలర్లలో కైల్ జేమీసన్ విజృంభించి 4 వికెట్లు తీసుకోగా, ఈ మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసిన ఇద్దరు ఆటగాళ్లు ఆదిత్య అశోక్, క్రిస్టియన్ క్లార్క్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.
ఓపెనింగ్, ఫినిషింగ్ అదరగొట్టిన న్యూజీలాండ్
అంతకుముందు, టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన కివీస్ ఓపెనర్లు ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. ఓపెనర్లు డెవాన్ కాన్వే 56, హెన్రీ నికల్స్ 62 పరుగులు చేసి మొదటి వికెట్‌కు 117 పరుగులు జత చేశారు. ఈ భాగస్వామ్యం వల్ల భారత్‌పై ఒత్తిడి పెరిగింది. అయితే మధ్య ఓవర్లలో హర్షిత్ రాణా అద్భుతంగా బౌలింగ్ చేసి, కాన్వే–నికల్స్ ఇద్దరినీ పెవిలియన్‌కు పంపించాడు. అక్కన్నుంచి వికెట్లు కూలడం మొదలైంది. ఒక దశలో 117/0 తో ఉన్నకివీస్ కాసేపటికి 198/5కి పడిపోయింది. ఈ దశలో జట్టును నిలబెట్టింది డారిల్ మిచెల్. 71 బంతుల్లో 84 పరుగులు (5 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి న్యూజిలాండ్ స్కోరును మళ్లీ గాడిలో పెట్టాడు. చివర్లో తొలి మ్యాచ్ ఆడుతున్న క్రిస్టియన్ క్లార్క్ 24 పరుగులు చేసి జట్టును 300 పరుగులకు చేర్చాడు.
భారత్ బౌలర్లలో హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ తలో రెండు వికెట్లు తీసుకోగా, సిరాజ్, కుల్దీప్ చెరో వికెట్ తీసుకున్నారు. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1 – 0 తో ముందడుగు వేసింది. రెండో వన్డే ఈనెల 14న రాజ్‌కోట్‌లో జరుగనుంది.
